వసతి ‘లేని’ గృహాలు
ABN , Publish Date - Aug 05 , 2024 | 01:19 AM
‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ’ అంటూ ప్రసంగాలు చేసిన నాటి సీఎం జగన్ గత ఐదేళ్లుగా వారి సంక్షేమాదన్ని గాలికొదిలేశారు. ఆయా వర్గాల విద్యార్థుల చదువుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల నిర్వహణను పూర్తిగా విస్మరించారు.
ఫ దుస్థితిలో సంక్షేమ హాస్టళ్లు
ఫ శిథిల.. అద్దె భవనాల్లో విద్యార్థుల అగచాట్లు
ఫ వెంటాడుతున్న గత పాలకుల పాపాలు
‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ’ అంటూ ప్రసంగాలు చేసిన నాటి సీఎం జగన్ గత ఐదేళ్లుగా వారి సంక్షేమాదన్ని గాలికొదిలేశారు. ఆయా వర్గాల విద్యార్థుల చదువుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల నిర్వహణను పూర్తిగా విస్మరించారు. ఐదేళ్లలో రూపాయి కూడా విదల్చకపోవడంతో భవనాల నిర్వహణ, శుభ్రత మచ్చుకైనా కనిపించడం లేదు. అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమవిద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. శిథిల భవనాలు, పెచ్చులూడిన పైకప్పులతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నడుమ చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.
- చిత్తూరు
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 41 ప్రీమెట్రిక్, 16 పోస్టు మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో మూడు వేల మందికి పైగా విద్యార్థులు ఆశ్రయం పొందుతూ చదువుకుంటున్నారు. బీసీ సంక్షేమశాఖ పరిధిలో 25 ప్రీమెట్రిక్, 13 పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో రెండు వేల మంది వరకు ఉంటున్నారు. అలాగే చిత్తూరు శివారులోని పూనేపల్లె క్రాస్‌లో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన వసతి గృహంలో మూడు నుంచి పదో తరగతి వరకు 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరులోని వసతి గృహంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ఇస్తామని చెప్పారే గాని ప్రస్తుతం అక్కడ ఒక్కరు కూడా లేరు.
ఐదేళ్లలో జాడే లేని సంక్షేమం
ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలు మూడు పూటలా తిని చదువుకుంటారనే ఆశతో ఇక్కడ చేర్పిస్తుంటారు. తిండి, దుస్తులు, పుస్తకాలు, కాస్మొటిక్ ఛార్జీల కింద కొంత డబ్బు వస్తుందనే నమ్మకం. ఆ దిశగా గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అడుగులు వేయలేదు. నిధులు ఇవ్వకపోవడంతో నాణ్యత లేని భోజనం తినలేక విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఏ విద్యా సంవత్సరంలోనూ సరైన సమయానికి యూనిఫాం, పుస్తకాలు ఇవ్వలేదు. కాస్మొటిక్ చార్జీల ప్రస్తావనే లేదు. ఈ క్రమంలో ఆ భారాన్ని తల్లిదండ్రులే భరించాల్సిన పరిస్థితి నెలకొంది.
కిటికీలు లేని గదులు..తలుపుల్లేని మరుగుదొడ్లు
జిల్లాలోని ఏ వసతి గృహానికి వెళ్లినా దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల మరుగుదొడ్లకు తలుపులు లేవు. కొన్ని చోట్ల తలుపులు పూర్తిగా పాడైపోయాయి. పాత బెడ్‌షీట్లను అడ్డం పెట్టుకుని విద్యార్థినులు స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. శాంతిపురం మండలం దండికుప్పం, రాళ్లబూదుగూరులోని హాస్టళ్ల భవనాలు పెచ్చులూడి పడుతున్నాయి. పూతలపట్టు మండలంలోని ఎస్సీ హాస్టల్‌లో కిటికీలు విరిగిపోయాయి. బంగారుపాళ్యం హాస్టల్‌లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయి కొన్ని ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండాపోయింది. వసతి గృహాల ఆవరణలో విద్యుత్ దీపాలు, ప్రహరీలకు సరైన గేట్లు లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోతోంది. నీటి వసతి లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నీరు సరిపోకపోవడంతో బయట చేతిపంపుల వద్దకు వెళ్లి స్నానాలు చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. పది మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డిని నిర్మించంతో చాలా మంది ఇప్పటికీ ఆరు బయటే బహిర్బూమికి వెళ్లివస్తున్నారు. ఈ కారణంగా హాస్టళ్లలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.