సౌదీలో బాధితురాలికి బాసటగా కందూరువాసి
ABN , Publish Date - Aug 07 , 2024 | 03:18 AM
‘అప్పుల బాధ నుంచి గట్టెక్కాలని డబ్బు సంపాదన కోసం సౌదీఅరేబియాకు వచ్చాను. ఇక్కడ సేఠ్‌లు నాకు నరకాన్ని చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇండియాకు రప్పించండి సార్..’ అంటూ ఓ మహిళ పంపిన వీడియో వైరల్‌గా మారింది. ట్విటర్‌లో దీనిని కొందరు మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేశారు. ఆయన చొరవతో సౌదీలోని ఏపీ ఎన్నార్టీ ప్రతినిధి, సోమల మండలం కందూరుకు చెందిన చిట్టలూరి రంజిత్ ఆమెకు బాసటగా నిలిచారు.
‘అప్పుల బాధ నుంచి గట్టెక్కాలని డబ్బు సంపాదన కోసం సౌదీఅరేబియాకు వచ్చాను. ఇక్కడ సేఠ్‌లు నాకు నరకాన్ని చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇండియాకు రప్పించండి సార్..’ అంటూ ఓ మహిళ పంపిన వీడియో వైరల్‌గా మారింది. ట్విటర్‌లో దీనిని కొందరు మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేశారు. ఆయన చొరవతో సౌదీలోని ఏపీ ఎన్నార్టీ ప్రతినిధి, సోమల మండలం కందూరుకు చెందిన చిట్టలూరి రంజిత్ ఆమెకు బాసటగా నిలిచారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం తురకపల్లికి చెందిన హసీనా(25)కు స్వగ్రామంలోనే హసన్‌అలీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఆర్థిక సమస్యల నేపథ్యంలో నెల కిందట సౌదీ వెళ్లిన ఆమె.. అక్కడ వేధింపులు భరించలేక వీడియో పెట్టారు. తనను రక్షించాలంటూ మంత్రి నారా లోకేశ్‌కు చేసిన విన్నపం ఫలించింది. ఆయన చొరవతో సౌదీ అరేబియాలోని ఏపీ ఎన్నార్టీ ప్రతినిధి, సోమల మండలం కందూరుకు చెందిన చిట్టలూరి రంజిత్, మరో ప్రతినిధి ముజ్జమ్మీల్ షేక్ సాయంతో మంగళవారం హసీనాను సురక్షితంగా రియాద్ నగరంలోని భారతీయ ఎంబసీ అధికారులకు అప్పగించారు. కొన్ని రోజుల నుంచి సరిగా తిండిలేక నీరసించిపోయిన అమెకు భోజన ఏర్పాట్లు చేయించారు. ఆర్థికసాయం అందించారు. ఈమెను సురక్షితంగా చేర్చిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణతో పాటు విజయవాడలోని ఏపీ ఎన్నార్టీ అధికారులకు కూడా వారు సమాచారమిచ్చారు. సౌదీ అధికారుల సాయంతో ఆమె వీసాను రద్దు చేసి స్వదేశానికి పంపించడానికి ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తారని రంజిత్ చెప్పారు.
- ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి