Share News

ఐఐటీ, ఐసర్‌, ట్రిపుల్‌ ఐటీ విద్యాసంస్థల ప్రారంభం

ABN , Publish Date - Feb 21 , 2024 | 01:03 AM

తిరుపతి ఐఐటీ, ఐసర్‌, శ్రీసిటీ ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలు జాతికి అంకితమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జమ్మూ రాష్ట్రం నుంచీ ఈ ఉన్నత విద్యాసంస్థలను వర్చువల్‌గా ప్రారంభించారు.

ఐఐటీ, ఐసర్‌, ట్రిపుల్‌ ఐటీ  విద్యాసంస్థల ప్రారంభం

ఏర్పేడు, ఫిబ్రవరి 20 : తిరుపతి ఐఐటీ, ఐసర్‌, శ్రీసిటీ ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలు జాతికి అంకితమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జమ్మూ రాష్ట్రం నుంచీ ఈ ఉన్నత విద్యాసంస్థలను వర్చువల్‌గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఐఐటీ, ఐసర్‌, ఐఐఎం తదితర 36 జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలను ప్రధాని ప్రారంభించగా అందులో జిల్లాకు చెందిన మూడు సంస్థలు వున్నాయి. ఏర్పేడు మండలంలోని ఐఐటీ క్యాంప్‌సలో జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రధాని మోదీ ప్రసంగాన్ని భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ఆహూతులకు ప్రదర్శించారు.గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌, ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడ నుంచీ వర్చువల్‌గా పాల్గొనగా ఐఐటీ క్యాంప్‌సలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఐఐటీ డైరెక్టర్‌ కె.ఎన్‌.సత్యనారాయణ,పీఆర్వో చమన్‌ మెహతా, ప్రోగ్రాం ఆఫీసర్‌ మహే్‌షకుమార్‌, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐసర్‌లో కార్యక్రమానికి ఎంపీ గురుమూర్తి, కలెక్టర్‌ లక్ష్మీశా,ఐసర్‌ డైరెక్టర్‌ శాంతను భట్టాచార్య హాజరయ్యారు. రాష్ట్ర విభజన చట్టం కింద కేంద్రం ఏపీకి మంజూరు చేసిన ఐఐటీ, ఐసర్‌లను అప్పటి సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే. వీటిలో ఐఐటీ 2014లో తిరుపతిలోని చదలవాడ కళాశాలల ప్రాంగణంలోని అద్దె భవనాల్లో ప్రారంభం కాగా 2015 మార్చిలో రాష్ట్రప్రభుత్వం ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీలో 548 ఎకరాలు కేటాయించింది. భవనాల నిర్మాణానికి రూ. 863 కోట్లు, విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి కోసం రూ. 230 కోట్లు చొప్పున కేంద్రం సుమారు రూ. 1093 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికి తొలిదశ నిర్మాణాలు పూర్తి చేసుకోవడంతో ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రస్తుతం ఐఐటీలో 1550 మంది విద్యార్ధులుండగా అందులో 900 మంది బీటెక్‌ విద్యార్థులు, మిగిలిన వారు పీజీ కోర్సులు చేస్తున్నారు. ఇక ఐసర్‌ (ఇండిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి) విషయానికొస్తే 2015లో తిరుపతి నగరం కరకంబాడి రోడ్డులోని మంగళం వద్ద తాత్కాలిక భవనాల్లో ఏర్పాటైంది. 2016లో ఏర్పేడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం 255 ఎకరాల భూమి కేటాయించింది. కేంద్రం విడుదల చేసిన రూ. 1437.91 కోట్లతో ఐసర్‌ తొలి దశ నిర్మాణాలు పూర్తి చేసుకుంది. 35 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇపుడు 1100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ట్రిపుల్‌ ఐటీ సత్యవేడులో శ్రీసిటీ సెజ్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది.

Updated Date - Feb 21 , 2024 | 01:03 AM