Share News

పెరిగిన హత్యలు.. అత్యాచారాలు

ABN , Publish Date - Dec 30 , 2024 | 01:13 AM

జిల్లా పరిధిలో గతేడాదితో పోలిస్తే హత్యలు, అత్యాచారాలు పెరిగాయి. 2023 తో పోలిస్తే సాధారణ నేరాలు దాదాపు 3.45 శాతం తక్కువగా నమోదయ్యాయి. సైబర్‌ నేరాలు ఈ ఏడాది అంతకంత పెరగడం ఆందోళన కలిగించే విషయం. నాలుగు నెలలుగా జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలతో ఈ ఏడాది నేరాలు కొంత వరకు అదుపులోనే వున్నాయి.

పెరిగిన హత్యలు.. అత్యాచారాలు
మే 27వ తేదీన చంద్రగిరి మండలం కొంగరవారిపల్లె వద్ద జరిగిన ప్రమాదం

జిల్లా పరిధిలో గతేడాదితో పోలిస్తే హత్యలు, అత్యాచారాలు పెరిగాయి. 2023 తో పోలిస్తే సాధారణ నేరాలు దాదాపు 3.45 శాతం తక్కువగా నమోదయ్యాయి. సైబర్‌ నేరాలు ఈ ఏడాది అంతకంత పెరగడం ఆందోళన కలిగించే విషయం. నాలుగు నెలలుగా జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలతో ఈ ఏడాది నేరాలు కొంత వరకు అదుపులోనే వున్నాయి.

ఇంటికి నిప్పుపెట్టి..

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు పెరిగాయి. గతేడాది 39 జరగ్గా.. ఈ ఏడాది ఆ సంఖ్య 52కు చేరుకుంది. వీటిలో ప్రధానంగా.. పాకాల మండలం దామలచెరువు పంచాయతీ కేసవనగర్‌ ఘటన చోటుచేసుకుంది. జ్యోతిప్రసాద్‌, ఆయన భార్య పార్వతి, సమీప బంధువు మహేష్‌ జనవరి 30న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. వీరి కేకలతో ఇరుగు పొరుగువారు తలుపులు బద్దలు కొట్టి నీళ్లుపోసి మంటలను అదుపు చేశారు. గాయపడిన ముగ్గురిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. వారం రోజుల్లో ఈ ముగ్గురూ అసువులు బాశారు.

అత్యాచారాలు.. హత్యాచారాలు

జిల్లా వ్యాప్తంగా గతేడాది 38 అత్యాచారాలు జరగ్గా.. ఈ ఏడాది 49కి పెరిగాయి. డీవీ సత్రం ప్రాంతంలో జూలై 17న ఎనిమిదేళ్ల బాలికను ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు.నవంబరు 1న వడమాలపేట మండలంలో ఓ బాలికపై సమీప బంధువే హత్యాచారానికి ఒడిగట్టాడు.

పెరిగిన రోడ్డు ప్రమాదాలు

అతివేగం, నిర్లక్ష్యం, నిద్ర, మద్యం మత్తు... ఈ కారణాలతో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాది జిల్లాలో 1048కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 428 మంది మృత్యువాత పడగా, 1424 మంది గాయపడ్డారు. వీరిలో కొందరు అంగవికలాంగులుగా మారారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ప్రధానంగా.. చంద్రగిరి మండలం కొంగరవారిపల్లె వద్ద జరిగింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట నుంచి కారులో ఈ ఏడాది మే 27న వేలూరు సీఎంసీకి బయలుదేరారు. ఎం.కొంగరవారిపల్లె సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీ కొంది. ఈప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు ఆస్పత్రిలో మరణించారు.

తగ్గిన దోపిడీలు

ఫ ఈ ఏడాది దారి దోపిడీలు, దొంగతనాలు, చోరీలు బాగా తగ్గాయి. ఈ ఏడాది జూన్‌ 13న రేణిగుంట మండలం నేతాజీ కాలనికి చెందిన చిన్నబ్బ ద్విచక్ర వాహనంపై తిరుచానూరు రైల్వే స్టేషన్‌ దారిలో రేణిగుంట వైపుకు వెళుతుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు నెంబరు ప్లేటు లేని స్కూటీపై వచ్చి ఎనిమిది గ్రాములు బంగారు చైను, అతడి వద్ద ఉన్న రూ.16,000 నగదు, మొబైల్‌ ఫోన్‌ లాక్కొని పరారయ్యారు.

ఫ శ్రీకాళహస్తి పరిధిలోని హ్యాపీ కిచెన్‌ సెంటరు వద్ద ఆక్టోబరు 20న జరిగిన దారి దోపిడీ ఘటనలో పెళ్లకూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన చంద్రయ్య తన సోదరుడు కాకాని తేజతో కలసి ఆటోలో వెళుతుండగా రెండు ద్విచక్రవాహనాల్లో నలుగురు దుండగులు వెంబడించి ఆటో ముందు వుంచి వారిని కొట్టి రెండు సెల్‌ ఫోన్లు లాక్కొన్నారు. రూ.64,750 నగదు తీసుకెళ్లారు.

పెరిగిన దారి దొంగతనాలు

ఫ సత్యవేడు మండలం తెలుగుగంగ కాలువ సమీపంలోని చిన్నపాండూరు రోడ్డు వద్ద నాగలాపురం మండలం రాజులకండిగ గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ ద్విచక్ర వాహనంపై అపోలో కంపెనీకి విధులు నిమిత్తం రాత్రి వెళుతున్నారు. ఇద్దరు దుండగులు అతడిని అడ్డగించి కత్తులతో బెదిరించారు. రూ.45,000 విలువ చేసే మొబైల్‌ ఫోన్‌, ద్విచక్రవాహనంతో పాటు నగదు తీసుకుని అక్కడ నుంచి ఉడాయించారు. ఇలా.. ఈ ఏడాది 510 వరకు దారి దొంగతనాలు జరిగాయి.

ఫ ఆగస్టు 27న నాయుడుపేట పట్టణం రాజగోపురం ప్రాంతానికి చెందిన వేముల బాలాజీకి చెందిన లారీలో స్టీలు పైపులు తీసుకొస్తున్నారు. నాయుడుపేట సమీపంలో గుర్తు తెలియని దుండగులు ఆపి దాదాపు రూ.50 లక్షలు విలువ చేసే స్టీలు పైపులున్న లారీని అపహరించుకుని వెళ్లారు.

వంద శాతం పెరిగిన సైబర్‌ నేరాలు

జిల్లాలో సైబర్‌ నేరాలు వంద శాతం పెరిగాయి. గత ఏడాది దాదాపు 320 కేసులు నమోదు కాగా వీటిల్లో సైబర్‌ పోలీసులు దృష్టికి రానివి మరో 500 వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది 486 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో పోలీసుల దృష్టికి రానివి దాదాపు 1002 ఉండొచ్చని అంచనా. ఈ ఏడాది నమోదైన 486 కేసుల ద్వారా రూ 12.89 కోట్లు పోగొట్టుకున్నట్లు సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం రూ.2.36 కోట్లు రికవరీ చేసి బాధితుల ఖాతాల్లోకి జమ చేశారు.

ముగ్గురు చిన్నారుల జలసమాధి

ఫిబ్రవరి 5న.. పాకాల మండలం దామలచెరువు పంచాయతీ ఊటువంకలో సోదరులు పునీత్‌ (11), కన్నయ్య (9).. వీరి స్నేహితుడు తేజేశ్వర్‌ (9) బడి నుంచి ఇంటికొచ్చారు. గ్రామ సమీపంలోని పచ్చిపాల ఓబన్న చెరువు వద్ద ఆడుకుంటూ తేజేశ్వర్‌ చెరువులో పడిపోయాడు. అతడిని రక్షించే ప్రయత్నంలో పునీత్‌, కన్నయ్య నీటిలో మునిగిపోయి మృతిచెందారు.

Updated Date - Dec 30 , 2024 | 01:13 AM