Share News

పెరిగిన ప్రమాదాలు

ABN , Publish Date - Dec 30 , 2024 | 01:37 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ 2023తో పోలిస్తే 2024లో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. మరణాలు, క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువైంది.

పెరిగిన ప్రమాదాలు
సెప్టెంబరు 13వ తేదీన బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌లో జరిగిన ప్రమాదంలో మృతులు

ఆందోళనకరంగా సైబర్‌ నేరాలు

చిత్తూరు అర్బన్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ 2023తో పోలిస్తే 2024లో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. మరణాలు, క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువైంది. సాధారణ నేరాల సంఖ్య తగ్గినప్పటికీ దొంగతనాలు, దోపిడీలు స్వల్పంగా పెరిగాయి. సైబర్‌ నేరాలు తగ్గినా.. అగంతకులు దోచిన సొమ్ము గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం.

రోడ్డు ప్రమాదాలు

సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు

2021 735 324 805

2022 711 373 792

2023 703 351 854

2024 734 389 877

మత్తు దందా కేసులు

నార్కోటిక్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగాలు మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాలపై ముకుతాడు వేస్తున్నా.. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 131 మందిపై కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి 202 కిలోల గంజాయి, 83 కిలోల తడి గంజాయి ఆకులను సీజ్‌ చేసి 22 మందిపై కేసులు నమోదు చేశారు. ఫ ఎక్సైజ్‌ శాఖ వాళ్లు 1,486 కేసులు నమోదు చేసి 2,333 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8,498 లీటర్ల సారా, 16,237 లీటర్ల అక్రమ మద్యం, 153 లీటర్ల బీరు, 56,143 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసి 256 వాహనాలను సీజ్‌ చేశారు.

మట్కా, ఆన్‌లైన్‌ గేముల కేసులు

ఈ ఏడాది మొత్తంలో జూదమాడుతున్న 1,224 మందిపై 201 కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.56.95 లక్షలు, 96 సెల్‌ఫోన్లు, 129 వాహనాలను సీజ్‌ చేశారు. అలాగే కోడిపుంజులతో పందెం ఆడే 86 మందిపై 22 కేసులు నమోదు చేసి రూ.2.18 లక్షలు, 18 కోడిపుంజులు, 17 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. ఫ క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి రూ.87వేలు, ఎనిమిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫ పేలుడు పదార్థాల కింద 57 మందిపై కేసులు నమోదు చేసి వారి వద్ద ఉన్న 490 గ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు.

తగ్గిన హత్యలు, అత్యాచారాలు

జిల్లాలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు, ఇంటి దొంగతనాలు, చీటింగు కేసులు, సైబర్‌ కేసులు వంటివి తగ్గాయి. అలాగే హత్యాయత్నం, ఘర్షణలు వంటివి పెరిగాయి.

తగ్గినవి

నేరాలు 2023 2024

హత్యలు 44 24

అత్యాచారాలు 44 39

కిడ్నాపులు 25 21

ఇంటి దొంగతనాలు 124 88

చీటింగ్‌ 197 140

దొంగతనాలు 427 323

సైబర్‌ కేసులు 58 41

పెరిగినవి

నేరాలు 2023 2024

హత్యాయత్నం 55 67

పగటి ఇంటి దొంగతనాలు 31 39

ఘర్షణలు 13 16

కోర్టు శిక్షలు

జిల్లాలో హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన వారికి పోలీసు శాఖ శిక్ష పడే విధంగా చేసింది. ఫ 2014లో గుడుపల్లె పీఎస్‌ పరిధిలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడైన దేవరాజుకు కోర్టు 20 సంవత్సరాల శిక్ష విధించింది. ఫ ఈ ఏడాది జూలై 8న బైరెడ్డిపల్లె మండలంలో జరిగిన హత్య కేసులో నిందితుడు శ్రీనివాసులుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఫ 2017లో సోమల మండలంలో వెంకటసిద్ధులు (67) అనే వృద్ధుడిని హత్య చేసిన సుధాకర్‌కు మదనపల్లె కోర్టు జీవిత ఖైదు విధించింది.

చాట్‌ బాట్‌తో రూ.4.46 కోట్ల విలువైన ఫోన్ల రికవరీ

జిల్లాలో 3వేల మంది ఫోన్లను పోగొట్టుకున్నారు. దశల వారీగా చాట్‌ బాట్‌ బృందం సాంకేతికతను వినియోగించి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి 4.46 కోట్ల విలువైన 2,085 ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందించింది.

ఫ డయల్‌ 100కు అందిన ఫిర్యాదులు

ఈ ఏడాది డయల్‌ 100కు మొత్తం 11,559 ఫిర్యాదులు అందాయి, వీటిలో కిడ్నాప్‌, హత్యాయత్నం, ఆత్మహత్యలు, కుటుంబ సభ్యుల తగాదాలు, ఆస్తి నేరాలు, పేకాట, ఇసుక అక్రమ రవాణా, రోడ్డు, అగ్ని ప్రమాదాలకు సంబంధించిన ఫిర్యాదులున్నాయి. 254 ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

24 బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా 24 బ్లాక్‌ స్పాట్లను గుర్తించారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ సమస్యాత్మక జంక్షన్లు, స్కూల్‌ జోన్లు, కాలేజీలు, హాస్పిటల్స్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్లు, లైటింగ్‌, రంబుల్‌స్టిక్స్‌ ఏర్పాటు చేయనున్నారు.

ప్రధాన ప్రమాదాల్లో కొన్ని..

ఫ 15 మే: బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్‌, రెండు లారీలు ఢీకొన్ని ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

ఫ 23 జూలై: బంగారుపాళ్యం టోల్‌గేట్‌ వద్ద ఇద్దరు ట్రావెల్‌ బస్సుల డ్రైవర్ల మధ్య ఘర్షణ జరిగితే.. మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌ సుధాకర్‌రాజు మీదకి శ్రీకృష్ణ ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌ శ్రీనివాసరావు తొక్కించుకుంటూ వెళ్లాడు. దీంతో గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన సుధాకర్‌రాజు అక్కడికక్కడే మృతి చెందారు.

ఫ 13 సెప్టెంబరు: మొగిలి ఘాట్‌లో ఆర్టీసీ బస్సును ఎదురుగా ఇనుప కమ్మీల ట్రక్కు, వెనుక నుంచి లారీ ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. 31 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇదే పెద్దది.

ఫ 20 సెప్టెంబరు: బెంగళూరు వాసులు కంచికి చీరల కోసం వెళ్తుండగా.. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లె ఫ్లైఓవర్‌పై వారు ప్రయాణించే కారు టైరు పగిలిపోయి రక్షణగోడకు ఢీకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.

ఫ అక్టోబరు 2: పుంగనూరులోని ఉబేదుల్లా కాంపౌండ్‌లో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక ఆస్పియా పట్టణ సమీపంలోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో శవమై కనిపించింది. డీఐజీ పర్యవేక్షణలో ఎస్పీ మణికంఠ బృందం పుంగనూరులోనే మకాం వేసిన చిన్నారిని కాపాడుకోలేకపోయారు. చిన్నారి తండ్రితో వివాదమున్న అదే వీధికి చెందిన ఓ మహిళ ఈ ఉదంతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఫ జూలై 14: స్నేహితుడి జన్మదినం కోసం కాణిపాకం నుంచి బైక్‌పై కేక్‌ తీసుకొస్తుండగా.. చెర్లోపల్లె సమీపంలో మినీలారీని బైక్‌ ఢీ కొట్టింది. బంగారుపాళ్యం మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన మగ్గురు స్నేహితులు పవన్‌, మంజు, చరణ్‌ మృతి చెందారు.

ఫ నవంబరు 28: చిత్తూరు దుర్గానగర్‌ సమీపంలో రోసీనగర్‌లో నివాసముంటున్న వసంతమ్మ (63)ను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె పెద్ద కొడుకు శంకర్‌ మద్యం మత్తులో చంపేశాడు. కాలితో తన్నడంతో పక్కటెముకలు విరిగిపోయాయి. తలను గోడకేసి కొట్టడంతో మెదడులో రక్తం గడ్డకట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె మృత్యువుతో పోరాడుతూ మరణించారు.

ఫ డిసెంబరు 8: పాకాల మండలం కుక్కలపల్లెకు చెందిన సాయికుమార్‌, అభిలాష్‌, బావాజాన్‌లు అమర్‌రాజా గ్రోత్‌ కారిడార్‌లో పనిచేస్తూ.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. కడప నుంచి చిత్తూరు వైపు వెళుతున్న ఐషర్‌ వాహనం వేగంగా ఢీకొంది. సాయికుమార్‌, అభిలా్‌షలు అక్కడికక్కడే మృతి చెందగా.. బావాజాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఫ డిసెంబరు 23: తన భార్యను సచివాలయ ఉద్యోగి ట్రాప్‌ చేశాడని పెనుమూరుకు చెందిన మోహన్‌ఆచారి అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగి సురేంద్రను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.

ఫ అక్టోబరు 4: జీడీనెల్లూరు మండలం ఎగవూరు గ్రామానికి చెందిన నాగరాజులరెడ్డి కుమారుడు దినేష్‌ ఆన్‌లైన్‌ బెట్టింగులతో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఈ ఏడాది అక్టోబరు 4వ తేదీన కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుటుంబ పెద్ద నాగరాజులరెడ్డి (61), ఆయన సతీమణి జయంతి (50), కుమార్తె సునీత (26), కుమారుడు దినేష్‌ (22) తమిళనాడులోని రాణిపేట సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాలుగు రోజుల వ్యవధిలో ఒకొక్కరుగా మరణించారు.

Updated Date - Dec 30 , 2024 | 01:37 AM