Share News

కలుషితాహార ఘటనలో పెరిగిన బాధితులు

ABN , Publish Date - Aug 23 , 2024 | 02:18 AM

చిత్తూరు అపోలో యూనివర్సిటీలో బుధవారం నాటి కలుషితాహార ఘటనలో బాధిత విద్యార్థుల సంఖ్య పెరిగింది.

కలుషితాహార ఘటనలో పెరిగిన బాధితులు
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డీఎంహెచ్‌వో

చిత్తూరు రూరల్‌, ఆగస్టు 22: చిత్తూరు అపోలో యూనివర్సిటీలో బుధవారం నాటి కలుషితాహార ఘటనలో బాధిత విద్యార్థుల సంఖ్య పెరిగింది. మెస్‌లో భోజనం చేసిన విద్యార్థులు నెమ్మదిగా అనారోగ్యానికి గురవుతూ ఆస్పత్రిలో చేరుతున్నారు. మొదటి రోజు 90 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే ఆ సంఖ్య రెండోరోజుకు 200కు చేరింది. వీరిలో ఇద్దరు విద్యార్థులు ఐసీయూలో చికిత్స పొందుతుంటే మిగిలిన వారికి వార్డుల్లో వైద్యం అందిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కాగా, అపోలో యూనివర్సిటీలోని 1300 మంది హాస్టల్‌ విద్యార్థులకు.. మూడు మెస్‌లు ఉన్నాయి. రెండు మెస్‌ల్లో భోజనం చేసిన వారికి ఫుడ్‌పాయిజన్‌ అయినట్లు విద్యార్థులు తెలుపుతున్నారు. 600 మందికి పైగా విద్యార్థులు వాంతులు, విరోచనాలు, జ్వరం బారీన పడ్డారు. మొదటి రోజు రాత్రి కొంత మందితో మొదలై రెండో రోజుకు 200 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక, వర్సిటీకి నాలుగు రోజుల సెలవు ప్రకటించారు. కాగా, మెస్‌ లో భోజనం బాగలేదని ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వారు పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి ఎదుట ధర్నా చేసేందుకు విఫలప్రయత్నం చేశారు. అపోలో యాజమాన్యం వారితో మాట్లాడడంతో ధర్నా ఆలోచనను విరమించుకున్నారు. మరోవైపు అపోలో వర్సిటీలోని మెస్‌కు సంబంధించిన ఫొటోలంటూ కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చాలాసార్లు విద్యార్థులకు వడ్డించిన భోజనం, సాంబారులో పురుగులు వచ్చాయని అందులో పేర్కొన్నారు.

నమూనాల సేకరణ

తిరుపతిలోని స్విమ్స్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన రాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలోని ఐదుగురు సభ్యులు అపోలోలోని మెస్‌ను తనిఖీ చేశారు. అక్కడున్న నీటి నమూనాను సేకరించారు. విద్యార్థులతో సమావేశమై ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. మోషన్‌ శాంపిల్స్‌ను సేకరించారు.

అడ్మిన్‌ బ్లాక్‌లో నీరు కలుషితమైనట్లు గుర్తింపు

ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు బుధవారం అపోలో క్యాంప్‌సలో నాలుగు చోట్ల నీటిని సేకరించిన పరీక్షించారు. ఇందులో ఆడ్మిన్‌ బ్లాక్‌లో ఉన్న ఆర్వో ప్లాంట్‌లో నీరు కలుషితమైనట్లు గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన చోట్ల నీరు బాగుందన్నారు.

నిర్లక్ష్యంగా ఆహార భద్రతా శాఖ

ఇంత పెద్ద ఘటన జరిగితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం ఇస్తే కానీ ఆహార భద్రత శాఖ అధికారులకు విషయం తెలిలయలేదట. దీన్ని బట్టి వాళ్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఇట్టే అర్థమవుతోంది. చివరగా వచ్చి హాస్టల్‌ మెస్‌లో కందిపప్పు, బియ్యం నమూనాలను తీసుకెళ్లినట్లు తెలిసింది.

Updated Date - Aug 23 , 2024 | 02:18 AM