ఒక్కొక్కటిగా వెలుగులోకి..
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:57 AM
క్షేత్రస్థాయి పరిశీలనలోనే తేటతెల్లమవుతున్న అక్రమాలు మరో మూడు రోజుల పాటు కొనసాగనున్న విచారణ దాదాపు వంద అనుమానిత ఆస్తులకు కొలతలు టీడీఆర్ లింక్డ్ ఆస్తులపై ప్రత్యేక దృష్టి
తిరుపతి, నవంబరు15 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర పాలకసంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వ అధికారులపై విచారణ కమిటీ శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లింది. అనంతపురం రీజనల్ డైరెక్టర్ విశ్వనాథ్ నేతృత్వంలో మూడు బృందాలుగా విడిపోయి అనుమానిత ఆస్తులకు కొలతలు వేశారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసిన చోట, టీడీఆర్ లింక్డ్ ఆస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అడ్డగోలుగా పన్నులు వేయడం, తగ్గించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న గత రెవెన్యూ అధికారి కేఎల్ వర్మకు సంబంధించిన రికార్డులను గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో విచారణ బృందం పరిశీలించింది. వాటి ఆధారంగా శుక్రవారం క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు పలు అక్రమాలు వెలుగుచూసినట్టు తెలిసింది. మూడు బృందాలు కలిపి దాదాపు వంద ఆస్తులకు సంబంఽధించి కొలతలు వేసి, వాటిని మళ్లీ రికార్డులను ముందు పెట్టుకుని పరిశీలిస్తున్నారు. టీడీఆర్ బాండ్ల కోసం రెసిడెన్షియల్ ఆస్తులను కమర్షియల్ కింద మార్చారన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారం కొందరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల మెడకు చుట్టుకోనుందన్న ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా గత మేనేజర్ చిట్టిబాబు, డీఈ విజయకుమార్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపైనా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లింపులు చేసినట్టు గుర్తించారు. జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో స్నాక్స్ కోసం రూ.33లక్షల బిల్లులు చెల్లింపు జరిగినట్టు గుర్తించారు. రెండు బిల్లులుగా ఆ మొత్తాన్ని ఓ ఈవెంట్ కాంట్రాక్టర్‌కు ముట్టజెప్పినట్టు తెలిసింది. వీటిపైనా ఆరాతీస్తున్నారు.
లోతుగా విచారిస్తున్నాం
డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ (డీఎంఏ) ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం మూడు బృందాలు తిరుపతికి చేరుకున్నాం. శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశాం. రికార్డులను ముందు పెట్టుకుని వాటిని లోతుగా విచారణ చేస్తున్నాం. అప్పుడే స్పష్టత వస్తుంది. విచారణలో సిబ్బంది సహకరిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు విచారణ చేసి, పూర్తి నివేదికను డీఎంఏకు అందజేస్తాం.
- విశ్వనాథ్, రీజనల్ డైరెక్టర్