డీసీసీబీలో అక్రమాలపై విచారణ
ABN , Publish Date - Oct 28 , 2024 | 01:21 AM
వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై సీఎంకు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఫిర్యాదు సీరియ్‌సగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో అనేక అక్రమాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకురాలు రెడ్డెమ్మ అధ్యక్షతన పర్సన్ ఇన్‌చార్జ్‌లను అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెకమెండేషన్‌తో నామినేట్ చేశారు. అప్పటి పాలకవర్గం నిబంధనలకు విరుద్ధంగా రూ.కోట్లలో వైసీపీ నేతలకు రుణాలను మంజూరు చేసింది. వీటిని ప్రస్తావిస్తూ.. ఈ ఏడాది జూలై 11, 12 తేదీల్లో ‘డీసీసీబీలో దారుణాలు, అక్రమాలకు సింగిల్ విండో’ అనే శీర్షికలతో రెండ్రోజులపాటు ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా డీసీసీబీలో జరిగిన దారుణాలపై సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. విచారణ జరిపి.. 15 రోజుల్లో నివేదిక అందించాలని డీసీవోను ఆదేశించింది.
ఫిర్యాదులో పేర్కొన్న వాటిలో కొన్ని..
గత పాలకవర్గం నిబంధనలకు విరుద్ధంగా వి.కోటలో వైసీపీ నేతలు పీఎన్ నాగరాజుకు రూ.4లక్షలు, పీఎన్ మంజులకు రూ.39 లక్షలు, పీఎన్ లక్ష్మికి రూ.39 లక్షలు, పీఎన్ హరికుమార్‌కు రూ.40 లక్షలు, పీఎన్ మమతకు రూ.40లక్షల వంతున ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు వ్యవసాయ రుణాలు ఇచ్చారు. హెడ్ ఆఫీ్‌సలో రెడ్డి వీనస్, శైలేష్ చక్రవర్తిలకు తక్కువ వడ్డీతో వాహన రుణాలు మంజూరు చేశారు. బైరెడ్డిపల్లె తదితర బ్రాంచీల ద్వారా బోగస్ జేఎల్‌జీ సంఘాలకు బ్యాంకు మార్గదర్శకాలు పాటించకుండా అధికమొత్తాల్లో రుణాలు ఇచ్చారు. నకిలీ సర్టిఫికెట్లతో ఒకరికి ఉద్యోగం ఇచ్చారన్న ఫిర్యాదురావడంతో ముందుగా తొలగించి, ఆ తర్వాత పాలకవర్గ పెద్దలు లంచాలు పొంది తిరిగి అరియర్స్‌తోసహా ఉద్యోగం ఇచ్చారు. అవసరానికి మించి అన్నిచోట్లా మెసెంజర్లను ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నియమించుకుని.. వారికి తక్కువ జీతాలిస్తూ ఆ మొత్తాలను పాలకవర్గ అధ్యక్ష, డైరెక్టర్లు, పీఏ స్వాహా చేశారు. వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు బ్రాంచీల్లో రైతుల పేరిట స్థానిక వైసీపీ నాయకులకు అక్రమంగా రుణాలిచ్చి బ్యాంకును భ్రష్టు పట్టించారు. పాలకవర్గ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా తమ బంధువులకు వివిధ రకాల రుణాలు మంజూరు చేశారు. బ్యాంకుతో ఏ మాత్రం సంబంధం లేని అప్పటి చైర్‌పర్సన్ రెడ్డెమ్మ భర్త కృష్ణమూర్తి అన్ని సమావేశాల్లో దర్జాగా కూర్చొని అధికార దుర్వినియోగం చేశారు. వరదయ్యపాళ్యంలో ఎస్‌హెచ్‌జీ పేరిట రూ.1.50 కోట్లు స్వాహా చేసిన సంఘటనపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. పుత్తూరు, నగరి, అన్నమయ్య, తిరుచానూరు బ్రాంచీల ద్వారా అప్పటి పాలకవర్గ సభ్యులు రాజకీయ ఉద్దేశంతో పెద్ద మొత్తాల్లో రుణాలు ఇప్పించారు. నగరి, బయ్యప్పగారిపల్లె, రొంపిచెర్ల పెట్రోల్ బంకు నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.
వారంలోగా నివేదిక
డీసీసీబీలో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. పది రోజులుగా విచారిస్తున్నాం. ఆరోపణలు వచ్చిన హెడ్ ఆఫీ్‌సతోసహా 12 బ్యాంకు బ్రాంచీల్లో సహకార శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి సమాచారం వచ్చాక మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.
- నాగవర్ధన, డీసీవో, చిత్తూరు