రూ.కోట్ల నిధుల స్వాహా ఘటనపై డీసీసీబీలో ప్రారంభమైన విచారణ
ABN , Publish Date - Dec 22 , 2024 | 02:09 AM
జిల్లా సహకారకేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ అధికారిగా నియమితులైన డీఆర్వో కె. మోహన్‌కుమార్ శనివారం మధ్యాహ్నం బ్యాంకుకు వచ్చారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లా సహకారకేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ అధికారిగా నియమితులైన డీఆర్వో కె. మోహన్‌కుమార్ శనివారం మధ్యాహ్నం బ్యాంకుకు వచ్చారు. సుమారు అర్ధగంట పాటు అధికారులతో పలు అంశాలపై చర్చించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో నాన్ అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీగా అప్పటి ప్రభుత్వం చైర్‌పర్సన్ ఎం. రెడ్డెమ్మ అధ్యక్షతన సిక్స్ మెన్ కమిటీని నియమించింది. వారి హయాంలో రూ.కోట్లలో ఆర్థిక మోసాలు జరిగిన విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం పాఠకులకు తెల్సిందే. మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు గత పాలకవర్గం చేసిన ఆర్థిక మోసాలపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరపాలని ప్రభుత్వం కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు ఆదేశాలు జారీచేసింది. 51 సహకార చట్టం మేర కలెక్టర్ విచారణకు ఆదేశిస్తూ విచారణ అధికారిగా డీఆర్వోను నియమించారు. బ్యాంకుకు విచ్చేసిన డీఆర్వో అక్కడి డీసీసీబీ సీఈవో మనోహర గౌడ్, డీసీఏవో బ్రహ్మానంద రెడ్డి, ఇతర అధికారులతో కొద్దిసేపు చర్చించారు.