‘వంతెన’ సమస్యకు పరిష్కారమేదీ?
ABN , Publish Date - Dec 16 , 2024 | 01:11 AM
కుశస్థలీ నదిపై ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరుతున్న జనం
నగరి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నగరి నుంచి కీళపట్టుకు వెళ్లే మార్గంలో కుశస్థలీ నదిపై ఉన్న వంతెన సమస్య ఏళ్ల తరబడి పరిష్కారం కావడం లేదు. దీనివల్ల వానొచ్చిందంటే ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 70 ఏళ్ల క్రితం నాటి వరదలకు సరిపోయేలా ఈ వంతెనను నిర్మించారు. కృష్ణాపురం, అమ్మపల్లె రిజర్వాయర్‌ను తెరిచినట్లయితే వరద ఉధ్రుతి పెరిగి వంతెనపై ఉండే రోడ్డుపై నీటి ప్రవాహం ఉంటుంది. ఇక వానాకాలంలో వరద పోటెత్తితే తిరుత్తణి వైపు వెళ్లేవారు, నగరివాసులు, నగరి మండలంలోని పది గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పదు. నగరి చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు, మూడుసార్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినా పనులు చేపట్టలేదు. తాజాగా నాలుగు రోజుల కిందట కురిసిన వర్షాలకు వచ్చిన వరద ఉధ్రుతికి ఈ వంతెన కొట్టుకుపోయింది. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని జనం కోరుతున్నారు.