అదంతా కట్టుకథే
ABN , Publish Date - Nov 12 , 2024 | 01:23 AM
తల్లితండ్రులకు భయపడి బాలికే ‘దాడి’ నాటకమాడింది ఎర్రావారిపాళెం మండల ఘటనపై ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘ఎర్రావారిపాళెం మండలంలోని బాలికపై అత్యాచారం జరగలేదు. దాడి కూడా తల్లిదండ్రులకు భయపడి ఆ బాలిక అల్లిన కట్టు కథే’ అని ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టంచేశారు. తిరుపతిలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి బాలుడ్ని జువైనల్ హోంకు తరలించామన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపినట్లు చెప్పారు. ‘బాలుడు, బాలికది ఒకే ఊరు. ఒకే స్కూలులో ఒకే తరగతి చదువుతున్నారు. ఈ నెల 4న సాయంత్రం వారిద్దరూ కలసి ముందుగానే అనుకున్న ప్రకారం మాట్లాడుకోవడానికి వెళ్లడంతో ఇంటికి వెళ్లడం ఆలస్యమైంది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు రెండుసార్లు ఆమెకోసం వెదికి స్కూలు వద్దకు వచ్చారు. వారికి భయపడి ఆ బాలిక చేతిలో ఉన్న గాజులతో గీసుకుని గాయాలు చేసుకుంది తప్ప అత్యాచారం జరగలేదని వైద్య పరీక్షలు, పోలీసులు దర్యాప్తులో తేలింది. బాలికకు సంబంధించి రక్త పరీక్షలు, ఇతర అన్ని రకాల పరీక్షలు జరిపి డాక్టర్ల నుంచి రిపోర్టు తెప్పించుకున్న తర్వాత బాలికపై అత్యాచారం జరగలేదని నిర్ధారణకు వచ్చాం. కానీ బాలిక చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి పథకం ప్రకారం తనపై గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసుకుని ఒక మోటారు సైకిల్‌పై వచ్చి దాడి చేశారని తల్లి దండ్రులతో చెప్పింది’ అని ఎస్పీ వివరించారు. సంఘటన జరిగిన రోజున ఎర్రావారిపాలెం ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్, భాకరాపేట సీఐ అక్కడకు చేరుకుని మెరుగైన చికిత్స నిమిత్తం బాలికను తిరుపతి ప్రసూతి ఆస్పత్రికి తరలించారని గుర్తుచేశారు. అప్పటికప్పుడే అవసరమైన పరీక్షలు చేశారన్నారు. మహిళా డీఎస్పీ, తహసిల్దార్, మహిళా పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, బాలిక తల్లి తండ్రుల సమక్షంలో బాలికను విచారించి, వాగ్మూలం నమోదు చేశామన్నారు. తనతో పాటు చదువుతున్న ఆ బాలుడ్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ బాలిక కట్టుకథ అల్లినట్లు విచారణలో తేలిందన్నారు. బాలిక ఇచ్చిన స్టేట్‌మెంటు ప్రకారం ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించామని ఎస్పీ చెప్పారు. ఇటువంటి ఘటనలపై వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అత్యాచారం అంటూ కల్పిత వార్తలు ప్రచురించినా, ప్రచారం చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎర్రావారిపాళెం బాలిక ఘటనపై దుష్ప్రచారం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీలు రవిమనోహరాచ్చారి, వెంకట్రావు, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, సీఐలు పాల్గొన్నారు.
చట్టపరిధిలోనే పనిచేస్తున్నా
నేను రాజకీయాల గురించి మాట్లాడను. ఎవరెన్ని ఆరోపించినా చట్టపరిధిలోనే పనిచేస్తున్నా. నేనూ ఏపీకి చెందిన అధికారినే. మాది అనంతపురం జిల్లా. స్వామి వారి సన్నిధిలో పనిచేసే భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. తిరుపతిలో పనిచేయాలని నాకు చాలా కోరిక ఉండేది. జిల్లా ఎస్పీగా పోస్టింగ్ తీసుకుని వచ్చి అంకితభావం, అకుంఠిత దీక్ష, క్రమశిక్షణతో పనిచేస్తున్నా. నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ చట్టపరిధిలోనే పనిచేస్తా.
- సుబ్బరాయుడు, తిరుపతి ఎస్పీ