బడులు ఎక్కడ బాగుచేశావు జగన్
ABN , Publish Date - Nov 08 , 2024 | 02:31 AM
పగుళ్లుబారిన గోడలు. పెచ్చులూడిన పైకప్పులు. ప్రహరీ లేక భద్రత కరువైన బడులు. కంపు కొట్టే బాత్రూములు. మూత్రశాలలు లేకుండా బయటకు పరుగులు తీసే విద్యార్థులు. అందుబాటులో లేని తాగునీళ్లు. ఇవీ ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో కనిపించిన సర్కారు స్కూళ్ల దుస్థితి.
పగుళ్లుబారిన గోడలు. పెచ్చులూడిన పైకప్పులు. ప్రహరీ లేక భద్రత కరువైన బడులు. కంపు కొట్టే బాత్రూములు. మూత్రశాలలు లేకుండా బయటకు పరుగులు తీసే విద్యార్థులు. అందుబాటులో లేని తాగునీళ్లు. ఇవీ ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో కనిపించిన సర్కారు స్కూళ్ల దుస్థితి. కార్పొరేట్ స్థాయిలో సర్కారు బడులను తీర్చిదిద్దామన్న గత వైసీపీ ప్రభుత్వ మాటలు డొల్లగానే కనిపిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. కూటమి ప్రభుత్వమైనా వీటిల్లో వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్
ఆరుబయట చదువులు
అవిలాల వేదాంతాపురం మండల ప్రాథమిక పాఠశాలకు గత వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు రెండో విడత కింద ఎంపికైంది. నాగరత్నమ్మ కాలనీలో కొత్త భవన నిర్మాణాలు చేపట్టారు. మొత్తంగా రూ.17 లక్షలు మంజూరు చేశారు. స్లాబ్, ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేసారు. తలుపులతో పాటు కొన్ని పనులు చేయాలి. దీంతో పాత భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. డెస్క్‌లు లేకపోవడంతో ఆరు బయట, చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు
చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పంచాయతీలోని వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల చిన్నపాటి వర్షానికి ఉరుస్తోంది. జంగామాండ్లపల్లిలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరడంతో పంచాయతీ భవనంలో నిర్వహిస్తున్నారు.
పాకాల ఉన్నత పాఠశాలలో డెస్కులు లేక నేలపైనే కూర్చుంటున్నారు. మరుగుదొడ్లు అరకొరగా ఉన్నాయి. తరగతి గదులు అధ్వానంగా ఉండటంతో నాబార్డు నిధులు రూ.రెండు కోట్లు మంజూరైనా పనులు దశలో దశలోనే ఉన్నాయి. నాడు- నేడు పథకంలో రూ.1.90 లక్షలు మంజూరైనా 20 శాతం పనులు కూడా జరగలేదు. ఆర్సీపురం మండలం దేశూరికండ్రిగలో పాఠశాల భవనం దెబ్బతింది.
పశువులు, పందుల సంచారం
గూడూరు మండలం చవటిపాళెంలోని సర్కారు బడిలో సుమారు 340 మంది చదువుకుంటున్నారు. ప్రహరీ లేకపోవడంతో బయట వ్యక్తుల వాహనాలు, ఇతరులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆవరణంలో పశువులు, పందుల సంచారంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
చిల్లకూరులోని శంకరన్ గిరిజన కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేదు. బడి వెనుక పిచ్చి మొక్కల వల్ల విషపురుగుల భయం వెన్నాడుతోంది. బాలాయపల్లి మండలంలో జయంపు, వెంగమాంబపురం ఉన్నత పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి.
ఇరకంలోనూ ఇక్కట్లే
ఇరకం దీవిలోని ప్రాథమిక పాఠశాలలో ఇప్పుడు ఆరుగురు విద్యార్థులు ఉండగా ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడు ఉన్నారు. ఇక, ఇరకం దీవిలోని పాళెంతోపుకుప్పం (ఇరకం కుప్పం) ప్రాథమిక పాఠశాలను తమిళ మాధ్యమం పాఠశాలగా 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కనెలలోనే మూతపడి, కేవలం ప్రాథమిక పాఠశాలగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉండగా ఒక సీఆర్‌ఎంటి(క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్) ఉన్నారు. కాగా, ఇరకం దీవిలోని ప్రజలకు తమిళ భాషపై మక్కువ ఎక్కువ. ఈ పాఠశాలలో సరైన విద్య అందకపోవడం, రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇక్కడ విద్యార్థులు తమిళనాడు పాఠశాలకు వెళుతున్నారు. అదికూడా నాటు పడవల్లో పులికాట్ సరస్సులో 8 కిలోమీటర్లు ప్రయాణించి చదువుకుంటున్నారు.
మిగిలింది ఐదుగురే
ఇది వడమాలపేట మండలం తట్నేరిలోని బడి ఇది. గతంలో 20మందికిపైగా చదువుకునే వారు. వైసీపీ ప్రభుత్వం 117 జీవోతో 3, 4, 5 తరగతులు సమీపంలోని పాదిరేడు ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనమయ్యాయి. దీంతో ఐదుగురే మిగిలారు. ఇక్కడ రెగ్యులర్ టీచరు ఉన్నారు.
పాములు, తేళ్లు మధ్య పాఠాలు
కోట మండలం ఎన్టీఆర్ కాలనీలో శిథిలావస్థకు చేరుకొని ఉన్న కమ్యూనిటీ హాలులో ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. పదేళ్ల కిందట పాఠశాల మంజూరైనప్పటికీ ఇప్పటివరకు భవనం లేదు. కమ్యునిటీ హాలుకు ప్రహరీ లేక పోవడం, చుట్టూ ముళ్ల చెట్ల వల్ల పాములు, తేళ్లు బడిలోకి వచ్చి విద్యార్థులను భయపెడుతున్నాయి. వర్షమొస్తే ఉరుస్తోంది.
వాకాడులో ప్రహరీ లేని పాఠశాలలు అనేకం ఉన్నాయి. చీమలపాడు, నిడుగుర్తి, చిన్నతోట, నవాబ్ పేట, మొనపాళెం, నలగాముల, మూలపడవ, పంబలి స్కూల్స్ అధ్వానంగా ఉన్నాయి.
నాడు-నేడు నిధులు వెనక్కి
సూళ్లూరుపేట మండలం రాగన్న పట్టెడ జడ్పీ ఉన్నత పాఠశాలలోని రెండు భవనాలు మరమ్మతులకు గురై వినియోగించడంలేదు. నాడు-నేడు కింద రూ.1.40కోట్లు మంజూరైనా పనులు చేయకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రస్తుతం నాలుగు గదుల్లోనే మూడు నుంచి 10 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలకు ప్రహరీ లేదు. వంటశాలకు గది కూడా నిర్మించలేదు.
మంగళంపాడు హైస్కూల్‌కు గతేడాది తుఫాన్ ప్రభావంతో ప్రహరీ కూలిపోయింది. ఇప్పటివరకు గోడను నిర్మించలేదు.
వెక్కిరిస్తున్న బడులు
పెళ్లకూరు మండలంలో ఏడు ఉన్నత.. 58 పాథమిక పాఠశాలలగాను కొత్తూరు, తాళ్వాయిపాడు మెయిన్, ఏడబ్ల్యూ, పెళ్లకూరుమిట్ట ప్రాథమిక బడులు మినహా తక్కినవన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. చెన్నప్పనాయుడుపేట ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రహారీ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అదనపు తరగతి నిర్మాణం పునాదుల్లోనే నిలిచిపోయింది.
కొత్తూరు పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని పెచ్చులూడి పడుతున్నాయి. ప్రహరీ లేదు. చెంబడిపాలెం గిరిజన కాలనీ పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి పడుతోంది. ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. మూత్రశాలలు లేక ఇబ్బంది పడుతున్నారు.
జంగాలపల్లి పాఠశాల భవనంతో పాటు టాయిలెట్ సౌకర్యం లేదు. పెరుమాళ్లపల్లెలో టాయిలెట్ సౌకర్యం లేదు. శిరసనంబేడు రాజుపాలెం, బంగారంపేట, లక్ష్మీనాయుడు కండ్రిగ, ముమ్మారెడ్డిగుంట పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి.
అంతా ప్యాచ్ వర్క్
నాగలాపురం మండలంలోని గోళ్లవారికండ్రిగ పాఠశాలకు నాడు-నేడు కింద నిధులు మంజూరైనా..చిన్నచిన్న రిపేర్లు చేసి చాలావరకు బిల్లులు స్వాహా చేశారన్న విమర్శలున్నాయి. చాలా అధ్వాన్నంగా స్కూల్ భవనం ఉంది. పైకప్పులు పెచ్చులూడిన చోట సిమెంట్‌తో కవర్ చేశారు. ఫ పుత్తూరు మండలం కల్యాణపురం ప్రాథమికోన్నత పాఠశాల కోసం నాడు-నేడు కింద చాకలి గుంటలో రూ20లక్షలతో పునాదులు వేసి నిలిపేశారు. పాతభవనంలో విద్యార్థుల సంఖ్యకు తగినంత గదులు లేక ఇబ్బందిపడుతున్నారు. రెప్పాలపట్టు యానాది కాలనీ ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ సగం పనులతో ఆగిపోయింది. బాత్రూం దారుణంగా ఉంది. పాఠశాల చుట్టూ రాళ్లు రప్పలతో దర్శనమిస్తోంది.