శ్రీవారి ఆలయంలో 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ABN , Publish Date - Dec 26 , 2024 | 01:37 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 10 నుంచి 19వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు జరుగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
తిరుమల, డిసెంబరు25(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 10 నుంచి 19వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు జరుగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఏటా ఆలయంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి చేపడతారు. ఈ క్రమంలో జనవరి 7వ తేది ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామి మూలవిరాట్టుకు కప్పిన వస్ర్తాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్య కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక, ఈకార్యక్రమం నేపథ్యంలో ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో 6వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోరు.