Share News

టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:45 AM

కుప్పంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌
చంద్రబాబుతో డాక్టర్‌ సుధీర్‌ తదితరులు

కుప్పం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇప్పటికే వైసీపీ తరఫున గెలిచిన ఆరుగురు కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. దీంతో కుప్పం మున్సిపాలిటీని క్లీన్‌ స్వీప్‌ చేసే దిశగా టీడీపీ కదులుతోంది. కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ అమరావతిలోని ఉండవల్లిలో గల నివాసంలో మంగళవారం తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును సతీసమేతంగా కలిశారు.ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరడానికి ముందే మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవితో పాటు,16వ వార్డునుంచి గెలిచిన కౌన్సిలర్‌ పదవికి కూడా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. సుధీర్‌కు పసుపు కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులున్నాయి. 2021 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వైసీపీనుంచి 19 మంది, టీడీపీనుంచి ఆరుగురు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. 16వ వార్డునుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన డాక్టర్‌ సుధీర్‌ను ముందుగానే ఛైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన ఛైర్మన్‌గా ఏర్పడిన మున్సిపల్‌ కౌన్సిల్‌ వైసీపీ హస్తగతమైంది. అయితే ఇటీవల వైసీపీ కౌన్సిలర్లు ఆరుగురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.మున్సిపల్‌ ఛైర్మన్‌ సుధీర్‌ కూడా కొంతమంది కౌన్సిలర్లతో అమరావతి వెళ్లి టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. అయితే స్థానికంగా కొంతమంది టీడీపీ నేతలు వ్యతిరేకించడంతో ఆయన చేరిక వాయిదా పడింది. అనంతరం జరిగిన పరిణామాల్లో మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామన్న సందేశం అందింది. దీంతో ఆయన పదవులను వదులుకుని మరీ ప్రస్తుతం టీడీపీలో చేరారు. దీంతో ఆ వైసీపీకి కేవలం 12 మంది కౌన్సిలర్లు మాత్రం మిగిలారు. వీరిలో కూడా చాలామంది టీడీపీలో చేరడానికి ఆతృతగా ఉన్నారు కానీ, అధిష్ఠానం ఊ అంటే ఇప్పటికిప్పుడు కుప్పం మున్సిపల్‌ కౌన్సిల్‌లో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.

Updated Date - Nov 06 , 2024 | 12:45 AM