ఎస్‌ఐ ఓవరాక్షన్‌తో టీడీపీ అభ్యర్థి సహా నేతలకు గాయాలు
ABN , Publish Date - May 14 , 2024 | 01:48 AM
పోలింగ్‌బూత్‌లో ఇరుపార్టీల మధ్య చోటుచేసుకున్న చిన్నవివాదం కారణంగా ఎమ్మెల్యే అభ్యరి పాశిం సునీల్‌కుమార్, మరో ముగ్గురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి
చిల్లకూరు, మే 13: ఓ పోలింగ్‌బూత్‌లో ఇరుపార్టీల మధ్య చోటుచేసుకున్న చిన్నవివాదం కారణంగా ఎమ్మెల్యే అభ్యరి పాశిం సునీల్‌కుమార్, మరో ముగ్గురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి.చిల్లకూరులోని 114, 115 పోలింగ్‌బూత్‌ల ఆవరణలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలావున్నాయి. వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ 10మంది నాయకులతో కలిసి గుంపుగా పోలింగ్ బూత్‌లోకి వెళుతుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు కొండా రామచంద్రారెడ్డి అభ్యంతరం తెలిపారు. దీంతో మేరిగ మురళీధర్, గూడూరు మండలం మంగళపూరుకు చెందిన ఎద్దల నరేంద్రరెడ్డి ఆయనతో వాగ్వాదానికి దిగారు. అంతలో వైసీపీ నేత నరేంద్రరెడ్డి టీడీపీ నేత రామచంద్రారెడ్డిపై చేయి చేసుకుంటుండగా ఎస్‌ఐ అంజిరెడ్డి కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నేత కొండా రామచంద్రారెడ్డిపై ,పక్కనే వున్న మహిళానేత మద్దాలి విజయ, వెంకటరాఘయ్యలపై లాఠీ ఝళిపించారు. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి సునీల్‌కుమార్ ఎందుకు తమ వారిని కొడుతున్నారని ప్రశ్నించగా కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల తోపులాటలో సునీల్‌కుమార్ చేతికి కూడా గాయమైంది. చిన్నవివాదం కాస్తా ఎస్‌ఐ అంజిరెడ్డి అత్యుత్సాహంతో పెద్దదైంది. గాయపడ్డ టీడీపీ నాయకులను చికిత్సనిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి పార్టీ వర్గాలు తరలించారు.
చెరివిలో ఓటర్లకు విద్యుత్ షాక్
సత్యవేడు మండలం చెరివి గ్రామంలో ఎన్నికల పోలింగ్ కేంద్రం ఓ రేకుల షెడ్‌లో ఏర్పాటు చేశారు. పోలింగ్ జరుగుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి బూత్‌లోని వారంతా షాక్‌కు గురయ్యారు. ఒక ఓటరు స్వలంగా గాయపడ్డారు.