సచివాలయంలో ‘ఆడుదాం క్రికెట్’
ABN , Publish Date - Jan 12 , 2024 | 01:11 AM
మైదానంలో ఆడాల్సిన క్రికెట్‌లో వివక్ష చూపుతారా? టీడీపీ సానుభూతిపరులమని ‘ఆడుదాం ఆంధ్ర’ మమ్మల్ని నిలిపేస్తారా.. అంటూ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వెదురుకుప్పం, జనవరి 11: మైదానంలో ఆడాల్సిన క్రికెట్‌లో వివక్ష చూపుతారా? టీడీపీ సానుభూతిపరులమని ‘ఆడుదాం ఆంధ్ర’ మమ్మల్ని నిలిపేస్తారా.. అంటూ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెదురుకుప్పం మండలం బొమ్మయ్యపల్లె సచివాలయంలో క్రికెట్ ఆడి తమ నిరసన తెలిపారు. వీరు తెలిపిన ప్రకారం.. బొమ్మయ్యపల్లె గ్రామ సచివాలయంలోని తిప్పినాయుడుపల్లెకు చెందిన జట్టు ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో సచివాలయ పరిధిలో గెలిచింది. వీరిని బుధవారం మండలస్థాయి క్రికెట్ పోటీలకు వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఆడటానికి పిలిపించారు. ఆ తర్వాత వీరిని ఆపేశారు. తాము లేకుండానే గురువారం ఏకపక్షంగా తమ ప్రత్యర్ధి జట్టు అయిన మారేపల్లె వారిని విజేతలు ప్రకటించారంటూ వీరు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము టీడీపీ సానుభూతిపరులు కావడంతోనే ఏకపక్ష ధోరణితో నిలిపివేశారని ఆరోపించారు. దీంతో గురువారం బొమ్మయ్యపల్లె గ్రామ సచివాలయంలో క్రికెట్ ఆడి నిరసన వ్యక్తం చేశారు. సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సచివాలయంలో గోలగోలగా కనిపించింది. ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.
వాళ్లు పోటీలకు రానందునే.. : మహేశ్, తిప్పినాయుడుపల్లె గ్రామ కార్యదర్శి
బుధవారం సాయంత్రం జరగాల్సిన ఈ క్రీడలు వాయిదా పడి గురువారం నిర్వహించాం. గురువారం నాటి పోటీలకు తిప్పినాయుడుపల్లె జట్టు రాలేదు. వాళ్లు వేరే చోట ఎక్కడో ఆట ఆడటానికి వెళ్లినట్లు సమాచారం. వెదురుకుప్పంలో జరిగిన పోటీలకు వాళ్లు రాకపోవడంతో మండల అధికారుల నిర్ణయంతో మారేపల్లి టీంకు బై చేశారు. ఇందులో మా తప్పిదం లేదు.
పసుపు టీషర్టుతో ఆట
‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్లో పసుపు టీ షర్టుతో క్రికెట్ ఆడారాయన. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం అయ్యాక నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. దీనికి నిరసనగా పసుపు టీ షర్టుతో క్రికెట్ ఆడినట్లు వెదురుకుప్పం గ్రామ కమిటీ అధ్యక్షుడు అనిల్ గురువారం తెలిపారు. సీఆర్‌కండ్రిగ జట్టు తరపున తాను క్రికెట్ ఆడినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన టీ షర్ట్ వేసుకోకుండా పసుపు షర్ట్ వేసుకుని క్రికెట్ ఆడినట్లు తెలిపారు.