Share News

పొంచివున్న వరద ముప్పు

ABN , Publish Date - Dec 03 , 2024 | 02:39 AM

ఫెంగల్‌ తుఫాను బలహీనపడి వానలు తగ్గినా జిల్లాలో వాగులు, వంకల ప్రవాహాలు మాత్రం తగ్గలేదు. ఉరకలెత్తి ఉధృతంగా పారుతున్నాయి. పలుచోట్ల రోడ్లను అడ్డగిస్తున్నాయి.

పొంచివున్న వరద ముప్పు
దొరవారిసత్రం మండలం ఉచ్చూరులో ఇసుక మేటతో పాటు నీటిలో ఉన్న వరి పొలం

వాన తగ్గినా పెరిగిన ప్రవాహాలు

పొంగిన ఉప్పుటేరు, రొయ్యల కాలువ, బకింగ్‌ హామ్‌

పలు మార్గాల్లో ఆగిన రాకపోకలు

ప్రమాదకర స్థితిలో స్వర్ణముఖి కరకట్ట

రిజర్వాయర్లలోకి చేరుతున్న వర్షపు నీరు

10,200 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

ఫెంగల్‌ తుఫాను బలహీనపడి వానలు తగ్గినా జిల్లాలో వాగులు, వంకల ప్రవాహాలు మాత్రం తగ్గలేదు. ఉరకలెత్తి ఉధృతంగా పారుతున్నాయి. పలుచోట్ల రోడ్లను అడ్డగిస్తున్నాయి. రాకపోకలకు అవరోధం కలిగిస్తున్నాయి. స్వర్ణముఖి, కాళంగి, అరణియార్‌లు జలకళలాడుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. వాన జోరు పెరిగితే మాత్రం ముప్పు అంచున ఉన్న అనేక గ్రామాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.

-తిరుపతి, ఆంధ్రజ్యోతి

ఉధృతంగా బకింగ్‌ హామ్‌

కోట మండలంలో సోమవారం బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ఉధృతి పెరిగింది. దీంతో గోవిందపల్లి, గోవిందపల్లి పాలెం గ్రామాల నడుమ రాకపోకలు స్థంభించాయి. చిల్లకూరు మండలంలో భారీ వర్షాలకు సోమవారం సాయంత్రం ఉప్పుటేరు పొంగింది. తిప్పగుంట పాలెం చప్టాపై నీటి ప్రవాహం పెరగడంతో వంద కుటుంబాలు చిక్కుకుపోయాయి. చిట్టమూరు మండలంలో సోమవారం కూడా మోస్తరు వర్షం కురిసింది. గత మూడు రోజుల వర్షానికి సోమవారం రొయ్యల కాలువ ఒక్కసారిగా పొంగింది. దీంతో మల్లాం-కొత్తగుంట నడుమ రాకపోకలు ఆగిపోయాయి.

ప్రమాదంలో స్వర్ణముఖి కరకట్ట

బ్యారేజీ నుంచీ దిగువకు నీటి ప్రవాహం ఉధృతంగా సాగుతున్న కారణంగా సోమవారం కోట మండలం దైవాల దిబ్బ వద్ద స్వర్ణముఖి నది కరకట్ట తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. కరకట్ట తెగిపోతే కోట మండలంలోని పుచ్చలపల్లి, దైవాల దిబ్బ గ్రామాలతో పాటు వాకాడు మండలం గంగనపాలెం గ్రామాలు నీట మునిగే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కోట మండల తహసిల్దారు పది ట్రాక్టర్లతో గ్రావెల్‌ తోలించినా ఉపయోగం లేకపోయింది. ఇరిగేషన్‌ అధికారులు సరిగా స్పందించడం లేదని ప్రజలు అంటున్నారు.

వాకాడు మండలంలో 12 గ్రామాలకు ముప్పు

వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజీలోకి ఆదివారం 18 వేల క్యూసెక్కుల నీరు చేరగా, సోమవారం 15 వేల క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీ పూర్తిగా నిండిపోయి వున్నందున వచ్చిన నీటిని వచ్చినట్టే సముద్రంలోకి వదిలిపెట్టేస్తున్నారు. ఇక గంగనపాలెం-బాలిరెడ్డిపాలెం నడుమ వంతెనపైకి నీరు చేరడంతో 12 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. మరో రెండు రోజుల పాటు పరిస్థితి ఇలాగే వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా వంతెన వద్ద ఇరువైపులా కోతకు గురి కాకుండా భారీగా ఇసుక బస్తాలు పేర్చారు.

మల్లిమడుగులో పది గేట్లు ఎత్తేశారు

రేణిగుంట మండలంలోని మల్లిమడుగు రిజర్వాయర్‌కు కూడా వరద నీరు భారీగానే చేరుతోంది. రిజర్వాయర్‌ పూర్తిగా నిండిపోవడంతో ఇన్‌ఫ్లో 2 వేల క్యూసెక్కులుండగా అంతకంటే ఎక్కువగా 2100 క్యూసెక్కుల నీటిని పది గేట్లు ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తున్నారు.

కళ్యాణి డ్యాంలోకి నీరు

జిల్లాలో దాదాపుగా అన్ని రిజర్వాయర్లలోకీ వర్షపు నీరు చేరుతోంది. కళ్యాణి డ్యామ్‌లోకి శేషాచల అడవుల నుంచీ నుంచీ నీరు వస్తోంది. చంద్రగిరి మండలంలోని ఈ డ్యామ్‌ లోతు 910 అడుగులు కాగా ఆదివారం వరకూ 841 అడుగుల వరకూ వున్న నీటి మట్టం వర్షపు నీటి ప్రవాహం మొదలు కావడంతో సోమవారం 853 అడుగులకు చేరింది.

నిండుకుండలా అరణియార్‌

పిచ్చాటూరు మండలంలోని అరణియార్‌ రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది. జిల్లాలోనే అతి పెద్ద రిజర్వాయర్‌ అయిన అరణియార్‌ నీటి నిల్వ సామర్ధ్యం 1.85 టీఎంసీలు. ఇపుడు అందులో 1.74 టీఎంసీల నీరు చేరింది. 31 అడుగుల లోతు కలిగిన రిజర్వాయర్‌లో ఇప్పటికే 29.5 అడుగుల ఎత్తున నీరు చేరింది. రిజర్వాయర్‌లోకి 4 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా ఒక గేటు తెరిచి వెయ్యి క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం మండలంలో భారీ వర్షం కురవడంతో రాత్రికే రిజర్వాయర్‌ పూర్తిగా నిండిపోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉరకలెత్తుతున్న కాళంగి

కేవీబీపురం మండలంలోని కాళంగి రిజర్వాయర్‌ మొత్తం నీటి మట్టం 240 అడుగులకు గానూ సోమవారం సాయంత్రానికి 219 అడుగులకు నీరు చేరింది. 2830 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వస్తుండగా మొత్తం 18 గేట్లకు గానూ ఆరు గేట్లు ఎత్తి 2260 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలిపెడుతున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 02:39 AM