Share News

‘చిత్తూరు-గుడియాత్తం’ రోడ్డుకు మహర్దశ

ABN , Publish Date - Dec 03 , 2024 | 02:31 AM

యాదమరి మీదుగా ఉండే ‘చిత్తూరు-గుడియాత్తం’ అంతర్రాష్ట్ర రహదారికి మహర్దశ పట్టనుంది. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఛిద్రమైన ఈ రోడ్డు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బాగుపడనుంది. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చొరవ తీసుకుని రూ.5.90కోట్ల ఉపాధి హామీ పథకం నిధుల్ని కేటాయించారు. త్వరలో పనుల్ని ప్రారంభించి.. నెల రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రణాళిక రచిస్తున్నారు.

‘చిత్తూరు-గుడియాత్తం’ రోడ్డుకు మహర్దశ
గొల్లపల్లె- కొత్తూరు సమీపంలో ఛిద్రమైన రహదారి

ఏళ్లనాటి సమస్య పరిష్కారం

రూ.5.90 కోట్ల ఉపాధి నిధుల కేటాయింపు

నెలలో పూర్తయ్యేలా ప్రణాళిక

చిత్తూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): యాదమరి మీదుగా ఉండే ‘చిత్తూరు-గుడియాత్తం’ అంతర్రాష్ట్ర రహదారికి మహర్దశ పట్టనుంది. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఛిద్రమైన ఈ రోడ్డు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బాగుపడనుంది. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చొరవ తీసుకుని రూ.5.90కోట్ల ఉపాధి హామీ పథకం నిధుల్ని కేటాయించారు. త్వరలో పనుల్ని ప్రారంభించి.. నెల రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రణాళిక రచిస్తున్నారు.

వైసీపీ హయాంలో

ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా..

యాదమరి మండలంలోని జోడిచింతల నుంచి తమిళనాడు సరిహద్దు వరకు 11కిలోమీటర్ల రహదారి అధ్వానంగా ఉంది. చిత్తూరు నుంచి యాదమరి మీదుగా గుడియాత్తం వరకు ఉన్న ఈ దారిలో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది పెట్రోల్‌ ట్యాంకర్‌ ఈ రోడ్డులో ఇరుక్కుంది. ఎక్స్‌కవేటర్‌ సాయంతో రోడ్డును పక్కకు లోడి.. బయటికి తీయాల్సి వచ్చింది. వైసీపీ హయాంలో ఈ రహదారి మరమ్మతులకు ఆర్‌అండ్‌బీ అధికారులు అనేకమార్లు ప్రతిపాదనలు పంపించినా నిధులు విడుదల కాలేదు. ప్రస్తుత పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ ఈ రోడ్డును బాగు చేయించేందుకు తీవ్రంగా కృషిచేసి.. రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలోనే రూ.5.90 కోట్ల ఉపాధి హామీ నిధుల్ని కేటాయించారు.

కొత్త తరహాలో నిధుల కేటాయింపు

ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతుల కోసం ఉపాధి హామీ నిధుల్ని వాడుకోవడం అనేది గతంలో లేదు. ఈ రోడ్డు మరమ్మతుకు ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యం అవుతుంటే.. కలెక్టర్‌ చొరవ తీసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

8 గ్రామ పంచాయతీల నుంచి రెజల్యూషన్‌

ఈ రోడ్డుకు లింకు అయిన 8 పంచాయతీ సర్పంచుల నుంచి రూ.5.90 కోట్లకు రెజల్యూషన్‌ను కలెక్టర్‌ తెప్పించుకున్నారు. వీటిల్లో.. దాసరపల్లె గ్రామ పంచాయతీ నుంచి రూ.34లక్షలు ఉండగా, 12-కమ్మపల్లె.. రూ.45 లక్షలు, కాశిరాళ్ల.. రూ.81 లక్షలు, ఓటేరిపాలెం.. రూ.146.50 లక్షలు, భూమిరెడ్డిపల్లె.. రూ.20 లక్షలు, సిద్దారెడ్డిపల్లె.. రూ.58 లక్షలు, పట్రపల్లె నుంచి రెండు విడతల్లో రూ.128 లక్షలు, రూ.77.80 లక్షల చొప్పున ఉన్నాయి.

గ్రామాల కనెక్టివిటీ కోసం

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ డేలో కనీసం నలుగురైనా ఈ రోడ్డు సమస్యపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో రెండుసార్లు నేను పర్యటించి సమస్య తీవ్రత తెలుసుకున్నాను. గ్రామాల కనెక్టివిటీని ప్రధాన రహదారితో మెరుగుపరిచేందుకు ఉపాధి నిధుల్ని వాడుకునేలా ప్రణాళిక చేశాం. ఆయా గ్రామాల నుంచి రెజల్యూషన్‌ తెప్పించుకుని నిధులు కేటాయించాం. త్వరలో పనులు ప్రారంభించి.. నెలలోనే పూర్తి చేస్తాం.

- సుమిత్‌కుమార్‌, కలెక్టర్‌

Updated Date - Dec 03 , 2024 | 02:31 AM