Share News

పోలీసులకు రుణపడి ఉండాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 02:11 AM

ఎండనక, వాననక సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేసే పోలీసులకు యావత్‌ జాతి అంతా రుణపడి ఉండాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆకాంక్షించారు.

పోలీసులకు రుణపడి ఉండాలి
అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్‌, ఎస్పీల నివాళి

అమరవీరుల సంస్మరణ సభలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎండనక, వాననక సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేసే పోలీసులకు యావత్‌ జాతి అంతా రుణపడి ఉండాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆకాంక్షించారు. తిరుపతి పోలీసు పరేడ్‌ మైదానంలో సోమవారం జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. అమరవీరుల దినోత్సవంలో మనం భాగస్వాములు కావడం, వారి సేవలను స్మరించుకోవడం, వారికి సంతాపం తెలపడం మన విధిగా భావించాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ దిశగా ముందుకు వెళుతున్నామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. పోలీసు అమరవీరుల స్మృతి దినంకు హజరయ్యే అవకాశాన్ని తాను గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మన జిల్లాలో విధి నిర్వహణలో అసువులు బాసిన ఎనిమిది మందిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. కాగా, విధి నిర్వహణలో అసువులు బాసిన ఎస్‌ఐ రెడ్డినాయక్‌, ఏఎ్‌సఐ యువరాజులు నాయుడు, హెడ్‌కానిస్టేబుళ్లు చలపతి రాజు, ఇలియాజ్‌, శ్రీధర్‌ బాబు, నాగరాజు, కానిస్టేబుళ్లు విద్యాసాగర్‌, అనిల్‌కుమార్‌ కుటుంబ సభ్యులను కలెక్టర్‌, ఎస్పీ పరామర్శించి ఘనంగా సన్మానించారు. అనంతరం జ్ఞాపికలు అందజేశారు. వారి కుటుంబాలకు తమ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవిమనోహరాచ్చారి, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, డీఎస్పీ వెంకటనారాయణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు సిబ్బంది, రిజర్వు పోలీసులు పాల్గొన్నారు.

స్పృహ తప్పిన కానిస్టేబుల్‌

పరేడ్‌ నిర్వహణలో ఉన్న రిజర్వు కానిస్టేబుల్‌ ఉదయకుమార్‌ గుండె పోటుకు గురై స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీలు అక్కడకు చేరుకుని అతన్ని పరామర్శించారు. ప్రాథమిక వైద్యం అందించాక రుయాకు తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే వున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు.

Updated Date - Oct 22 , 2024 | 02:11 AM