డిసెంబరు 1నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం
ABN , Publish Date - Oct 28 , 2024 | 01:27 AM
భూముల విలువ సవరణకు కసరత్తు 10-20 శాతం మేర ధరలు పెరిగే అవకాశం
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూముల విలువలను సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డిసెంబరు ఒకటో తేదీ నుంచి కొత్తవిధానం అమలు చేయాలని ఆలోచిస్తోంది. నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న ధరలు, మార్కెట్ విలువ తదితర అంశాలపై రిజిస్ట్రేషన్ శాఖ అధ్యయనం చేస్తోంది. ఇందుకు జేసీ విద్యాధరి ఆధ్వర్యంలో కమిటీలను గతంలోనే నియమించారు. ఏటా పట్టణ ప్రాంతాల్లో ఏడాదికోసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోమారు భూముల విలువలను సవరిస్తుంటారు. 2022 జూన్‌లో వైసీపీ ప్రభుత్వం నిర్మాణాల విలువను భారీగా పెంచింది. తాటాకు, కొబ్బరాకు, రెల్లుగడ్డితో కప్పే గుడిసెలను సైతం వదల్లేదు. కూటమి ప్రభుత్వం భూముల ధరల సవరణ పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టింది. డిసెంబరు నుంచి 10-20 శాతం మేర ధరలు పెంచే అవకాశం ఉంది.
అధ్యయన నివేదికే ప్రామాణికం
భూముల ధరల సవరణకు అధికారులు చేస్తున్న అధ్యయన నివేదికే ప్రామాణికం కానుంది. సబ్‌రిజిస్ట్రార్లు, అధికారులతో సమన్వయం చేసుకుని మార్కెట్‌లో ఉన్న భూముల విలువలను సేకరించి మదింపు చేస్తారు. దీని ఆధారంగా నివేదికకు తుది రూపం ఇస్తారు. ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మదింపు జరుగుతోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.
వివరాలు సేకరిస్తున్నాం
భూముల విలువ సవరణకు మున్సిపల్, రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు తీసుకుంటున్నాం. మదింపు చేశాక వాస్తవ పరిస్థితికి అనుగుణంగా తుది నివేదిక రూపొందిస్తాం. ఎప్పటినుంచి ఇది అమల్లోకి వస్తుందో ప్రభుత్వం తెలియజేయలేదు. గతంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చేది. పారదర్శకంగా ఉండాలనే దృక్పథంతో పక్కాగా కసరత్తు చేస్తున్నాం.
మునిశంకరయ్య, జిల్లా రిజిస్ట్రార్, చిత్తూరు.