అరగంటలో రైతుకు పాసుబుక్ మంజూరు
ABN , Publish Date - Dec 29 , 2024 | 02:18 AM
అరగంటలోనే తన భూమికి సంబంధించిన పాస్‌బుక్ మంజూరు చేయడంతో ఓ రైతు ఆనందానికి అవధులు లేని వైనమిది.
ఎర్రావారిపాలెం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అరగంటలోనే తన భూమికి సంబంధించిన పాస్‌బుక్ మంజూరు చేయడంతో ఓ రైతు ఆనందానికి అవధులు లేని వైనమిది. వివరాలు ఇవి. ఎర్రావారిపాలెం గ్రామానికి చెందిన రైతు నాగరాజనాయుడుకు రెండెకరాల భూమి ఉంది. చాలాకాలంగా భూమి పాసు పుస్తకం, టైటిల్ డీడ్ కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగేవాడు. అయినా మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఎర్రావారిపాలెంలో రెవెన్యూ సదస్సు జరిగింది. నాగరాజునాయుడు కొండంత ఆశతో సదస్సుకు వచ్చాడు. తహసీల్దారు పరమేశ్వర స్వామిని కలిశాడు. తన గోడు వివరించాడు. తన దగ్గర భూమికి సంబంధించి ఉన్న ఆధారాలను చూపించాడు. దీంతో ఆయన అక్కడే ఉన్న వీఆర్‌ఓ శ్రీరాములను, ఆర్‌ఐ శ్రీనివాసులను రికార్డులు పరిశీలించాలని ఆదేశించారు. ఆధారాలు సక్రమంగా ఉండడంతో అరగంటలోనే ఆన్‌లైన్‌లో రైతు నాగరాజు నాయుడు పేర భూమి వివరాలను నమోదు చేశారు. అక్కడికక్కడే 1బీని రైతుకు అందజేశారు. పాస్ పుస్తకం మంజూరు చేశారు. దీంతో ఆ రైతు సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.