శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయ శుద్ధి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:00 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈనెల 4వ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆనందనిలయం నుంచి బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయంలోపల ఉన్న ఉపఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రిని నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పేశారు. శుద్ధి తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతా ప్రోక్షణం చేశారు. తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిఉన్న వస్ర్తాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్య కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమ నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.తిరుమంజనం కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు,అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో గౌతమి, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.