Share News

Pushpa red sandal ఇక తగ్గాల్సిందే పుష్పా!

ABN , Publish Date - Dec 19 , 2024 | 01:45 AM

జగన్‌ జమానాలో శేషాచలం అడవులను కొల్లగొట్టిన ఎర్ర దొంగల పనిపట్టేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఎర్రచందనం దుంగల విచ్చలవిడి దోపిడీకి చెక్‌ పెట్టాలని నిర్ణయించుకుంది. ఏకంగా గుజరాత్‌ గోడౌన్లపైనే మన టాస్క్‌ఫోర్స్‌ మెరుపుదాడి చేసింది. రూ3.5కోట్ల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.

Pushpa red sandal  ఇక తగ్గాల్సిందే పుష్పా!

ఆంధ్రజ్యోతి’తో టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌

తిరుపతి-ఆంధ్రజ్యోతి

జగన్‌ జమానాలో శేషాచలం అడవులను కొల్లగొట్టిన ఎర్ర దొంగల పనిపట్టేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఎర్రచందనం దుంగల విచ్చలవిడి దోపిడీకి చెక్‌ పెట్టాలని నిర్ణయించుకుంది. ఏకంగా గుజరాత్‌ గోడౌన్లపైనే మన టాస్క్‌ఫోర్స్‌ మెరుపుదాడి చేసింది. రూ3.5కోట్ల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. దీంతో ఎర్ర దొంగల గుండెల్లో దడ మొదలైంది. కూలీల మొదలు బడాల దాకా ఎవరినీ వదిలే ప్రశ్నే లేదని టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ హెచ్చరిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణపై తీసుకుంటున్న చర్యలపై ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన సంభాషణలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

మన అడవుల్లోనే దొరికే మేలురకం ఎర్ర చందనం కరువు సీమలో కల్పవృక్షం లాంటిది. అందుకే శేషాచలం కొండలను బయో అట్మాస్పియర్‌ అడవులుగా యునెస్కో గుర్తించింది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలలోని శేషాచల అటవీప్రాంతంలో 5.2 లక్షల హెక్టార్లలో ఎర్ర చందనం విస్తరించివుంది. ఎంతో విశిష్ట సుగుణాలు కల్గివుంది కాబట్టే విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. అందుకే ‘పుష్పరాజ్‌’ల కన్ను మన కొండలపై పడింది. ఏటా 2వేల టన్నులకు పైగా ఎర్రచందనం దుంగలను ‘పుష్పరాజ్‌’లు గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించినట్టు అంచనా.

శేషాచలంను కాపాడుకుంటాం

ఎర్రచందనం సంపదను పరిరక్షించే దిశగా ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పడింది. శేషాచలం అడవులను తమ అడ్డాలుగా మార్చుకున్నవారి ఆట కట్టిస్తాం. నిఘా పెంచాం. జల్లెడ పడుతాం. కఠినంగా వ్యవహరిస్తాం. అటవీ శాఖతో కలిసి శేషాచలంను కాపాడుకుంటాం. పెద్దఎత్తున దుంగలను స్వాధీనం చేసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు కూలీల సంఖ్య తగ్గిందనే చెప్పవచ్చు.

నిరంతర కూంబింగ్‌

కూలీలను అడవుల్లోకి వెళ్ళనివ్వకుండా ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు కట్టుదిట్టం చేశాం. రహదారులలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాం. అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతంలో మా బృందాలు నిరంతరం కూంబింగ్‌ చేస్తున్నాయి. అడవుల్లో బేస్‌ క్యాంపులు, వాచ్‌ టవర్లను ఏర్పాటు చేశాం. అక్కడ సిబ్బంది కాపలాగా ఉంటున్నారు.

బడాలను వదలం

ఎర్రచందనం దుంగలతో పాటు బడా దొంగలను కూడా అరెస్టు చేస్తున్నాం. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం గుజరాత్‌లోని గోడౌన్లపై దాడిచేసి ముగ్గురు ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేసి తీసుకొచ్చాం. చిన్న కూలీ చిక్కినా మూలాలుకు వెళ్లి బడా స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం.

శాటిలైటట్‌ ఫోన్‌లు

శేషాచల కొండల్లో మొబైల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ రానిచోట శాటిలైట్‌ ఫోన్లు, బైనాక్యులర్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇటీవల స్మగ్లర్ల జాడను గుర్తించిన మా సిబ్బంది శాటిలైట్‌ ఫోన్లతోనే అందరికీ సమాచారమిచ్చారు. దీంతో సులభంగా ఆయా ప్రాంతాలకు వెళ్లగలుగుతున్నాం. శాటిలైట్‌ ఫోన్లు సత్ఫలితాలు వస్తున్నాయి.

ఆధునిక డ్రోన్‌లు వస్తున్నాయ్‌

అభయారణ్యాన్ని అన్వేషించాలంటే సాధారణ డ్రోన్స్‌ సరిపోవు. ప్రత్యేకమైన థర్మోస్టాటిస్టిక్‌ డ్రోన్స్‌ కావాలి. వాటికి ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలు అవసరం. వీటితో అయితేనే చెట్ల కింద ఉండే మనుషులతో పాటు, జంతువుల కదలికలను కూడా గుర్తించవచ్చు. ఇటువంటి మూడు డ్రోన్స్‌ ప్రధానమైన 3 బేస్‌లకు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.

సీఎం చంద్రబాబు అభినందనలు

గుజరాత్‌ గోడౌన్లపై మెరుపుదాడి చేసి రూ3.5కోట్ల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసిన తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం తన ‘ఎక్స్‌’ వేదికగా ఇలా అభినందించారు..

‘‘మన రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు జీరో టాలరెన్స్‌ విధానాన్ని అనుసరిస్తాం. మన సహజ వనరులను దోపిడీ చేయడానికి ప్రయత్నించేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు. ఈ అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో తిరుపతి రెడ్‌ సాండర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ శ్రద్ధతో కృషిచేసినందుకు అభినందిస్తున్నా’’

Updated Date - Dec 19 , 2024 | 01:45 AM