Share News

రోడ్డు రోలర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Dec 18 , 2024 | 01:20 AM

39మందికి గాయాలు

రోడ్డు రోలర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ప్రమాదస్థలంలో బాధితులు - దెబ్బతిన్న ఆర్టీసీ బస్సు ముందుభాగం

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుపతి రూరల్‌ మండలం రామానుజపల్లె జంక్షన్‌ వద్ద (పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారి) మంగళవారం ఉదయం అతి వేగంగా వచ్చిన చిత్తూరు-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు రోలరును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 50 మందిలో 39 మందితో పాటు రోడ్డురోలర్‌ డ్రైవరు కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు, పోలీసులు యుద్దప్రాతిపదికన క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో తిరుపతి రుయాస్పత్రికి తరలించారు.వీరిలో కుమార్‌తో పాటు రమేష్‌, శరవణ, ధర్మ, హనుమంతప్ప పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతింది. రోడ్డు రోలరు జంక్షన్‌ పాయింట్‌ కట్‌ అయింది. దీంతో ఇంజన్‌ నుంచి వెనుక భాగం వేరై పక్కనే వున్న డివైడర్‌ పైకి ఎక్కింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ తప్పిదమే ప్రధాన కారణంగా పోలీసులు భావించి కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సును సీజ్‌ చేశామని ఎస్‌ఐ రామకృష్ణ చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి ఆరా తీశారు. గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్సలు అందించాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను ఆదేశించారు.

Updated Date - Dec 18 , 2024 | 01:20 AM