విషాదాంతం
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:46 AM
వివాహితులైన ఇద్దరి మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. విషాదాంతంగా మారింది. వివాహేతర సంబంధం కలిగిన రామచంద్ర, శోభ బుధవారం ఆత్మహత్యకు పాల్పడగా.. తన కుమారుడి వ్యవహారం తెలిసి మంగళవారమే సల్లాపురెమ్మ బలవన్మరణం చెందారు...
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న వివాహేతర సంబంధం
రామకుప్పం/శాంతిపురం, సెప్టెంబరు 4: వివాహితులైన ఇద్దరి మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. విషాదాంతంగా మారింది. వివాహేతర సంబంధం కలిగిన రామచంద్ర, శోభ బుధవారం ఆత్మహత్యకు పాల్పడగా.. తన కుమారుడి వ్యవహారం తెలిసి మంగళవారమే సల్లాపురెమ్మ బలవన్మరణం చెందారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శాంతిపురం మండలం శిలామాకులరాయికి చెందిన రామచంద్రకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతడు కొన్నేళ్ల కిందట బెంగళూరులో స్థిరపడ్డారు. అక్కడ టిప్పరు నడుపుతూ.. చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొన్ని నెలల కిందట హిందూపురానికి చెందిన గిరీష్.. ఇతడి వద్ద డ్రైవరుగా చేరాడు. అతడికీ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి రెండు కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో గిరీష్ భార్య శోభతో రామచంద్రకు చనువు పెరిగి అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ నేపథ్యంలో పది రోజుల కిందట వీరిద్దరూ కనిపించకుండా పోయారు.
తన భర్త కనబడటం లేదంటూ గతనెల 24న రామచంద్ర భార్య బెంగళూరులో.. తన భార్య కనబడుట లేదని 26వ తేదీన గిరీష్ హిందూపురంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రామచంద్ర, శోభ రామకుప్పం మండలం చెలిమిచేను అటవీ ప్రాంతంలోని కాజ్‌వే సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండగా పశువుల కాపరులు గుర్తించి, గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. వీరిని స్థానికులు 108 వాహనంలో కుప్పంలోని పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వీరు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామచంద్ర, శోభ పురుగుల మందు తాగి ఉంటారని, సంఘటన స్థలం వద్ద వారు వాంతులు చేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌చార్జి ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
రెండు రోజుల కిందటే రామచంద్ర తల్లి ఆత్మహత్య
తన కుమారుడు రామచంద్రకు వివాహేతర సంబంధం ఉందన్న విషయం తెలిసి సల్లాపురెమ్మ మనస్తాపంతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారం రోజుల కిందట శోభతో కలిసి రామచంద్ర శిలామాకులరాయిలోని తన ఇంటికి వచ్చాడు. దీనిపై ఆమె కుమారుడిని తీవ్రస్థాయిలో మందలించింది. గుండెజబ్బుతో బాధపడుతున్న ఆమె సోమవారం ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్యులు తెలిపారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు కుమారుడి వైఖరి జీర్ణించుకోలేని ఆమె మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా, రామచంద్ర, శోభ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.