సహపంక్తి భోజనం.. స్త్రీ శక్తి ఉద్బోధనం!
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:57 AM
చంద్రబాబు అక్రమ కేసులో జైలుకు వెళ్లినప్పుడు పోరాడింది స్త్రీలే. వారి శక్తి అపారం. వారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.’ అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.
కుప్పంలో భువనేశ్వరి 3వ రోజు పర్యటన తీరూతెన్ను
కుప్పం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు అక్రమ కేసులో జైలుకు వెళ్లినప్పుడు పోరాడింది స్త్రీలే. వారి శక్తి అపారం. వారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.’ అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో మూడవ రోజైన శనివారం రామకుప్పం, శాంతిపురం మండలాలలో విస్తృతంగా పర్యటించారు. చిన్నారులతో కలసి సహపంక్తి భోజనాలు చేశారు. గ్రామీణ మహిళలతో, డ్వాక్రా సంఘాలతో మమేకమై, వారి శక్తిని వారికి గుర్తు చేశారు. మహిళలు తలచుకుంటే కాని కార్యాలు ఏవీ ఉండవని, ఆర్థికంగా విజయం సాధించిన డ్వాక్రా సంఘాలు, హెరిటేజ్ సంస్థను నడుపుతున్న తానే నిదర్శమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) రూ.85 లక్షలను లబ్ధిదారులకు అందజేశారు. డ్వాక్రా సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు.కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాల గెస్ట్ హౌస్ వద్ద ప్రజలనుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆమె రామకుప్పం మండలం మొద్దులవంక గ్రామానికి ఉదయం 11.30 గంటలకు చేరుకుని అక్కడ మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. అయిదేళ్లపాటు అరాచక పాలన సాగించి తమపై వివక్ష చూపిన గత ప్రభుత్వంనుంచి కుప్పానికి విముక్తి కలిగించడానికి చంద్రబాబును గెలిపించుకుని మహిళలు విజయం సాధించారన్నారు రాబోయే అయిదేళ్లలో కుప్పాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసి, దేశానికి ఆదర్శంగా నిలపడం చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబంగా తమవంతు బాధ్యతని హామీ ఇచ్చారు. ప్రభుత్వపరంగానే కాక, ఎన్టీఆర్ ట్రస్టు తరఫున కుప్పంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అనంతరం విజలాపురంలో కస్తూర్బా విద్యాలయానికి వెళ్లి, అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం శాంతిపురంలోని నందిగం కళ్యాణ మండపం చేరుకుని, డ్వాక్రా సంఘాలతో మమేకమయ్యారు. మగవాళ్లకన్నా వేయిరెట్లు ఆడవాళ్లు శక్తివంతులని, వారు ఒక పని చేస్తే, స్త్రీలు పది పనులు ఒక్క చేతితో చక్కబెట్టగలరని కితాబునిచ్చారు.శాంతిపురం వెలుగు మండల మహిళా సమాఖ్యకు రూ.6.70 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. 2019లో విద్యుత్తు ప్రమాదంలో మరణించిన సి.బండపల్లెకు చెందిన రైతు ఆర్.రామచంద్ర భార్య జ్యోతికి రెస్కో తరఫున రూ.5 లక్షలు చెక్కు పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేశ్ సతీమణి, స్వయానా కోడలు అయిన నారా బ్రాహ్మణి జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలతో కలసి కేక్ కట్ చేశారు. మొరసనపల్లెలో కూడా మహిళలతో ముకాముఖి సమావేశమై వారితో సంభాషించారు.సాదకబాధకాలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.అనంతరం భువనేశ్వరి కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుని, 13మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.85 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేశారు. సాయంత్రం 6.45 గంటలకు కార్యక్రమాలన్నీ ముగించుకున్న నారా భువనేశ్వరి పీఈఎస్ వైద్య విద్యాలయం గెస్ట్ హౌస్‌కు చేరుకుని బస చేశారు.కాగా భువనేశ్వరికి అడుగడుగునా భారీ స్వాగత సత్కారాలు లభించాయి. రామకుప్పం మండలంలో దారిపొడవునా పూలబాటలు పరిచి స్వాగతం పలికారు గిరిజన సంప్రదాయ రీతులలో డప్పు వాద్యాలతో హోరెత్తించారు. మహిళలు మంగళ హారతులు పట్టి తిలకాలు దిద్ది ఆదరంగా స్వాగతించారు. శాంతిపురంలోని డ్వాక్రా మహిళా సంఘాల సమావేశానికి ముందు చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆమెకు ఆహ్లాదాన్ని కలిగించారు.ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎ్‌స.మునిరత్నం,మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ విస్తరణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్.సురేశ్‌బాబు, రామకుప్పం, శాంతిపురం మండలాల పార్టీ అధ్యక్షులు ఆనంద రెడ్డి, విశ్వనాథ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
నేటి పర్యటన ఇలా
9ఏఎం - 10.15ఏఎం: ప్రజల నుంచి వినతుల స్వీకరణ
10.30ఏఎం - 12.15పీఎం: చెల్దిగానిపల్లెలో మహిళలతో ముఖాముఖి
12.30 పీఎం - 1.30పీఎం: వి.కోటలో సుజల ప్లాంటుకుప్రారంభోత్సవం
1.30 పీఎం - బెంగళూరు పయనం