సర్పంచుల సంబరం
ABN , Publish Date - Nov 09 , 2024 | 01:28 AM
ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీలోనే ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గత ప్రభుత్వంలా ఇతర అవసరాలకు నిధులు మళ్లించడం, పంచాయతీ ఖాతాలను స్తంభింపజేయడం మానేసి ఆర్థికసంఘం నిధులు వచ్చినవి వచ్చినట్లు జమ చేస్తుండడంతో పంచాయతీలకు మళ్లీ మంచి రోజులు ప్రారంభవయ్యాయి.
గతంలో రూ.120 కోట్లను మళ్లించేసిన వైసీపీ ప్రభుత్వం
త్వరలో అందనున్న మరో విడత ఆర్థిక సంఘం నిధులు
ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీలోనే ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గత ప్రభుత్వంలా ఇతర అవసరాలకు నిధులు మళ్లించడం, పంచాయతీ ఖాతాలను స్తంభింపజేయడం మానేసి ఆర్థికసంఘం నిధులు వచ్చినవి వచ్చినట్లు జమ చేస్తుండడంతో పంచాయతీలకు మళ్లీ మంచి రోజులు ప్రారంభవయ్యాయి.
చిత్తూరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో 697 గ్రామ పంచాయతీలుండగా.. 684 చోట్ల ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పడ్డాయి. సర్పంచులు గెలిచినప్పటి నుంచీ ఖాతాల్లో నిధులు లేక, గ్రామాల్లో చిన్నపాటి పనులూ చేయలేక ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధుల్ని ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించేసేది. ఇలా జిల్లాలో పలు విడతల్లో రూ.120 కోట్లను ఇతర అవసరాల పేరుతో మళ్లించేసింది. దీంతో సొంత డబ్బులు ఖర్చు చేసిన వారు బిల్లులు రాక ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విడతల వారీగా బిల్లులు మంజూరు చేస్తుండడంతో వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఫ ఇప్పటికే రూ.29.24 కోట్లు జమ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీలకు మంచికాలం వచ్చింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.ఈ క్రమంలో ఆగస్టు 22వ తేదీన జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.29.24 కోట్లు జమ చేశారు. ఈ మొత్తాన్ని పాలకవర్గాలున్న 684 గ్రామ పంచాయతీల ఖాతాల్లో వేశారు. కొందరు సర్పంచులు పాత బిల్లుల్ని తీసుకుంటే, మరికొందరు పంచాయతీలో అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు.మరో విడత నిధులూ త్వరలో జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు రూ.750 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల్ని త్వరలో జమ చేస్తున్నట్లు గురువారం డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అమరావతిలో ప్రకటించారు.ఈ నిధుల్ని విడుదల చేస్తే జిల్లాకు మరో రూ.30 కోట్లు రావచ్చు. జనాభా ఆధారంగా ఈ నిధుల్ని పంచాయతీలకు సర్దుబాటు చేయనున్నారు.ఇప్పటికే జమయిన నిధులతో పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి. దీంతో జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వైసీపీ సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం విపక్షాలను భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకుంది.ప్రతిపక్షాల మద్దతుదారులను నామినేషన్లే వేయనీకుండా పెద్దఎత్తున సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, వార్డు కౌన్సిలర్లను గెలిపించుకుంది.అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉత్సవ విగ్రహాలుగా మారిన సర్పంచులు.. ఇప్పుడు ఖాతాల్లో జమయిన నిధులతో పనులు చేసుకుంటున్నారు. పంచాయతీ స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉపాధిహామీ నిధులతో సీసీ రోడ్లను మంజూరు చేశారు. ఆ పనులు క్షేత్ర స్థాయిలో ప్రారంభమై పురోగతిలో ఉన్నాయి. ఈ పనుల పర్యవేక్షణ బాధ్యత మొత్తం సర్పంచులకే అప్పగించారు.నిధుల కోసం రోడ్డెక్కి ధర్నా చేసే స్థాయి నుంచి గ్రామాల్లో రోడ్లను బాగు చేసుకునే స్థాయికి సర్పంచులు ఎదిగారు.
ఫ కూటమి ప్రభుత్వంతో ధైర్యం
మా వైసీపీ ప్రభుత్వంలో మేమంతా డమ్మీలుగా ఉండేవాళ్లం.మాకు వచ్చిన ఆర్థికసంఘం నిధుల్ని కూడా ఎప్పటికప్పుడు మళ్లించేసేవారు. మా పంచాయతీలో సుమారు నాలుగు వేల ఓట్లున్నాయి. ఓ సారి రూ.33 లక్షలు విద్యుత్తు బిల్లుల పేరుతో, మరోసారి రూ.13.40 లక్షలు కారణం లేకుండా మళ్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక మా పంచాయతీకి రూ.2 వేలు తక్కువ రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో పంచాయతీలో పనులు చేసుకోవచ్చన్న ధైర్యం వచ్చింది.
- రమేష్, కృష్ణాపురం సర్పంచి (వైసీపీ), వి.కోట మండలం
మాకు సర్వాధికారాలు వచ్చాయి
వైసీపీ ప్రభుత్వం పలు విడతల్లో మా పంచాయతీకి కేంద్రం ఇచ్చిన నిధుల్ని రూ.16.40 లక్షల వరకు మళ్లించేసింది. చిన్న చిన్న పనులు కూడా చేసే పరిస్ధితి ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రూ.5.40 లక్షల్ని మంజూరు చేసింది. ఆ నిధుల్ని పంచాయతీ అభివృద్ధితో పాటు, మరమ్మతులకు వాడుకుంటాం. దీంతో పాటు మా పంచాయతీలో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనుల పర్యవేక్షణ బాధ్యత కూడా మాకే ఇచ్చారు.
- భగవతి, ఓటివారిపల్లె సర్పంచి (టీడీపీ), యాదమరి మండలం
వైసీపీ లాగేసుకుంటే.. టీడీపీ ఇస్తోంది
నంజరపల్లె పంచాయతీలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని కాదని స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి నన్ను ఒక్క ఓటు తేడాతో ప్రజలు గెలిపించారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇస్తుంది కాబట్టి పంచాయతీని అభివృద్ధి చేసుకుందాం అనుకున్నా వైసీపీ ప్రభుత్వం నిధుల్ని ఎప్పటికప్పుడు మళ్లించేసింది. సుమారు రూ.5 లక్షల నిధుల్ని లాగేసింది. కూటమి ప్రభుత్వం వస్తానే రూ.1.60 లక్షల నిధులు జమయ్యాయి. ఇక పనులు చేసుకుంటాం.
-ఊహ, నంజరపల్లె సర్పంచి , పెనుమూరు మండలం