Share News

తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

ABN , Publish Date - Dec 22 , 2024 | 02:20 AM

సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉండాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మెరైన్‌ పోలీసులకు సూచించారు. తూపిలిపాలెం, దుగరాజపట్నం బీచ్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

- బీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

తిరుపతి(కలెక్టరేట్‌), డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉండాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మెరైన్‌ పోలీసులకు సూచించారు. తూపిలిపాలెం, దుగరాజపట్నం బీచ్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కోస్టల్‌ సెక్యూరిటీ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దుగరాజపట్నంకు సంబంధించిన కోస్టల్‌ సెక్యూరిటీ పోలీ్‌సస్టేషన్‌ మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పూడిరాయి దరువు వద్ద జెట్టి నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లేటప్పుడు ఆధార్‌, బయోమెట్రిక్‌ కార్డు వెంట తీసుకుని వెళ్లేలా చర్యలు చేపట్టాలని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజును ఆదేశించారు. కోస్టల్‌ సెక్యూరిటీలో ఖాళీలను భర్తీ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సముద్రంపై అక్రమంగా చేపల వేట జరగకుండా జాయింట్‌ పెట్రోలింగ్‌ చేయాలన్నారు. సమావేశంలో డీసీఐఓ శిరీష, క్రైం అదనపు ఎస్పీ నాగభూషణరావు, కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ అదనపు ఎస్పీ మధుసూదన్‌రావు, కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ డివిజన్‌ తిరుపతి సూపరింటెండెంట్‌ శ్యాంసుందర్‌రెడ్డి, కోస్ట్‌గార్డ్‌ అధికారి బేగ్‌, డీఎస్పీ గిరిధర్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజ, మెరైన్‌ పోలీస్‌ అధికారులు మాలకొండయ్య, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 02:20 AM