Share News

214 హెచ్‌ఎంలకు, 26 మంది ఎంఈవోలకు షోకాజ్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:23 AM

టీచర్లకు జగన్‌ ప్రభుత్వంలో చుక్కలు చూపించారు. ఈ ఐదేళ్లలో ఏ శాఖకూ లేని షరతులు, నిబంధనలు, అదనపు పనిభారం పెట్టి నిత్యం వేధించారు. తాజాగా యూడైస్‌ (విద్యార్థుల నమోదు) ప్రక్రియలో చోటు చేసుకున్న చిన్ని చిన్న తప్పులను కారణాలుగా చూపుతూ 25 మండలాల్లోని 213మంది హెచ్‌ఎంలకు, 26 మంది ఎంఈవోలకు డీఈవో దేవరాజు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

214 హెచ్‌ఎంలకు, 26 మంది ఎంఈవోలకు షోకాజ్‌
షోకాజ్‌ నోటీసులపై డీఈవోతో చర్చిస్తున్న ఎస్టీయూ నేతలు

కరోనా లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాల వద్ద కాపలా

చిత్తూరు (సెంట్రల్‌), ఏప్రిల్‌ 26: టీచర్లకు జగన్‌ ప్రభుత్వంలో చుక్కలు చూపించారు. ఈ ఐదేళ్లలో ఏ శాఖకూ లేని షరతులు, నిబంధనలు, అదనపు పనిభారం పెట్టి నిత్యం వేధించారు. తాజాగా యూడైస్‌ (విద్యార్థుల నమోదు) ప్రక్రియలో చోటు చేసుకున్న చిన్ని చిన్న తప్పులను కారణాలుగా చూపుతూ 25 మండలాల్లోని 213మంది హెచ్‌ఎంలకు, 26 మంది ఎంఈవోలకు డీఈవో దేవరాజు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాప్టో, ఎస్టీయూ సంఘాల నాయకులు శుక్రవారం డీఈవోతో చర్చలు జరిపారు. పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడం, ఉన్న వాటిలో సిగ్నల్స్‌ రాకపోవడం వంటి అనేక కారణాలున్నాయని, వీటికి ఎవరు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. శాఖ పరమైన లోపాలు సవరించకుండా సమాచారం రాలేదనే సాకుతో టీచర్లకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఉపసంహరించుకోవాలని డీఈవోకు వినతిపత్రం అందించారు.

పెరిగిన పనిభారం

గడిచిన ఐదేళ్లలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న వారిపై పనిభారం పడింది. జిల్లాలో 1,300 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ఇందులోని సింగిల్‌ టీచర్‌ రోజుకు 20 తరగతులు బోధించాలి. దీంతోపాటు పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, మార్కుల నమోదు, విద్యార్థుల సామర్థ్యం గ్రేడింగ్‌, సబ్జెక్టుల్లో వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణ ఇవాల్సి ఉంది. సమావేశాలకు హాజరుకావడం, అడిగిన సమాచారం ఇవ్వడం వంటివి చేయాల్సి ఉంది.

నాడు-నేడు పనుల పర్యవేక్షణ

పాఠశాల రూపురేఖలు మార్చడంలో భాగంగా రెండు విడతలుగా నాడునేడు కింద పనులు చేపట్టారు. వీటిని పర్యవేక్షించడమేగాక సంబంధిత వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే పని టీచర్లకు అప్పగించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పర్యవేక్షణ, వివరాల నమోదు వారికే అప్పగించారు. విద్యార్థుల హాజరు, మరుగుదొడ్ల నిర్వహణ ఇలాంటి అనేక రకాలైన ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. జగనన్న విద్యాకానుక అందజేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఇవన్నీ జగన్న పాలనలో టీచర్లను వేధింపులకు గురిచేసిన అంశాలే.

కరోనా కాలంలో మద్యం దుకాణాల వద్ద..

కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ టీచర్లను వదల్లేదు. మద్యం దుకాణాల వద్ద పీడీ, పీఈటీలకు విధులు అప్పగించారు. విద్యాబుద్ధులు నేర్పించే టీచర్లు మద్యం దుకాణాల వద్ద కాపాలా ఏమిటనే దానిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనా జగన్‌ సర్కార్‌ పట్టించుకోలేదు.

న్యాయ పోరాటాలు

జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలపై పోరాడే కొంతమంది టీచర్లు మరింత బానిసలుగా మారిపోతున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏటా వందలాది మంది టీచర్లు ఉద్యోగ విరమణ పొందుతుండంతో పోస్టులు ఖాళీ అవుతున్నాయి. దీంతో డీఎస్సీ ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఐదేళ్లుగా ఒత్తిడి పెంచుతున్నా ఫలితం దక్కలేదు. మరో వైపు సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ ప్రకటించాలని ఉద్యమాలు చేస్తున్నా చివరి సమయంలో జీపీఎస్‌ ప్రకటించింది. ఓపీఎస్‌ ప్రకటించకుండా కాలయాపన చేసింది. 117 జీవో రద్దుపై ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అక్రమ బదిలీలు, డెప్యూటేషన్లను నిరసిస్తూ ఉద్యమాలు కొనసాగించినా ఫలితం శూన్యంగా కనిపిస్తోంది. బోధనేతర కార్యక్రమాలు రద్దు, సీనియారిటీ జాబితా ప్రకటన, ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలి అనే అనేక అంశాలపై చేసిన యత్నాలు, నిరసనలు, దీక్షలు, ధర్నాలు నిరుపయోగంగా మారాయి.

దాచుకున్న సొమ్ముకోసం..

సొంత అవసరాలకు ప్రభుత్వం కల్పించిన కొన్ని వెసలుబాట్లను ఉపయోగించుకుని ఉపాధ్యాయులు పలు మార్గాల్లో సొమ్ము దాచుకుంటున్నారు. జిల్లా పరిషత్‌లోని పీఎఫ్‌, ఏపీజీఎల్‌, ఈఎల్‌ తదితరాల్లో సొమ్ము దాచుకుంటారు. అవసరానికి దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ మొత్తాలను ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలోనూ టీచర్లకు ప్రభుత్వ నుంచి పరోక్షంగా వేధింపులు తప్పలేదు. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు చేసిన విజ్ఞప్తులు అడవిరోదనగా మిగిలిపోయాయి.

Updated Date - Apr 27 , 2024 | 01:23 AM