సజావుగా ఎన్నికల నిర్వహణ
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:57 AM
రాబోయే ఎన్నికలను ఎటువంటి సమస్యలూ రాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేటట్టు చూడడమే తన మొదటి ప్రాధాన్యత అని నూతన ఎస్పీ మలిక గర్గ్ అన్నారు
తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 12: రాబోయే ఎన్నికలను ఎటువంటి సమస్యలూ రాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేటట్టు చూడడమే తన మొదటి ప్రాధాన్యత అని నూతన ఎస్పీ మలిక గర్గ్ అన్నారు.గతంలో ఇక్కడ జరిగిన ఘటనలు, వాటి పర్యవసానాలను ప్రస్తుతం చూస్తున్నామని, మళ్లీ అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని ఆమె చెప్పారు.జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టిన ఆమెకు పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కూడా ప్రాధాన్యతనిస్తానని చెప్పారు.ఎన్నికల సందర్భంగా చాలా కష్టపడి పనిచేయాల్సి ఉందన్నారు.ఓ టీమ్‌గా ఎలా పనిచేయాలి, ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి, వాటిని అధిగమించేందుకు ఏంచేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ఢిల్లీకి చెందిన మలిక గర్గ్ 2015 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. పశ్చిమబెంగాల్ క్యాడర్‌కు చెందిన మలిక గర్గ్ శిక్షణ తరువాత పశ్చిమ బెంగాల్ చందన్ నగర్‌లో ఏసీపీగా, సీరాంపూర్ ఏసీపీగా, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేశారు. అనంతరం ఇంటర్ ట్రాన్ఫర్‌లో ఏపీ క్యాడర్‌కు వచ్చారు. తొలుత కృష్ణా జిల్లా ఏఎస్పీగా పనిచేసి, తరువాత ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2 సంవత్సరాల 7 నెలలపాటు అక్కడ ఎస్పీగా పనిచేసిన ఆమె ఇటీవలి బదిలీల్లో భాగంగా తిరుపతిలో బాధ్యతలు చేపట్టారు.