Share News

యథేచ్ఛగా మట్టిదందా

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:17 AM

వైసీపీ తరహా దోపిడీ కొనసాగింపు

యథేచ్ఛగా మట్టిదందా
ఎక్సకవేటర్‌ సాయంతో టిప్పర్‌లో మట్టి పోస్తున్న దృశ్యం

తిరుపతి/ఏర్పేడు, సెప్టెంబరు 15: ప్రభుత్వం మారినా వైసీపీ నాయకుల మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నేషనల్‌ హైవే నిర్మాణానికి రేణిగుంట మండలం మల్లిమడుగు డ్యాం వెనుక భాగంలో గుట్టను తవ్వుకోవడానికి అప్పటి కలెక్టర్‌ అనుమతిచ్చారు. హైవే నిర్మాణం మాటున మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైసీపీ మండల నాయకులు ఐదేళ్లు మట్టిని అక్రమంగా తరలించి కోట్లు సంపాదించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారి మూడు నెలలు కావస్తున్నా అదే స్థాయిలో దోపిడీ సాగుతోంది. ఏకంగా భారీ మిషనరీతో గుట్టను తవ్వేస్తున్నారు. సగానికి పైగా గుట్ట కరిగిపోయింది. ఈ మట్టిని ప్రైవేటు కాంట్రాక్టర్లకు, వెంచర్లకు లోడు టిప్పర్‌ లారీ రూ.20వేలకు విక్రయిస్తున్నారని సమాచారం. అలాగే ఏర్పేడు మండలంలోని కేంద్రీయ విద్యాసంస్థ ఐసర్‌ ప్రహరీకి ఆనుకుని ఉన్న చెరువులో మట్టిని తిరుపతికి చెందిన ఓ వ్యక్తి వెంచర్‌కు తరలిస్తున్నారు. జంగాలపల్లి పంచాయతీ శివగిరిపల్లి చెరువులో మట్టిని ఎక్స్‌కవేటర్ల సాయంతో టిప్పర్లు, ట్రాక్టర్లలో నింపి తరలించేస్తున్నారు. రెండు రోజులుగా ఈ దందా సాగుతోంది. రోజుకు సుమారు 200 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఐదు ఇసుక లారీల పట్టివేత

మండలంలోని గోవిందవరం సబ్‌స్టేషన్‌ సమీపంలో నిల్వ ఉంచిన ఇసుకను కొంతమంది లారీల ద్వారా తరలించడానికి ఆదివారం రాత్రి యత్నించారు. సమాచారం అందుకున్న వికృతమాత మాజీ సర్పంచ్‌ హేమాక్షిరాయల్‌ తన అనుచరులతో అక్కడికి చేరుకుని లారీలను అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి ఐదు లారీలను వారికి అప్పగించారు. తరలింపు వెనుక ఉన్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 16 , 2024 | 01:17 AM