Siege-స్పైసీ ప్యారడైజ్ సీజ్
ABN , Publish Date - Nov 05 , 2024 | 01:38 AM
హోటల్లోని వంటగది అపరిశుభ్రంగా ఉంది. బొద్దింకలు తిరగాడుతున్నాయి. దీంతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని స్పైసీ ప్యారడైజ్ హోటల్‌ను సోమవారం అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు.
ఫ లోపలంతా అపరిశుభ్రం.. భారీగా బొద్దింకలు
ఫ అపరిశుభ్ర హోటళ్లపై కఠినంగా వ్యవహరిస్తామన్న హెల్త్ ఆఫీసర్
తిరుపతి (ఉపాధ్యాయనగర్), నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): హోటల్లోని వంటగది అపరిశుభ్రంగా ఉంది. బొద్దింకలు తిరగాడుతున్నాయి. దీంతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని స్పైసీ ప్యారడైజ్ హోటల్‌ను సోమవారం అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఆదివారం స్విగ్గీ యాప్ ద్వారా సైసీ ప్యారడైజ్ హోటల్లో బకెట్ బిర్యానీకి ఓ వినియోగదారుడు ఆర్డర్ పెట్టారు. రూ.1255 చెల్లించారు. ఆ బిర్యానీలో బొద్దింక ఉండటం.. హోటల్ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అతడు ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమవడంతో సోమవారం ఆహార భద్రతాధికారులు, మున్సిపల్ ఆరోగ్యాధికారులు స్పైసీ ప్యారడైజ్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. వంటగది అత్యంత అపరిశుభ్రంగా ఉండటం, బొద్దింకలను చూసి అధికారులు నివ్వెరపోయారు. పాత్రలకు మూతలు లేవు. కోల్డ్ స్టోరేజీకి సరైన పద్ధతి అమలు చేయకపోవడం తదితరాలను అధికారులు గుర్తించారు. అన్ని ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. హోటల్‌ను తాత్కాలికంగా మూత వేశారు. నిబంధనలన్నీ పాటిస్తూ మార్పులు చేశాకే మళ్లీ తెరిచేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. తాము గుర్తించిన లోటుపాట్లను పేర్కొంటూ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. కాగా, ఆహార భద్రతా నిబంధనలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ అన్వేష్ హెచ్చరించారు. స్పైసీ ప్యారడైజ్‌లో తీసిన ఆహార పదార్థాల నమూనాలకు సంబంధించి ల్యాబ్ రిపోర్టులు వచ్చాక మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట శానిటరీ సూపర్‌వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు.