నాడు శ్రీగంధం కేసులో సస్పెన్షన్
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:26 AM
రెండు నెలల కిందట శ్రీగంధం కేసులో సస్పెండైన కానిస్టేబుల్ గుర్రప్ప.. బుధవారం ఎర్రచందనం కేసులో అరెస్టయ్యారు. ఎర్రావారిపాళెం పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇతడిపై అనేక ఆరోపణలున్నాయి.
ఫ నేడు ఎర్రచందనం కేసులో అరెస్టు
ఫ ఎర్రావారిపాళెం కానిస్టేబుల్ నిర్వాకం
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రెండు నెలల కిందట శ్రీగంధం కేసులో సస్పెండైన కానిస్టేబుల్ గుర్రప్ప.. బుధవారం ఎర్రచందనం కేసులో అరెస్టయ్యారు. ఎర్రావారిపాళెం పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇతడిపై అనేక ఆరోపణలున్నాయి. గతంలో శ్రీగంధం అక్రమ రవాణా కేసులో కొంతమంది నిందితులను, ఆటో డ్రైవర్ సుబ్రహ్మణ్యం రెడ్డిని బెదిరించి మామూళ్లు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఘటనలో రెండు నెలల కిందట కానిస్టేబుల్ గుర్రప్పను సస్పెండు చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. ఈ క్రమంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టగా.. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులోనూ గుర్రప్పకు ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఎర్రచందనం స్మగింగ్‌కు పాల్పడుతున్న ఏ4 ముద్దాయితో నేరుగా సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రిమాండుకు తరలించారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు.