Swear-నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:21 AM
టీటీడీ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బుధవారం నిరాడంబరంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం చైర్మన్ బీఆర్ నాయుడు, మరో 15 మంది సభ్యులు, ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా దేవదాయ శాఖ కార్యదర్శి ప్రమాణ స్వీకారం చేశారు.
క్షేత్రసంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకున్న టీటీడీ చైర్మన్
తిరుమల, నవంబరు6 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బుధవారం నిరాడంబరంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం చైర్మన్ బీఆర్ నాయుడు, మరో 15 మంది సభ్యులు, ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా దేవదాయ శాఖ కార్యదర్శి ప్రమాణ స్వీకారం చేశారు. సంప్రదాయ వస్త్రధారణ, నుదుట నామంతో క్షేత్రం సంప్రదాయాన్ని పాటిస్తూ బీఆర్ నాయుడు తొలిగా పుష్కరిణి నీటి ప్రోక్షణ చేసుకుని వరాహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత కూలైన్‌లో ఆలయంలోకి వెళ్లి ప్రమాణస్వీకారం చేశాక శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా చైర్మన్ అంటే పుష్పగుచ్ఛాలు అందజేసి, పట్టువస్త్రాలతో సత్కరించే హడావుడి అధికంగా ఉంటుంది. ఈయన మాత్రం బొకే సంప్రదాయం వద్దని నిరాకరించడంతో ఆలయం ముందు ఎలాంటి హడావుడి కనిపించ లేదు. ఆలయం ముందూ ఎలాంటి ప్రసంగాలు చేయకుండా వెళ్లిపోయారు. ఇక సభ్యుల్లోనూ రాజకీయ నాయకులున్నా కార్యకర్తల హడావుడి కనిపించలేదు. తొలిరోజే సభ్యులు, టీటీడీలోని పలు విభాగాల అధికారులతో చైర్మన్ సమీక్షించారు. ఆయా విభాగాలు చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన పెంచుకునేందుకు సుదీర్ఘంగా సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు చేపట్టాల్సిన సౌకర్యాలపై చర్చించడంతో పాటు గతంలో తలెత్తిన ఇబ్బందులు, విమర్శలపైనా మాట్లాడారు.
నేడు మరో ముగ్గురు
మిగిలిన సభ్యుల్లో ఫార్మా రంగానికి చెందిన సుచిత్ర ఎల్లా, స్థానిక బీజేపీ నేత భానుప్రకా్‌షరెడ్డి, ముని కోటేశ్వరరావు గురువారం ప్రమాణం చేయనున్నారు. వీరితో పాటు కృష్ణమూర్తి వైద్యనాథన్ కూడా ప్రమాణం చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక, జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మి, సదాశివరావు శుక్రవారం ప్రమాణం చేయనున్నారు.