వర్షపు నీటిలో టపాసుల దుకాణాలు
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:33 AM
అసలే ఊరికి దూరం....పైగా సౌకర్యాల లేమి... వెరసి చిత్తూరులో ఈసారి టపాకాయల వ్యాపారులకు నష్టాలు మిగిల్చాయి. కొన్నేళ్లుగా ఇస్తోన్న మార్కెట్‌యార్డును కాదని ఈసారి నగర శివారులోని మురకంబట్టు బైపాస్ రోడ్డులో తాత్కాలిక టపాసుల దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
సౌకర్యాలు కల్పించక నష్టపోయామంటున్న వ్యాపారులు
చిత్తూరు అర్బన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): అసలే ఊరికి దూరం....పైగా సౌకర్యాల లేమి... వెరసి చిత్తూరులో ఈసారి టపాకాయల వ్యాపారులకు నష్టాలు మిగిల్చాయి. కొన్నేళ్లుగా ఇస్తోన్న మార్కెట్‌యార్డును కాదని ఈసారి నగర శివారులోని మురకంబట్టు బైపాస్ రోడ్డులో తాత్కాలిక టపాసుల దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.మార్కెట్‌యార్డులో అయితే పర్మినెంటు షెడ్లు, కరెంటు వసతి ఉండేది. వర్షం వచ్చినా వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడేవారు కాదు.ఈ ఏడాది బైపాస్ రోడ్డులో దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో వ్యాపారులే తాత్కాలిక షామియానాలు, షెడ్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ సరఫరా తీసుకున్నారు.వివిధ శాఖలకు ఇచ్చిన మామూళ్లతో కలిపి ఒక్కో షాపునకు రూ. 2లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తోడు అదంతా లోతట్టు ప్రాంతం కావడంతో వర్షపునీరంతా దుకాణాల్లోకి చేరింది. నడవటానికి కూడా వీలు లేనంతగా బురద ఏర్పడడంతో జనం అడుగుపెట్టలేకపోయారు. దానికి తోడు వర్షం కురుస్తూనే ఉండటంతో టపాసుల కొనుగోలుకు జనం పెద్దగా రాలేకపోయారు. విద్యుత్ సరఫరా కోసం ప్రతి దుకాణదారు రూ. 20వేలు చెల్లించారు. అయితే వర్షం కారణంగా సరఫరా నిలిపివేయడంతో దుకాణసముదాయమంతా చీకటిమయంగా తయారైంది.సరైన వసతి ఏర్పాట్లను కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలంకావడంతో నిండామునిగామని వ్యాపారులు చెబుతున్నారు.