Share News

టీడీపీ బ్యానర్లే టార్గెట్‌

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:44 AM

దగ్గరుండి తొలగించిన మున్సిపల్‌ అధికారులు ఎప్పటి నుంచే ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను పట్టించుకోని వైనం

టీడీపీ బ్యానర్లే టార్గెట్‌
టీడీపీ బ్యానర్లను తొలగిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది , గాంధీ సర్కిల్‌ ఎదురుగా ఉన్న వైసీపీ నాయకుల ఫ్లెక్సీలు

చిత్తూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): చిత్తూరులో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను అధికార పార్టీ పరోక్షంగా టార్గెట్‌ చేసింది. కార్పొరేషన్‌ అధికారుల ద్వారా బుధవారం వీటిని తొలగించే చర్యలు చేపట్టింది. ఇటీవల టీడీపీ నాయకులు చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచీ విశేష స్పందన లభించింది. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ నేత అసహనం వ్యక్తంచేసి.. టీడీపీ ఫ్లెక్సీలను తొలగించాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో మున్సిపల్‌ అధికారులు వైసీపీ ఫ్లెక్సీల జోలికి వెళ్లకుండా టీడీపీ నేతలవి తొలగించారు. కొన్నింటిని వెనక్కి తిప్పి పెట్టారు. కానీ, గాంధీ సర్కిల్‌, కొంగారెడ్డిపల్లె, ఆసుపత్రి వంటి ప్రాంతాల్లో నెలల తరబడి పెద్దఎత్తున ఉన్న వైసీపీ నాయకుల ఫ్లెక్సీల జోలికి వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు మున్సిపాలిటీలో ముందుగా చలానా కట్టి అనుమతి తీసుకోవాలి. జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గీర్వాణీ చంద్రప్రకాష్‌ వేడుకలు నిర్వహించినప్పుడు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సీఆర్‌ రాజన్‌ పుట్టినరోజు కార్యక్రమాలకూ చలానా కట్టారు. ఇటీవల గురజాల జగన్మోహన్‌ కూడా చలానా కట్టి పెద్దఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేశారు. 50 వేల కుటుంబాలకు చేపట్టిన సంక్రాంతి కానుకల పంపిణీకి విశేష స్పందన వచ్చింది. ఇది ఓ వైసీపీ నేతకు ఇబ్బంది కలిగినట్లు తెలుస్తోంది. ఆయన ఆదేశాలతో గురజాల జగన్‌తో పాటు చంద్రప్రకాష్‌, సీఆర్‌ రాజన్‌కు చెందిన ఫ్లెక్సీలను తొలగించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, చలానా కట్టిన గడువు పూర్తి కావడంతో బ్యానర్లను తొలగిస్తున్నామని కమిషనరు అరుణ చెప్పారు. అయితే, మరోసారి తాము రెన్యువల్‌ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని గురజాల జగన్మోహన్‌ అంటున్నారు.

ఎన్టీఆర్‌ వర్ధంతికీ తొలుత అనుమతి నిరాకరణ

వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు నగరంలో ట్రాఫిక్‌ను మళ్లించి ఎంఎ్‌సఆర్‌ సర్కిల్‌ను బ్లాక్‌ చేసిన పోలీసులు.. అంతకుముందు జరిగిన లోకేశ్‌ యువగళం పాదయాత్రకు ఆంక్షల పేరుతో అడ్డంకులు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చిత్తూరులో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాల నిర్వహణకు తొలుత పోలీసులు అనుమతివ్వలేదు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా నిర్వహించుకుంటామని, అనుమతి ఇవ్వాల్సిందేనంటూ టీడీపీ నేతలు భీష్మించడంతో ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపం, పీసీఆర్‌ కాలేజ్‌ వద్ద అన్నదానానికి టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:44 AM