Share News

వాడవాడలా టీడీపీ సభ్యత్వ నమోదు

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:23 AM

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు ముందస్తు ప్రణాళికలతో రంగంలోకి దిగారు. ఎంపీ, ఎమ్మెల్యేలు తొలి రోజే సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, నాయకులు సభ్వత్యాన్ని నమోదు చేయించడం అటుంచితే.. చాలామంది కార్యకర్తలు వారి సెల్‌ఫోన్ల నుంచి స్వచ్ఛందంగా నమోదు చేసుకుని పార్టీ గ్రూపుల్లో పోస్టు చేసుకున్నారు.

వాడవాడలా టీడీపీ సభ్యత్వ నమోదు
టీడీపీ సభ్యత్వ కార్డును చంద్రప్రకాష్‌ మెడలో వేస్తున్న ఎమ్మెల్యే జగన్మోహన్‌

చిత్తూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు ముందస్తు ప్రణాళికలతో రంగంలోకి దిగారు. ఎంపీ, ఎమ్మెల్యేలు తొలి రోజే సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, నాయకులు సభ్వత్యాన్ని నమోదు చేయించడం అటుంచితే.. చాలామంది కార్యకర్తలు వారి సెల్‌ఫోన్ల నుంచి స్వచ్ఛందంగా నమోదు చేసుకుని పార్టీ గ్రూపుల్లో పోస్టు చేసుకున్నారు. వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నారు.గుడిపాలలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, పార్టీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ తదితర నాయకులు ప్రారంభించారు.అంతకుముందు చిత్తూరు నగరంలోని మురకంబట్టులో, చిత్తూరు రూరల్‌ మండలంలోని బీఎన్‌ఆర్‌పేటలో ఎమ్మెల్యే జగన్మోహన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. గంగవరం మండలం మామడుగు గ్రామంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుప్పం మున్సిపాలిటీలోని కమతమూరులో ఎమ్మెల్సీ శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్‌ తదితరుల ఆధ్వర్యంలో సభ్యత్వాన్ని నమోదు చేశారు. ఎస్‌ఆర్‌పురం, జీడీనెల్లూరు, కార్వేటినగరం మండలాల్లో ఎమ్మెల్యే థామస్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. పూతలపట్టు మండలం వెంకటాపురం దళితవాడలో ఎమ్మెల్యే మురళీమోహన్‌ సభ్యత్వాన్ని నమోదు చేయించారు.పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి రొంపిచెర్ల మండలంలో సభ్యత్వాన్ని నమోదు చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్న వైసీపీ నేతలపై తిరగబడిన అంజిరెడ్డి తాత.. సీఎం చంద్రబాబుతో జూమ్‌ కాల్‌లో మాట్లాడారు.

జీవితకాల సభ్యత్వం

టీడీపీ అధిష్ఠానం కొత్తగా ప్రవేశపెట్టిన జీవితకాల సభ్యత్వాన్ని కొందరు నాయకులు నమోదు చేసుకున్నారు. ఎస్‌ఆర్‌పురం మండలంలో 30మంది టీడీపీ నాయకులు ఎమ్మెల్యే థామస్‌ ఆధ్వర్యంలో రూ.లక్ష చొప్పున చెల్లించి లైఫ్‌టైమ్‌ మెంబర్‌షిప్‌ పొందారు. అలాగే బంగారుపాళ్యం మండల టీడీపీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నాయుడు కూడా లైఫ్‌టైమ్‌ కార్డును తీసుకున్నారు.

నగరి, సత్యవేడుల్లో ప్రారంభించిన స్థానిక నేతలు

నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ మంత్రి నారా లోకేశ్‌తో కలసి విదేశీ పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మండల స్థాయి నేతలు సభ్యత్వ నమోదును ప్రారంభించారు. పుత్తూరు పట్టణంలో పార్టీ సీనియర్‌ నేతలు మునిరత్నం నాయుడు, గంజి మాధవయ్య సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇక సత్యవేడు విషయానికొస్తే పార్టీ అధిష్ఠానం సస్పెండ్‌ చేసిన నేపధ్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కార్యక్రమంలో పాల్గొనలేదు. నియోజకవర్గ సమన్వయకర్త శ్రీపతిబాబు సత్యవేడులో మెంబర్‌షిప్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రారంభించారు. అలాగే సత్యవేడు మండలం వీఆర్‌ కండ్రిగ, మదనంబేడు గ్రామాల్లో కూడా పాల్గొన్నారు.నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండలాల్లో కూడా తొలిరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా మొదలయ్యాయి. స్థానిక నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి రోజు కొత్త సభ్యత్వాలు తక్కువగా నమోదు కాగా ఇప్పటికే సభ్యులుగా వున్న వారు తమ సభ్యత్వాలను రెన్యువల్‌ చేసుకోవడం ఎక్కువగా కనిపించింది.

Updated Date - Oct 27 , 2024 | 01:23 AM