Share News

తొలిసగం అంతులేని అరాచకం మలిసగం అభివృద్ధికి అడుగులు

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:18 AM

విలువలన్నవి మాటల్లో కట్టే కోటలేగానీ ఆచరణలో అంతా ఒకటే అని తిరుపతి వైసీపీ నాయకులు రుజువు చేశారు.

తొలిసగం అంతులేని అరాచకం  మలిసగం అభివృద్ధికి అడుగులు

తిరుపతి.. ఊపిరి పీల్చుకుంది!

తొలిసగం: విలువలన్నవి మాటల్లో కట్టే కోటలేగానీ ఆచరణలో అంతా ఒకటే అని తిరుపతి వైసీపీ నాయకులు రుజువు చేశారు. ఎన్నికలకు ముందు వీరి అసహనం హద్దుమీరింది. అభివృద్ధి పేరుతో అవినీతికి రాచబాటలు వేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల పేరుతో టీడీఆర్‌ బాండ్ల మాయాజాలం జరిగిందనే విమర్శలు భగ్గుమన్నాయి. అలాగే టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి తీసుకున్న నిర్ణయాల మీదా ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తిరుపతికి భారీగా స్వామి నిధులను కేటాయించిన తీరు, అవసరం లేకపోయినా స్విమ్స్‌ భవనాలు, సత్రాల నిర్మాణం వంటి వాటి వెనుక భారీ కమీషన్ల కతలున్నాయనే ప్రచారం జరిగింది. తిరుపతి ప్రజల ఆరాధ్య దైవం గంగమ్మకూ అపచారం జరిగిందనే అంశం వైరల్‌ అయ్యింది. 2024 ప్రథమార్థంలో భూమన కుటుంబం తిరుపతి రాజకీయాలను శాసించింది. ఎదురుచెప్పే ధైర్యం ప్రత్యర్ధులకే కాదు సొంతపార్టీ నేతలకూ కూడా లేని వాతావరణం నెలకొంది. దాని ఫలితం ఎన్నికల్లో చాచి కొట్టినట్లుగా వెల్లడైంది. రాజకీయ సన్యాసం అని ప్రకటించిన భూమనకూ, ఉజ్వల భవిష్యత్తు ఆశలతో తిరుపతి శాసనసభకు పోటీ చేసిన ఆయన తనయుడు భూమన అభినయరెడ్డికీ తీవ్ర అసంతృప్తినే 2024 మిగిల్చింది.

మలిసగం: తిరుపతి తెరమీదకు అనూహ్యంగా వచ్చిన ఆరణి శ్రీనివాసలు ఎన్నికల సమయంలో సొంతగూటి నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నా.. నెమ్మదితనంతో నిలదొక్కుకున్నారు. కూటమి నేతలందరినీ ఒక తాటిమీదకు తీసుకురాగలిగారు. జనసేన ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని సాధించిన ఆయన వ్యవహార శైలి.. మునుపటి అధికార నాయకుల శైలికి పూర్తిగా భిన్నమైనది. దురుసుతనం, అహంకారపూరిత ధోరణి లేవు. దీంతో కబ్జాలు, వసూళ్లతో ఎడాపెడా చెలరేగిపోయిన చోటామోటా నాయకులను చవిచూసిన తిరుపతి నగర ప్రజలకు ఊపిరి పీల్చుకునే విరామం అయితే 2024 మలిసగం ఇచ్చింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో వుంటున్నారు. అయితే నియోజకవర్గంపై ఇంకా పట్టు సాధించలేదు. అధికారులూ ఎమ్మెల్యే మాట వినడం లేదని అనుచరవర్గం అసంతృప్తిగా వుంది. కుటుంబ సభ్యుల జోక్యంపైనా విమర్శలున్నాయి. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొందరు అనుచరులు తిరుమలలో అక్రమ తట్టలు మొదలుకుని తిరుపతిలో వసూళ్ల వరకూ దందాలు నెమ్మదిగా మొదలు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.

శ్రీకాళహస్తిలో కబ్జాల కలకలం తగ్గింది

తొలిసగం: శ్రీకాళహస్తిలో బియ్యపు ఽమధుసూదన్‌రెడ్డి మాటే శాసనంగా ఐదేళ్లూ నడిచింది. ఎన్నికలకు ముందు కాలంలోనూ ఇదే కొనసాగింది. జనంతో నిత్యం మెలిగే నాయకుడనే పేరున్నా.. భూదందాల ఆరోపణలు హోరెత్తిపోయాయి. పోలీసులూ, అధికార యంత్రాంగం ఆయన మాట జవదాటలేదనే విమర్శలను మూటగట్టుకున్నాయి. ముక్కంటి ఆలయ వ్యవహారాల్లో ఆయన మితిమీరిన జోక్యం.. తీవ్ర చెడ్డపేరును మిగిల్చింది. అనుచరుల పగ్గాలు వదిలేసి అవినీతితో ఆలయాన్ని భ్రష్టుపట్టించారనే ఆరోపణలు వచ్చాయి. ఓటమి తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోయిన మధుసూదనరెడ్డి ఇటీవల అధికారులపై విరుచుకుపడి మళ్లీ వార్తల్లోకి వచ్చారు.

మలిసగం: బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడిగా సుధీర్‌రెడ్డికి శ్రీకాళహస్తి జైకొట్టింది. ఆయన కూడా గెలిచాక ప్రజలకు, కేడర్‌కు అందుబాటులో వుంటున్నారు. అయితే కార్యకర్తలైనా, ప్రజలైనా చనువుగా ఆయన దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటూ కొందరు అక్రమ దందాలకు దిగుతున్నారు. వారిని కట్టడి చేయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. సొంత పార్టీలోనూ, కూటమిలోనూ ఉన్న సీనియర్‌ నాయకులతో కలివిడిగా ఉండడం లేదనే విమర్శలున్నాయి. శ్రీకాళహస్తి ఆలయ వ్యవహారాల్లోనూ అనుచరవర్గం జోక్యం నెమ్మదిగా పెరగడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

చంద్రగిరిలో ఫలించని సంక్షేమం

తొలిసగం: 2024- చంద్రగిరి రాజకీయాల్లో పెనుమార్పులకు సాక్ష్యంగా నిలచింది. ఐదేళ్లపాటూ పెట్టిన శ్రద్ధా.. పెట్టుకున్న ఆశలూ కల్లలయ్యాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పార్టీ కే పరిమితం అవుతానంటూ కుమారుడు మోహిత్‌రెడ్డిని తెరమీదకు తీసుకువచ్చారు. అయితే అనూహ్యంగా ఆయనే ఓంగోలు ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాల్సివచ్చింది. దీంతో పటిష్టమైన కోటగా చెవిరెడ్డి భావించిన చంద్రగిరి రాజకీయాలు మారిపోయాయి. టీటీడీ అభ్యర్ధిగా పులివర్తి నాని దూకుడు పెంచారు. ఆయన భార్య సుధారెడ్డి స్థైర్యం, రాజకీయ వ్యూహం వైసీపీని కలవరపెట్టాయి. జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు ఈ నియోజకవర్గంలోనే చోటు చేసుకున్నాయి. పోలింగ్‌ తర్వాత నాని మీద జరిగిన దాడి రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. మొత్తంమీద వ్యక్తిగత తాయిలాలతో మాత్రమే విజయం సాధ్యం కాదని చంద్రగిరి నిరూపించింది. అటు ఒంగోలులోనూ చెవిరెడ్డి ఓటమి పాలయ్యారు. తన మకాం ఏకంగా బెంగళూరుకే మార్చేశారు.

మలిసగం: చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాని ఎన్నికల ముందటి దూకుడు తగ్గించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులమీద దృష్టి పెంచారు. అయితే రాజకీయంగా మాత్రం ప్రత్యర్ధిపై తీవ్రతను ఆయన తగ్గించలేదు. జనానికి, శ్రేణులకు అందుబాటులోనే ఉంటున్నారు. ఇదే సమయంలో ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా ఆయన కుటుంబీకులు తమకు తాముగా పరిమితులు విధించుకకోవడం విశేషం.

వైసీపీ ఉనికి చాటిన గురుమూర్తి

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ తరపున పోటీ చేసిన వారిలో గెలిచిన ఏకైక అభ్యర్థి గురుమూర్తి మాత్రమే. తిరుపతి సిట్టింగ్‌ ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసి రెండవసారి గెలిచారు. జిల్లా పరిధిలో చిత్తూరు ఎంపీ అభ్యర్థి, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్ళూరుపేట, గూడూరు, నగరి, వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. గురుమూర్తి ఒక్కరే వైసీపీ ఉనికి కాపాడారు. నెమ్మదస్తుడిగా పేరున్న ఆయన జిల్లా అభివృద్ధి పనుల కోసం ఢిల్లీలో తరచూ అఽధికారులను కలుస్తుంటారు.

మంత్రి లేని జిల్లా

ఈ ఏడాది మొదటి భాగంలో మంత్రిగా జిల్లాకు నగరి ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికల తర్వాత గత ఆరు నెలలుగా జిల్లాకు మంత్రి లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మొన్నటి దాకా ముగ్గురు మంత్రులున్న ఉమ్మడి జిల్లాకు కూటమి ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు. జిల్లా అభివృద్ధిపై సమీక్షించే నేత గానీ, ఎమ్మెల్యేల ప్రతిపాదనలను జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి తీసుకెళ్ళే నేత గానీ లేకపోవడం వెలితిగా మారింది.

పదవులు దక్కింది కొందరికే!

కూటమి ప్రభుత్వంలో జిల్లా నుంచీ కొందరికి నామినేటెడ్‌ పదవులు దక్కాయి. తిరుపతి నుంచీ నలుగురికి పదవులు లభించాయి. శాప్‌ చైర్మన్‌గా అనిమిని రవినాయుడు ఛాన్సు కొట్టేశారు. నరసింహ యాదవ్‌ తుడా ఛైర్మన్‌ లేదా టీటీడీ బోర్డు ఛైర్మన్‌ పదవులు ఆశించగా ఆయనకు యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ దక్కింది. రుద్రకోటి సదాశివం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి పొందారు. ఈ ముగ్గురూ టీడీపీ వారు కాగా బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి టీటీడీ సభ్యుడిగా నియమితులయ్యారు. మరికొందరికి పదవులు వచ్చినా అవన్నీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వంటివి. ముఖ్యమైన పదవులు ఆశించిన వారికి ఈ ఆరు నెలల్లో అవకాశం దక్కలేదు.

=================================

Updated Date - Dec 27 , 2024 | 03:18 AM