తిరుమలలో భద్రతా లోపాలు ఉండకూడదు
ABN , Publish Date - Aug 11 , 2024 | 01:53 AM
తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా భద్రతా లోపాలు ఉండకూడదని టీటీడీ సీవీఎస్వో శ్రీధర్ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
- అధికారులతో టీటీడీ సీవీఎస్వో
తిరుమల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా భద్రతా లోపాలు ఉండకూడదని టీటీడీ సీవీఎస్వో శ్రీధర్ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. సీవీఎస్వోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇప్పటికే టీటీడీలో భద్రత అంశాలపై పలు సమావేశాలు నిర్వహించారు. పలు ప్రాంతాలనూ క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో వాహనసేవలు వీక్షించేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మాడవీధులు, ఎలిఫెంట్ గేట్ వద్ద క్యూలైన్లను, ఆలయంలోని ప్రసాదాల పోటు, ముడిసరుకులు నిల్వ ఉంచే ఉగ్రాణాన్ని పరిశీలించారు. ఆలయం పైభాగంలో ఉండే ఏఆర్ సెక్యూరిటీ సిబ్బంది పాయింట్లు, గొల్లమండపంపై ఉన్న సెక్యూరిటీ పాయింట్లను పరిశీలించారు. గతంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ, భద్రత ఏర్పాటు, బందోబస్తు వంటి అంశాలపై అవగాహన చేసుకోవడంతోపాటు కొన్ని సూచనలు చేశారు. వీఎస్వో సురేంద్ర, ఏవీఎస్వో గిరిధర్, వీఐలు తదితరులు ఉన్నారు.