నన్ను చంపి ఎడారిలో పడేస్తామంటున్నారు
ABN , Publish Date - Dec 23 , 2024 | 01:15 AM
బిడ్డలను చదివించుకోవాలని కష్టపడి కువైట్‌కు వెళ్లిన మహిళకు కష్టాలు మిగిలాయి. గొడ్డు చాకిరీ చేసినా కనికరంలేదు. కడుపునిండా తిండిలేదు. కంటినిండా కునుకు లేదు. ఒక్క పూట భోజనం, గ్లాసు మంచినీళ్లతో మూత్రంలో రక్తస్రావమవుతూ నరకం అనుభవిస్తోంది శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళ.
మూత్రంలో రక్తం వస్తోంది
ప్రతిక్షణ నరకం అనుభవిస్తున్నా
కువైట్‌లో శ్రీకాళహస్తి మహిళ ఆవేదన
బిడ్డలను చదివించుకోవాలని కష్టపడి కువైట్‌కు వెళ్లిన మహిళకు కష్టాలు మిగిలాయి. గొడ్డు చాకిరీ చేసినా కనికరంలేదు. కడుపునిండా తిండిలేదు. కంటినిండా కునుకు లేదు. ఒక్క పూట భోజనం, గ్లాసు మంచినీళ్లతో మూత్రంలో రక్తస్రావమవుతూ నరకం అనుభవిస్తోంది శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళ.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రాజీవ్ నగర్‌కు చెందిన ఎల్లంపల్లి లక్ష్మి ఆర్థిక ఇబ్బందులతో బిడ్డల చదువుకోసమని కువైట్‌కు వెళ్లారు. అక్కడ ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను సెల్ఫీ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా పేరు లక్ష్మి. కువైట్‌లో ఇరుక్కుపోయాను. రూ2.5లక్షలు కడితేనే ఇండియాకు పంపుతామంటున్నారు. ఘోరంగా కొడుతున్నారు. ఏజెంట్ దగ్గరకు వెళ్లి చెబితే ఇక్కడే నిన్ను చంపి ఎడారిలో వేసేస్తాం అని బెదిరిస్తున్నారు. నా ఆరోగ్యం సహకరించడంలేదు. మూత్రానికి బదులు రక్తం వస్తోంది. ఇంటికి ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వడంలేదు. బయటకు రాకుండా బీగాలు వేసేశారు. నన్ను ఎలాగైనా ఇండియాకు పంపండి’ అని సెల్ఫీ వీడియో ద్వారా లక్ష్మి వేడుకున్నారు.
మా అమ్మను రప్పించండి సారూ..
కువైట్‌లో నరకయాతన అనుభవిస్తున్న తమ అమ్మను తీసుకురావాలని సుచిత్ర కన్నీటి పర్యంతమవుతోంది. తన తల్లి పడుతున్న కష్టాలు చూసి తల్లడిల్లుతోంది. ఎలాగైనా ఆమెను తమ వద్దకు చేర్చాలని అధికారులను వేడుకుంటోంది. ‘మా చదవుల కోసమని పీలేరులోని శ్రీనివాసులు అనే ఏజెంట్ సహకారంతో కువైట్‌కు వెళ్లింది. అతడు కుమారి అనే కువైట్ ఏజెంట్‌కు మా అమ్మను అప్పజెప్పారు. ఆమె రెండిళ్లలో పనికి కుదర్చింది. ఎంత పనిచేస్తున్నా చేయడంలేదని హింసిస్తున్నారు. అక్కడ ఉండలేమని ఇండియాకు వెళ్లిపోతామని మా అమ్మ ఏజెంట్ దగ్గరకు వెళ్లారు. ఏజెంట్ లేని సమయంలో నాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు’ అంటూ సుచిత్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం
శ్రీకాళహస్తికి చెందిన లక్ష్మిని ఇండియాకు పంపే ప్రయత్నం చేస్తున్నాం. ఆమె కువైట్‌లో ఇబ్బందులు పడుతున్నట్టు మాదృష్టికి వచ్చింది. ఏజెంట్లతో మాట్లాడుతున్నాం. రూ2.5లక్షలు అడుగుతున్నారు. తెలుగు ఎన్‌ఆర్‌ఐల సహకారం తీసుకుంటున్నాం.
- డాక్టర్ ముక్కు తులసీకుమార్, ఏపీఎన్‌ఆర్టీ యూఏఈ మాజీ ఇంచార్జి