Share News

వాళ్లూ.. వీళ్లూ కలిసి ఇసుక దోచేస్తున్నారు

ABN , Publish Date - Oct 28 , 2024 | 01:25 AM

కీలకంగా ఓ టీడీపీ నేత రాత్రికి రాత్రే బెంగళూరుకు అక్రమ రవాణా

వాళ్లూ.. వీళ్లూ కలిసి ఇసుక దోచేస్తున్నారు
కోట్రమంగళం స్వర్ణముఖి నదిలో ఇసుకను తరలింపు

రేణిగుంట, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): లారీ ఇసుక రూ.1.3 లక్షలు. ఒక రాత్రికి 11 లారీలు వెళతాయి. తద్వారా రూ.14.3 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంత భారీగా జరిగే ఇసుక అక్రమ రవాణాలో తెరముందు కనిపించేది వైసీపీ నేతలు. తెరవెనక సూత్రధారి ఓ టీడీపీ నాయకుడు.. ఆయనకు సహకరించే మరికొందరు.

రేణిగుంట మండలం కోట్రమంగళం పంచాయతీ నుంచి జీపాళెం పంచాయతీ వరకు సుమారు 11 కిలోమీటర్లు స్వర్ణముఖి నది ఉంది. వైసీపీ హయాంలో ఇక్కడ్నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగింది. కూటమి అధికారంలోకి రాగానే మండలంలోని ఓ టీడీపీ నేత కన్ను ఇసుకపై పడింది. ఇసుక అక్రమ రవాణాలో అనుభవమున్న వైసీపీ నేతలతో ఆయన జట్టుకట్టారు. స్వర్ణముఖి నదిలో, ఇనాం భూముల్లో ఇసుకను లోడి తండ్లం, కోట్రమంగళం, ఇతర గ్రామాల సమీపంలో ఉంచి.. ఒకేసారి 11 లారీల్లో పైన పట్ట కప్పి బెంగళూరుకు తరలిస్తున్నారు. మరోవైపు వైసీపీకి చెందిన ఓ నాయకుడు టీడీపీలో చేరానని చెబుతూ ఎవరికి ఇవ్వాల్సిన వాటాలు అందిస్తూ ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. ఎక్కడైనా ఇసుక లారీలను పట్టుకుంటే టీడీపీ నేత రంగంలోకి దిగి తమ వాళ్లదేనని, వదిలేయాలంటూ ఒత్తిడి తెస్తాడు. దీనికోసం పంచాయతీల స్థాయిలోనూ కొందరు నేతలను జట్టుగా పెట్టుకుని.. వారి చేతా ఒత్తిడి తెచ్చి విడిపించే పనులు చేపడతారు. ప్రైవేటు, ఇనాం భూముల్లోనూ ఇసుక కోసం 20 నుంచి 25 అడుగుల లోతుకు తవ్వేస్తున్నారు. ఇలా వాల్టా చట్టానికి తూట్లు పొడవడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్రాక్టర్ల నుంచీ దందా

ఇళ్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టింది. ట్రాక్టరు, ఎడ్లబండిలో తరలించే ఇసుకను అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు నమోదు చేస్తామని ప్రకటించింది. దీనిని దుర్వినియోగం చేస్తూ ఇసుక మాఫియా ఒక్కో ఇసుక ట్రాక్టర్‌ నుంచీ నగదు వసూలు చేస్తుంది. దీనికోసం స్వర్ణముఖి నదీ తీరప్రాంతంలో డేరాలు వేసుకుని ఉంటున్నారు. మరోవైపు ఎవరైనా ఇళ్లు కట్టుకునే వారు ఇసుక ఎక్కడ తీసుకోవాలో తెలియక విక్రయదారులను సంప్రదిస్తే, డీజిల్‌, కూలీ, ట్రాక్టర్‌, నాయకులకు మామూళ్లు.. అన్నీ ఇస్తేనే పంపుతామంటున్నారు. ఇసుక డిమాండ్‌ను సృష్టించి రోజుకో రేటు చెబుతున్నారు. వీటన్నింటిపై తహసీల్దారు శ్యామ్‌ప్రసాద్‌ను వివరణ కోరగా.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ విధి విధానాలు పూర్తిస్థాయిలో తమకు అందలేదన్నారు. కొద్దిరోజుల క్రితం ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకోగా.. తాము ఇళ్లు నిర్మిస్తున్నామని చెబుతున్నారన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 01:25 AM