sricity progress ప్రగతి అంటే ఇదీ!
ABN , Publish Date - Dec 19 , 2024 | 01:41 AM
తొలి వాహనం తయారీకి ఇసుజు పూనుకున్నపుడు సీఎంగా ఉన్న చంద్రబాబే.. లక్షవ వాహనం ఉత్పత్తి సమయంలోనూ తిరిగి అదే స్థానంలో ఉండడం విశేషం. వస్తు రవాణాకు విశేషంగా ఉపయోగపడే వాహనాలను శ్రీసిటీలో 107 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. 1600 మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. డి-మాక్స్, ఎంయు-ఎక్స్ ఎస్‌యూవీలను ఇసుజు మోటర్స్ ఇండియా పరిశ్రమ ఉత్పత్తి చేస్తోంది. పలు దేశాలకు వీటిని ఎగుమతి చేస్తోంది.
27 ఏప్రిల్ 2016
శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు కర్మాగారాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రారంభించారు. వాహనాల ఉత్పత్తి మొదలైంది.
18 డిసెంబరు 2024
శ్రీసిటీలో ఉత్పత్తి చేసిన ఇసుజు లక్షవ వాహనాన్ని సగర్వంగా సంస్థ విడుదల చేసింది.
వరదయ్యపాళెం, ఆంధ్రజ్యోతి
తొలి వాహనం తయారీకి ఇసుజు పూనుకున్నపుడు సీఎంగా ఉన్న చంద్రబాబే.. లక్షవ వాహనం ఉత్పత్తి సమయంలోనూ తిరిగి అదే స్థానంలో ఉండడం విశేషం. వస్తు రవాణాకు విశేషంగా ఉపయోగపడే వాహనాలను శ్రీసిటీలో 107 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. 1600 మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. డి-మాక్స్, ఎంయు-ఎక్స్ ఎస్‌యూవీలను ఇసుజు మోటర్స్ ఇండియా పరిశ్రమ ఉత్పత్తి చేస్తోంది. పలు దేశాలకు వీటిని ఎగుమతి చేస్తోంది. ఇప్పటికే లక్ష వాహనాలు ఈ పరిశ్రమలో తయారయ్యాయి. బుధవారం లక్షవ వాహనాన్ని ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ జపనీస్ కంపెనీ గ్రూప్ చైర్మన్ సాడో గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పరిశ్రమల శాఖ మంత్రి టీడీ భరత్ అభినందన సందేశాలను యువరాజ్ వినిపించారు. ఇసుజు ఇంజనీరింగ్ బిజినెస్ సెంటర్ ఇండియా చైర్మన్ సుకామోటోఐఎంఐ వృద్ధి ప్రయాణాన్ని వివరించారు. ఇసుజు మోటర్స్ ప్రెసిడెంట్ సీవోవో షిన్‌సుకే మినామి, మిత్సుబిషి కార్పొరేషన్ మొబిలిటీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ సీఈవో షిగేరు వాకబయాషీ వర్చువల్ విధానంలో ఇసుజు టీంను అభినందించారు.
ఇసుజు సంస్థ నాణ్యత, నిబద్ధతకు ఇది నిదర్శనం. నైపుణ్యం కలిగిన మానవ శక్తి, అధునాతన సాంకేతికత, అత్యుత్తమ పనివిధానాల ద్వారా దీనిని సాధించాం. సంస్థలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డిప్లొమా హోల్డర్ల ప్రతిభ గొప్పది. శ్రీసిటీ సహకారం ఎనలేనిది.
-ఐఎంఐ అధ్యక్షుడు, ఎండీ రాజేష్ మిట్టల్
దేశీయ తయారీ నైపుణ్యం, ప్రపంచ పోటీ తత్వానికి సాక్ష్యం ఇది. ప్రపంచస్థాయి పరిశ్రమలను ఆకర్షిస్తూ నూతన ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పన, వృద్ధి సాధన దిశగా మంచి పర్యావరణ వ్యవస్థను నిర్మించడంతో ఆంధ్రపదేశ్ అంకితభావంతో ఉంది. స్థానిక ప్రతిభను ఇసుజు ప్రోత్సహించడం గ్రేట్. వెనుకబడిన ప్రాంతంలో పారిశ్రామిక నగరాన్ని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి అభినందనలు.
- రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్
ప్రపంచస్థాయి పారిశ్రామిక హబ్‌గా శ్రీసిటీ పాత్ర గర్వకారణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్న మొదటి ఆటోమొబైల్ తయారీదారు ఇసుజు. ఇసుజు విజయం శ్రీసిటీలోని పెట్టుబడుల స్నేహపూర్వక పర్యావరణ వ్యవస్థకు అద్దం పడుతూ స్ఫూర్తి ఇస్తోంది.
- శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి