Share News

ఈ పాపం నీదేనయ్యా..!

ABN , Publish Date - Sep 27 , 2024 | 01:53 AM

జగన్‌రెడ్డి పాలనలో మూడుసార్లు టీటీడీ పాలకమండళ్లను ఏర్పాటు చేశారు. జగన్‌రెడ్డికి సమీప బంధువులనే చైర్మన్‌లుగా నియమించారు. ఎన్ని విమర్శలు వచ్చినా చైర్మన్‌లూ, ఈవోలూ కూడా ఒకే సామాజికవర్గంవారినే నియమించారు.

ఈ పాపం నీదేనయ్యా..!

‘పాప ప్రక్షాళన’కు జగనొస్తున్నాడు.ఎవరు చేసిన పాపం ఇది? ఐదేళ్లు తిరుమలలో ఏం జరిగింది? ‘మనోళ్ల’ నిర్వాకం ఏమిటి?భక్తీ, భయం, పాపభీతీ ఎలా మాయమయ్యాయి?

పర్సంటేజీల రాజకీయ అవినీతి టీటీడీలో ఎలా వేళ్లూనుకుంది? సాధారణ భక్తులకు కిలోమీటర్ల క్యూలు.. వీవీఐపీలకు హారతి దర్శనాలు.. పేదలకు చలికి వణికే షెడ్లు.. పెద్దలకు స్టార్‌ హోటళ్లను తలదన్నే గెస్ట్‌హౌ్‌సలు.. ఎవరు చేసిన పాపం ఇది జగనయ్యా? బంధు, భక్త అనుచరగణం రెచ్చిపోయి తిరుమలను భ్రష్టు పట్టిస్తూంటే.. చేసిందేమిటి? మౌనం.. అరాచకానికి ఆమోదం కాలేదా? ఎలా ప్రక్షాళన అవుతుంది? ఒక్కరోజు పూజతో చేసినవన్నీ చెరిగిపోతాయా? గాయపడ్డ భక్త హృదయాలను అబద్ధాలతో మాయచేయగలరా? ఐదేళ్లు.. మీ పాలనలో తిరుమల కేంద్రంగా జరిగిన తంతును భక్తకోటి తలచుకుని తల్లడిల్లుతోంది. మా విశ్వాసాలను మీ రాజకీయాలకు బలి చేయవద్దని చేతులు జోడించి వేడుకుంటోంది.

అంతా మనోళ్లే..

జగన్‌రెడ్డి పాలనలో మూడుసార్లు టీటీడీ పాలకమండళ్లను ఏర్పాటు చేశారు. జగన్‌రెడ్డికి సమీప బంధువులనే చైర్మన్‌లుగా నియమించారు. ఎన్ని విమర్శలు వచ్చినా చైర్మన్‌లూ, ఈవోలూ కూడా ఒకే సామాజికవర్గంవారినే నియమించారు. 2019లో ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, ఈవోగా జవహర్‌రెడ్డి వున్నారు. ఆ బోర్డులోని మొత్తం 37మందిలో ఈవోను మినహాయిస్తే ఛైర్మన్‌, ఒక ఎక్స్‌ అఫిషియో మెంబరు, నలుగురు మెంబర్లు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు కలసి ఎనిమిదిమంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. 2021లో రెండవ పాలకమండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగారు. ఈవోగా జవహర్‌రెడ్డి వున్నారు. ఈ బోర్డులోనూ ఏడుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారున్నారు. 2023లో ఏర్పడిన పాలకమండలిలో ఛైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి, ఈవోగా ధర్మారెడ్డి వున్నారు. ఇందులోనూ ఏడుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారున్నారు. ఐఏఎస్‌ కాకపోయినా ధర్మారెడ్డి కోసం వైసీపీ ప్రభుత్వం ఏకంగా అదనపు ఈవో పోస్టునే సృష్టించింది. జవహర్‌రెడ్డి బదిలీ తర్వాత రెగ్యులర్‌ ఈవోను నియమించకుండా ధర్మారెడ్డినే ఇంఛార్జి ఈవోగా కొనసాగించింది. అర్హతలు లేకున్నా సందీ్‌పరెడ్డి అనే వ్యక్తికి టీటీడీ ఐటీ విభాగంలో తొలుత సైబర్‌ ఎక్స్‌పర్ట్‌గా, తర్వాత ఏకంగా ఆ విభాగం జీఎంగా నియమించింది. అదే సామాజికవర్గానికి చెందిన ఒక పోలీసు అధికారి సీఎంకు సన్నిహితుడనే పేరుతో తిరుమలలో జగన్‌ జమానాలో చక్రం తిప్పారు. జగన్‌ సమర్పించిన జంబో బోర్డు

గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో టీటీడీని ఆ పార్టీ నేతలు తమ సొంత సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేశారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనిఽవిధంగా 29 మందితో ఏర్పాటు కావాల్సిన పాలకమండలిని జంబో బోర్డుగా మార్చివేశారు. 2021 సెప్టెంబరులో 29మందిని సభ్యులుగా మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించి టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చే ప్రయత్నం చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేకాహ్వానితుల నియామకానికి బ్రేక్‌ పడింది.

అవినీతి మచ్చలున్న వారు పాలక మండలిలో తీవ్ర అవినీతి ఆరోపణలున్న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త కేతన్‌ దేశాయ్‌ని టీటీడీ పాలకమండలి సభ్యుడిగా జగన్‌ నియమించారు. ఈయనను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ పదవి నుంచే తొలగించారు. ఇటువంటి వ్యక్తిని బోర్డులోకి తీసుకున్నారు. మరొక బోర్డు సభ్యుడు శరత్‌చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో నిందితుడు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మీద క్రిమినల్‌ కేసులు వున్నాయి.


దర్జాగా దర్శనాల వ్యాపారం

దేవుడి దర్శనాన్నే వ్యాపారంగా మార్చేశారు. సాధారణ భక్తులను పదుల గంటల పాటు క్యూలైన్లలో పడిగాపులు గాసేలా చేసి, వీవీఐపీల సేవలో తరించారు. బోర్డు సభ్యులు, ఎమ్మెల్యేలు సైతం తిరుమల కొండమీద సొంత పీఆర్వోలను నియమించుకుని దర్శనాల టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు ఐదేళ్లూ వెల్లువెత్తినా జగన్‌ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయారు. చైర్మన్‌ కోటాలో రోజుకు పది పన్నెండు మందికి మాత్రమే బ్రేక్‌ దర్శనాలకు సిఫారసు చేసే సంప్రదాయాన్ని వైసీపీ పాలనలో గాలికి వదిలేశారు. వైవీ సుబ్బారెడ్డి రోజుకు సగటున 364 మందికి వీఐపీ బ్రేక్‌ టికెట్లను ఇష్టానుసారం ఇచ్చేసేవారు. ఈయన చైర్మన్‌గా ఉన్న నాలుగేళ్లలో 3 లక్షలా 60 వేల మందికి ఇట్లా టికెట్లు కేటాయించారంటే టీటీడీని ఎంతగా సొంతానికి వాడేసుకున్నారో అర్థం అవుతుంది. ఆ తర్వాత చైర్మన్‌ అయిన భూమన కరుణాకరరెడ్డి కూడా ఇదే వారసత్వాన్ని కొనసాగించారు. ఉన్నది 9 నెలలే అయినా రోజుకు సగటున 172 మందికి వీఐపీ బ్రేక్‌ దర్శనాల సిఫారసు లేఖలు ఇచ్చేవారు. ఇక స్వామి దర్శనాలను న్యాయమూర్తులకూ, ఢిల్లీ ప్రముఖులకూ ఎరగా వేసేవారన్న విమర్శలూ జగన్‌ మీద వచ్చాయి. ధర్మారెడ్డి ఈవోగా ఈ పనిని జగన్‌ కోసం చేసేవారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా జగన్‌ మీద అనేక కేసులున్న నేపథ్యంలో న్యాయమూర్తులను ప్రసన్నం చేసుకోవడానికి దర్శనాల సమయంలో వారిని స్వామి ముందు కోరుకున్నంతసేపు ఉంచేసేవారనే ఆరోపణలున్నాయి.


శ్రీవాణిలో ఏం జరిగింది?

దర్శనాలలో దళారీలను తొలగించే లక్ష్యంతో ప్రవేశపెట్టి విజయం సాధించామంటూ అధనపు ఈవో ధర్మారెడ్డి పదేపదే ప్రకటించుకున్న శ్రీవాణిట్రస్టు మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా జగన్‌ పట్టించుకోలేదు. శ్రీవాణి పేరుతో బ్రేక్‌ దర్శనాన్ని రూ.10,500గా చేసి రోజుకు వెయ్యి టికెట్లు అమ్మేశారు. ఆ సొమ్ముల లెక్కలు తేల్చనే లేదు. ఆలయాల రిపేర్లకు, నిర్మాణాలకు వాడుతున్నామని చెప్పారు.శ్రీవాణిలో భారీ కుంభకోణం జరిగిందని భక్తులు భగ్గుమనడంతో విచిత్రంగా తిరుపతి ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఒక నిజనిర్ధారణ కమిటీ వేసి, అంతా శభాష్‌ అని ఒక సర్టిఫికెట్‌ ఇప్పించుకున్నారు.


టీటీడీలోనూ పనులకు పర్సెంటేజీలు

టీటీడీ నిర్మాణ పనులంటే ఒకప్పుడు నాణ్యతకు తిరుగులేదనే పేరుండేది. అందుకు కారణం అవినీతికి అవకాశం పరిమితం కావడమే. కొద్దిమంది అధికారులో, ఉద్యోగులో ఆశపడ్డా కానుకల స్థాయికి మించేది కాదు. జగన్‌ పాలనలో రాష్ట్రప్రభుత్వం పనుల తరహాలోనే పర్సెంటేజీల విధానం మొదలైంది. నాయకులకు వాటాలు తప్పలేదు. అవసరంతో సంబంధం లేకుండా నిర్మాణ పనులు విపరీతంగా పెంచేశారు. వందల కోట్లు కేటాయించేశారు. దీంతో టీటీడీలోనూ అవినీతి వ్యవస్థగా మారిపోయింది. ముఖ్యం గా ఎన్నికలకు ఏడాది ముందు నుంచీ ఈ పరిస్థితి విపరీతమైందనే ఆరోపణలున్నాయి. తిరుపతిని కేంద్రం చేసుకుని అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా నిధులు విడుదల చేశారు. రోడ్లు, భవనాలకు నాయకులు అడగడం, అధికారులు కేటాయించేయడం జరిగింది. తిరుపతి నాయకుల పర్సెంటేజీల కోసమే రూ. వందల కోట్లు పనులు ఆగమేఘాల మీద మొదలు పెట్టారనే విమర్శలు వచ్చాయి. బాగున్న సత్రాలు కూల్చేసి కొత్తవి నిర్మించడానికి రూ.600 కోట్లు కేటాయించేశారంటే అవినీతి విశ్వరూపం అర్థం అవుతుంది. స్విమ్స్‌లో దివ్యంగా ఉన్న భవనాలను రిపేరు చేయాలంటూ రూ.200 కోట్లు ధారాళంగా కేటాయించేశారు. తిరుపతి నాయకుల ఎన్నికల ఖర్చుల కోసమే ఆగమేఘాల మీద కాంట్రాక్టులు ఇచ్చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తినా జగన్‌ ప్రభుత్వం.. ‘ఏం జరిగింది’ అనే ఆరా కూడా తీయలేదు. అర్హత లేని అధికారిని ఇంఛార్జి సీఈగా నియమించారు.నిబంధనలకు విరుద్ధంగా సీనియర్లు వున్నప్పటికీ రెగ్యులర్‌ సీఈగా అతన్నే కొనసాగించారు. బాధిత అధికారికి న్యాయం చేయాలన్న హైకోర్టు ఆదేశాలు కూడా అమలు కాలేదు.


జిల్లా పాలనలోనూ అదేముద్ర

జిల్లా తొలి కలెక్టర్‌గా వెంకట్రమణారెడ్డి, తిరుపతి అర్బన్‌ ఎస్పీగా ఆవుల రమే్‌షరెడ్డి, జిల్లా ఎస్పీగా పరమేశ్వర రెడ్డి, తిరుపతి ఆర్డీవోలుగా కనకనరసారెడ్డి, నిశాంత్‌రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీవోగా రవిశంకర్‌రెడ్డి, ఎస్వీయూ వీసీలుగా రాజారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, బర్డ్‌ స్పెషలాఫీసర్‌గా రెడ్డెప్పరెడ్డి, స్విమ్స్‌ స్పెషలాఫీసర్‌గా జగదీశ్వర్‌రెడ్డి... ఇలా కీలక స్థానాల్లో ఒకే సామాజికవర్గానికి చెందిన వారే గత ఐదేళ్ళలో పనిచేశారు. కనకనరసారెడ్డి బదిలీ అయినా జిల్లా దాటకుండా రుయాలో ఏవోగా నియమితులయ్యారు. జిల్లాలో పలు శాఖల అధికారులుగా, పోలీసు శాఖలో కీలక స్థానాల్లోనూ అదే వర్గానికి చెందిన వారు పనిచేశారు.


అద్దెలూ మూడురెట్లు

తిరుమల కొండమీద వసతి అంటే భక్తులకు ఒకప్పుడు చవగ్గా లభించేది. తక్కువ ఖర్చుతో కుటుంబం అంతా ఒకటి రెండు రోజులు ఈ చల్లని ప్రదేశంలో దేవదేవుని సన్నిధిలో గడిపి వెళ్లేవారు. జగన్‌ పాలనలో పర్యాటక కేంద్రాలతో పోటీపడేలా ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో రేట్లు పెంచేశారు. పాలకమండలి సమావేశంలోనే (17 ఫిబ్రవరి 2022) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వేలం పాట తరహాలో గదుల అద్దె రేట్లు రెండు మూడు రెట్లు పెంచేలా నిర్ణయం తీసుకున్న వీడియో వైరల్‌ అయ్యి అందరూ ఇదేమి తీరు అని విస్తుపోయినా జగన్‌ చలించలేదు. గదుల నిర్వహణ కూడా దారుణంగా తయారైంది. పరిశుభ్రతను పట్టించుకోలేదు.

లడ్డూనే కల్తీచేసేశారు కదయ్యా

తిరుమల లడ్డూ అనగానే ఘుమఘుమ లాడేది. ఈ రుచి ఇంకెక్కడా ఎవరు చేసినా సాధ్యం అయ్యేది కాదు. ప్రపంచ పేటెంట్‌ కూడా తిరుమల లడ్డూకి లభించింది. ఇంతటి ప్రత్యేకత ఉన్న లడ్డూనే జగన్‌ జమానాలో భ్రష్టు పట్టించేశారు. ఇతర ముడి పదార్ధాల సరఫరాకు, కోరుకున్నవారికి వందల కోట్ల టెండర్లు కట్టబెట్టేశారు. తమవాళ్లకే టెండర్లు దక్కేలా చేయడం కోసం ఏకంగా టెండరు నిబంధనలనే మార్చేశారు. రివర్స్‌ టెండర్ల పేరుతో కనీస నాణ్యత లేని సరుకులతో నింపేశారు. కల్తీ నెయ్యితో లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతనే దెబ్బ తీసేశారు. జగన్‌ పాలనలో పొందిన టెండరుతో సరఫరా చేసిన నెయ్యిలో పందికొవ్వు, ఆవుకొవ్వు వంటివి ఉన్నాయని తేలడం.. టీటీడీ చరిత్రలోనే ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోయింది.ఆర్గానిక్‌ ముడి పదార్ధాల పేరుతో ఇతర అన్న ప్రసాదాలను కూడా రుచిలేకుండా చేసేశారు.


జిల్లాలోనూ పవర్‌ అంతా వాళ్లదే..

జగన్‌ పాలనలో జిల్లా అంతా ఒకే సామాజికవర్గం మయం అయిపోయింది. పదవులన్నీ వారికే. అధికారులూ వారే. జిల్లాలో ఎనిమిది సెగ్మెంట్లుంటే మూడు ఎస్సీ రిజర్వుడు మినహా మిగతా ఐదు స్థానాల్లో ఒకే సామాజికవర్గం వారు వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర రెడ్డి మూడున్నరేళ్ళు, ఆపై ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి తదుపరి ఏడాదన్నర కొనసాగారు. వీరిద్దరూ టీటీడీ ట్రస్టు బోర్డులో ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా కూడా కొనసాగారు. తిరుపతి కార్పొరేషన్‌లో రెండు మేయర్‌ పదవుల్లో ఒకటి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి కుమారుడు అభినయ్‌ దక్కించుకన్నారు. ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్‌ పదవులకు అదనంగా చెవిరెడ్డి అసెంబ్లీ విప్‌ పదవి కూడా పొందారు.

వివాదాల ఎస్వీబీసీ

టీటీడీ అనుబంధ విభాగమైన ఎస్వీబీసీలో ఇష్టానుసారంగా సలహాదారులను నియమించారు. ధర్మారెడ్డి ఆధిపత్యం ఎస్వీబీసీలోనూ కొనసాగింది. ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు సలహాదారు పదవిని సున్నితంగా తిరస్కరించారు కూడా.

Updated Date - Sep 27 , 2024 | 08:29 AM