టీటీడీ బోర్డులో ముగ్గురికి స్థానం
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:36 AM
తిరుమల-తిరుపతి దేవస్థానాలకు పాలకమండలిని రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. అందులో ఛైర్మన్ సహా ముగ్గురికి చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచీ స్థానం లభించింది. ఛైర్మన్‌గా టీవీ5 ఛానల్ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేరు ఖరారు కాగా సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, టీడీపీ నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వైద్యం శాంతారామ్ ఖరారయ్యారు.
- చిత్తూరు, తిరుపతి జిల్లాలనుంచి ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు, సభ్యులుగా పనబాక లక్ష్మి, వైద్యం శాంతారాం
- పండుగ పూట ఆశావహులకు తీవ్ర నిరాశ
తిరుపతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల-తిరుపతి దేవస్థానాలకు పాలకమండలిని రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. అందులో ఛైర్మన్ సహా ముగ్గురికి చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచీ స్థానం లభించింది. ఛైర్మన్‌గా టీవీ5 ఛానల్ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేరు ఖరారు కాగా సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, టీడీపీ నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వైద్యం శాంతారామ్ ఖరారయ్యారు.వీరిలో బొల్లినేని రాజగోపాల నాయుడు అలియాస్ బీఆర్ నాయుడు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని మారుమూల గ్రామమైన దిగువపూనేపల్లికి చెందిన వారు. చాలాకాలం క్రితమే ఆయన కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. ఇక సభ్యులుగా పదవి పొందిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి గతంలో నెల్లూరు నుంచీ మూడు సార్లు, బాపట్ల నుంచీ ఒకసారి ఎంపీగా గెలిచారు. 2004-09, 2009-14 నడుమ వైద్య, జౌళి, పెట్రోలియం శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో టీడీపీలో చేరిన ఆమె ఆ ఏడాది సాధారణ ఎన్నికల్లోనూ, 2021లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ తిరుపతి నుంచీ ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వున్నారు. ఇక వైద్యం శాంతారామ్ కుప్పం టీడీపీ ఇంఛార్జి పి.ఎ్‌స.మునిరత్నం ముఖ్య అనుచరుడు. 2003లో టీడీపీకి అనుబంధంగా నాయీ బ్రాహ్మణ సేవాసంఘాన్ని కుప్పంలో ఏర్పాటు చేశారు.టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ,నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పని చేసిన ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్రస్థాయిలో పర్యటిస్తూ నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం ఉన్నతికి కృషి చేయడమే కాకుండా, పార్టీ పటిష్ఠతకు పాటుపడ్డారు.
టీటీడీ బోర్డు పదవుల పట్ల మిశ్రమ స్పందన
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎప్పుడెప్పుడా అని ఆయాపార్టీ వర్గాలు ఎదురు చూసిన టీటీడీ పాలకమండలి ఎట్టకేలకు ఖరారైంది. అయితే పదవుల కేటాయింపు పట్ల మూడు పార్టీల శ్రేణుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయిన నేపధ్యంలో ఇప్పటికైనా పాలకమండలిని ఖరారు చేయడం మంచిదేనని మెజారిటీ శ్రేణులు భావిస్తున్నాయి.అయితే పలువురు ఆశావహులు మాత్రం నిరాశకు లోనవుతున్నారు. ముఖ్యంగా దీపావళి పండుగ పూట ప్రభుత్వం టీటీడీ పాలకమండలిని ఖరారు చేయడం పదవులు పొందిన వారికి మోదం కలిగించగా అవకాశం దక్కని వారికి ఖేదం మిగిల్చింది. తిరుపతి నుంచీ టీడీపీ పార్లమెంటు కమిటీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, చంద్రగిరి టీడీపీ నేత హేమాంబరధర నాయుడు, జనసేన నుంచీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్, బీజేపీ నుంచీ భానుప్రకా్‌షరెడ్డి తదితరుల పేర్లు టీటీడీ పాలకమండలి పదవుల కోసం ప్రముఖంగా వినిపించాయి. అయితే ఖరారైన జాబితాలో ఇందులో ఒక్క పేరు కూడా కనిపించలేదు.ఎన్టీయార్ కుటుంబాన్ని నమ్ముకోవడంతో పాటు టీడీపీలో కష్టపడి పనిచేసే నేతగా పేరున్న శ్రీధర్ వర్మ గత టీడీపీ ప్రభుత్వంలో అవకాశం తప్పిపోగా ఈ పర్యాయమైనా అవకాశం దక్కుతుందని ఆశించారు. అతనితో పాటు మిగిలిన ఆశావహులకు కూడా ప్రత్యామ్నాయంగా ఏదో ఒక పదవి దక్కే అవకాశాలు లేకపోలేదు. టీటీడీ బోర్డులోనే ప్రత్యేక ఆహ్వానితులుగా కొందరిని నియమించే అవకాశముంది. అలాగే తుడ ఛైర్మన్ టీటీడీ బోర్డులో ఎక్స్ అఫిషియో మెంబరుగా కొనసాగేందుకూ వీలుంది.అందులోనైనా ఛాన్సు దొరక్కపోతుందా అని ఆశావహులు తమను తాము ఊరడించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానితులు, తుడా ఛైర్మన్‌కు ఎక్స్ అఫిషియో సభ్యత్వం, తిరుపతి ఎమ్మెల్యేకి స్పెషల్ ఇన్వైటీ హోదా లేదా ఎక్స్ అఫిషియో సభ్యత్వం వంటి అంశాలపై నెలకొన్న అస్పష్టత ప్రభుత్వ జీవో జారీతో తొలగిపోనుంది.