20నుంచి తిరుపతి పుస్తక ప్రదర్శన
ABN , Publish Date - Jan 19 , 2024 | 02:01 AM
నగర పరిధిలోని వినాయకనగర్ క్వార్టర్స్ సమీప మైదానంలో ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో 16వ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డైరెక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు తెలిపారు.
తిరుపతి(తిలక్‌రోడ్), జనవరి 18 : నగర పరిధిలోని వినాయకనగర్ క్వార్టర్స్ సమీప మైదానంలో ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో 16వ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డైరెక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పుస్తక ప్రదర్శనలో టీటీడీ, భారతీయ విద్యాభవన్ ప్రచురణలు, అరబిందో సొసైటీ, సైన్స్ యూనివర్సిటీ, విజయవాడ ప్రింటర్స్, మలయాళ మనోరమ ఇలా 70 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ జేఈవో సదాభార్గవి, ఎస్వీయూ మాజీ వీసీ, భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ మురళి పాల్గొంటారన్నారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాలు, విద్యా, విజ్ఞానం, పోటీ పరీక్షలు వంటి పుస్తకాలను అందుబాటు ధరలకే విక్రయిస్తున్నామని, ఈ అవకాశాన్ని పుస్తక ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ దక్షిణామూర్తి, కోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.