Share News

తిరుపతి జిల్లాలో అత్యధికంగా భూ కబ్జాలు

ABN , Publish Date - Oct 30 , 2024 | 01:07 AM

ఫ్రీ హోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లూ ఇక్కడే ఎక్కువ డిప్యూటీ కలెక్టర్లతో క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తాం కన్వెన్షన్‌ సెంటర్లు, హోటళ్లు, రిసార్టులకు భూములిస్తాం పులికాట్‌ పూడికతీతపై ప్రత్యేక దృష్టి మీడియాతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌

తిరుపతి జిల్లాలో అత్యధికంగా భూ కబ్జాలు

తిరుపతి, అక్టోబరు 29 (ఆంఽధజ్యోతి): ‘గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భూకబ్జాలు విపరీతంగా జరిగాయి. ఇందులో తిరుపతి జిల్లాలో అత్యధికంగా భూములను ఆక్రమించారు. వీటిపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాం’ అని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా మంగళవారం ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో నిషేధిత జాబితా నుంచీ ఎక్కువగా భూములు తొలగించి ఫ్రీహోల్డులో ఉంచారని, వాటిలో చాలావరకూ రిజిస్ర్టేషన్లు కూడా జరిగాయని గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచీ భూములను తొలగించిన చోట్ల, రిజిస్ట్రేషన్లు జరిగిన చోట్ల క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. దీనికోసం ప్రత్యేకంగా డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారులను నియమిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఏడుగురు ఆ స్థాయి అధికారులు సర్వే చేస్తున్నారని వివరించారు. నవంబరు 15వ తేదీ నాటికి మొత్తం పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వానికి స్టేటస్‌ రిపోర్టు అందజేస్తారని మంత్రి వివరించారు. ఇక, శ్రీవారు కొలువైన తిరుపతి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా.. అభివృద్ధిలో భాగస్వామినైనందుకు గర్విస్తున్నానని మంత్రి సత్యప్రసాద్‌ అన్నారు. రోజుకు లక్ష మందికిపైగా యాత్రికులు రాకపోకలు సాగించే తిరుపతిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఆతిథ్య రంగంలో కన్వెన్షన్‌ సెంటర్లు, హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి అవసరమైన భూములు కేటాయిస్తామన్నారు. పులికాట్‌ సరస్సు ఆక్రమణలకు గురైందని, సముద్ర ముఖద్వారాలు పూడిపోవడంతో నీటి నిల్వ తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూడికతీత, ఆక్రమణల తొలగింపునకు సంబంధించి కలెక్టర్‌ ప్రతిపాదనలు రూపొందించారని, వాటిపై ప్రభుత్వం తగిన విధంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు.

జిల్లా అభివృద్ధిపై ప్రతి నెలా సమీక్ష

జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతి నెలా అధికార యంత్రాంగంతో సమీక్షిస్తామని మంత్రి సతప్రసాద్‌ వెల్లడించారు. అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ చేసిన కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తమది ప్రో యాక్టివ్‌ ప్రభుత్వమని ప్రజలకు మేలు చేసే నిర్ణయాలతో ముందుకు వెళతామన్నారు. ఇసుకపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని అభిప్రాయపడిన మంత్రి.. ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇస్తామన్నారు. సీనరేజీ విధిస్తే దానిపై జీఎస్టీ కూడా తోడై పేదలపై భారం పడుతుందన్నారు. అందుకే పేదలు, ప్రజల అవసరాలకు వీలుగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపునకు సీనరేజీని సీఎం చంద్రబాబు తొలగించారన్నారు. ఇసుక అక్రమ రవాణాను, పక్క రాష్ట్రాలకు తరలించడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. సత్యవేడు నియోజకవర్గం తమిళనాడు సరిహద్దుల్లో.. చెన్నైకి చేరువగా ఉండటం వంటి కారణాలతో ఇసుక స్మగ్లింగ్‌ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు.

గంజాయి, డ్రగ్స్‌పై ఆందోళన

గత ప్రభుత్వ తప్పిదాలు, నిర్లక్ష్యం వల్ల తిరుపతి ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్‌ వాడకం పెరుగుతోందని మంత్రి అనగాని ఆందోళన వ్యక్తంచేశారు. గత ఐదేళ్లలో వీటికి బానిసలుగా మారిన వారిని మంచి దారిలో నడిపించే ప్రయత్నం తమ కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. తిరుపతి పరిసరాల్లో జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు అధికంగా ఉండటం కూడా డ్రగ్స్‌ వినియోగం పెరగడానికి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. జిల్లా పోలీసు యంత్రాంగం ద్వారా ఆయాచోట్ల విద్యార్థులను చైతన్యపరిచేందుకు, మార్పు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హామీల అమలు గరించి వివరించారు. సమావేశంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మౌర్య, డీఆర్వో పెంచల కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 01:07 AM