Share News

మా బాధలెవరికి చెప్పుకోవాలి?

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:03 AM

ఎన్నికల్లో కష్టపడిన నేతలను ఎమ్మెల్యేనే పట్టించుకోకుంటే తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలని పలువురు టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.

మా బాధలెవరికి చెప్పుకోవాలి?
వేదికపై వున్న నేతలను నిలదీస్తున్న టీడీపీ శ్రేణులు

మమ్మల్ని పట్టించుకోకుండా వైసీపీ నేతలను ఎమ్మెల్యే ఎందుకు చేర్చుకుంటున్నారు?

టీడీపీ సమావేశంలో వాగ్వాదాలపర్వం

గంగాధరనెల్లూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో కష్టపడిన నేతలను ఎమ్మెల్యేనే పట్టించుకోకుంటే తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలని పలువురు టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.గంగాధరనెల్లూరులో టీడీపీ సభ్యత్వ నమోదుపై మండల పార్టీ అధ్యక్షుడు స్వామిదాస్‌ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది.సభ్యత్వ నమోదులో వెనుకబడ్డామని, ఇకనైనా అందరూ కలసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.టీడీపీ కార్యకర్తలు, నేతలు సహకరిస్తేనే సభ్యత్వ నమోదులో ముందుకెళ్లగలమని చిత్తూరు పార్లమెంట్‌ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రగుంట్ల కృష్ణమనాయుడు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నేతలు సభ్యత్వం కథ తరువాత.... మాకు గౌరవం ఇవ్వకపోతే మేమెందుకు పార్టీకోసం పనిచేయాలని స్టేజిమీద ఉన్న నేతలతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల ప్రచార సమయంలో నేతల గౌరవానికి లోటుండదని చెప్పిన థామస్‌ ఎమ్మెల్యేగా గెలిచాక పట్టించుకోవడం లేదని వాపోయారు.ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు టీడీపీలో చేరడానికి వస్తే ఏ గ్రామానికి చెందిన వారికి అక్కడి టీడీపీ నేతలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాకే చేర్చుకుంటామని చెప్పారని, కాబట్టే తాము అప్పుడు అభ్యంతరం చెప్పలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితో అయితే ప్రాణాలకు తెగించి పోరాడామో వారే ఇప్పుడు టీడీపీలో చేరడానికి క్యూ కడుతున్నారని , స్థానిక నేతలకు ఎటువంటి సమాచారం లేకుండా ఎమ్మెల్యే థామస్‌ చేర్చుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.ఎమ్మెల్యే థామస్‌ వారినే స్టేజిపై కూర్చొబెట్టుకుంటున్నారని వాపోయారు.టీడీపీ నేతలను గతంలో వేధించిన పోలీసులే ఇంకా చెలామణి అవుతుండడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.ఇప్పటికీ వైసీపీ నేతలకే పనులు జరుగుతున్నాయని , అధికారులు తమను మతించడం లేదని ధ్వజమెత్తారు. 2014లో టీడీపీ నేతలు చేసిన పనులకు ఇంకా బిల్లులు మంజూరు కాలేదని, ఇంజనీరింగ్‌ అధికారుల వద్ద ప్రస్తావిస్తే చేయలేమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వేదికపై వున్న నాయకులు వారు చెప్పిన విషయాలను నోట్‌ చేసి సంతకాలు చేయించుకుని వాటిని టీడీపీ కేంద్ర కార్యాలయానికి, మంత్రి నారా లోకేశ్‌కు పంపిస్తామని సర్ది చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు వెంకటే్‌ష,ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి దేవసుందరం, యాదవ సాఽధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్‌యాదవ్‌, నెల్లేపల్లె మాజీ సర్పంచ్‌ పుష్పరాజ్‌, మండల టీడీపీ ప్రధానకార్యదర్శి జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:03 AM