Share News

Panchami Tirtha- రేపు పంచమి తీర్థం

ABN , Publish Date - Dec 05 , 2024 | 01:54 AM

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు... ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చక్రస్నానం కోసం కొత్త నీటితో పుష్కరిణి సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అభిజిత్‌ లగ్నంలో పద్మ సరోవరం (పుష్కరిణి)లో చక్రస్నానం నిర్వహిస్తారు. పు

Panchami Tirtha- రేపు పంచమి తీర్థం
కొత్తనీటితో కళకళలాడుతున్న పుష్కరిణి

తిరుచానూరులో చక్రస్నానానికి సర్వంసిద్ధం

నేటి రాత్రి నుంచి గ్రామంలోకి వాహనాలకు నో ఎంట్రీ

తిరుచానూరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు... ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చక్రస్నానం కోసం కొత్త నీటితో పుష్కరిణి సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అభిజిత్‌ లగ్నంలో పద్మ సరోవరం (పుష్కరిణి)లో చక్రస్నానం నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం.. తనపతి అయిన శ్రీహరి తపస్సుకు మెచ్చి పద్మావతి అమ్మవారు పద్మసరోవరంలో బంగారు పద్మంపై కార్తీకమాసం శుక్లపక్షం పంచమి తిథి ఉత్తరాషాడ నక్షత్రం మంత్ర ముహూర్తంలో ఆవిర్భవించింది. అలాంటి పవిత్ర ఘడియలున్న పంచమితీర్థం రోజున పుష్కరణిలో స్నానమాచరిస్తే అమ్మవారు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా పంచమితీర్థానికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఒకసారి 30వేల మంది పుష్కరిణిలో స్నానాలు ఆచరించవచ్చని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. పుష్కరిణిలో తోపులాటలు జరగకుండా టీటీడీ విజిలెన్స్‌ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

హోల్డింగ్‌ పాయింట్ల నుంచే పుష్కరిణిలోకి

తిరుచానూరులో మూడు చోట్ల జర్మన్‌షెడ్లతో ఏర్పాటు చేసిన హోల్డింగ్‌ పాయింట్ల నుంచే భక్తులు ఎవరైనా అమ్మవారి పుష్కరిణిలోకి వెళ్లాలి. పుత్తూరు వైపు నుంచి వచ్చే భక్తులకు గోశాల, జడ్పీ హైస్కూల్‌.. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట వైపు నుంచి వచ్చే భక్తులకు నవజీవన్‌ ఆస్పత్రి వద్ద హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ మూడు చోట్ల నుంచి విడతలవారీగా ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా పాత పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉన్న గేట్‌ నెంబరు 4 నుంచి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. పుష్కరిణిలో స్నానాలు పూర్తి చేసుకున్న భక్తులను గేటు నెంబరు 5 గుండా ఘంటసాల విగ్రహంవైపు, గేటు 6 నుంచి సమాజంవీధి గుండా తోలప్ప గార్డెన్‌వైపు మళ్లిస్తారు. గేట్‌ నెంబరు 3 నుంచి భక్తులు వెలుపలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు భక్తులను పుష్కరిణిలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. పుష్కరిణిలోకి వెళ్లి.. రావడానికి 28 గేట్లు ఉన్నాయి. అందులో పసుపు మండపం వద్దనున్న మూడింటిని వీఐపీలు, అమ్మవారి ఉత్సవమూర్తి రావడానికి వినియోగిస్తారు. టీటీడీ ఉద్యోగులను గేటు నెంబరు మూడు నుంచి అనుమతిస్తారు.

లక్ష మందికి అన్నప్రసాదాలు

లక్షమందికిపైగా అన్నప్రసాదాలు అందించేందకుఉ 120 ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం వెజిటబుల్‌ ఉప్మా, పొంగల్‌తోపాటూ బాదంపాలు అందజేస్తారు. మధ్యాహ్నం పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, కదంబం ఇవ్వనున్నారు. లక్షన్నర నీళ్ల బాటిళ్లను సిద్ధం చేశారు. గురువారం రాత్రికే పెద్ద ఎత్తున చేరుకునే తమిళనాడు భక్తులను హోల్డింగ్‌ పాయింట్లకు తరలించి అన్నప్రసాదాలు అందజేస్తారు.

పార్కింగ్‌ ప్రదేశాలివే

గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు తిరుచానూరులోకి ఎటువంటి వాహనాలను అనుమతించరు. భక్తుల వాహనాలు మినహా మిగిలిన వాటిని దారి మళ్లించనున్నారు. తిరుపతి నుంచి వచ్చే భక్తుల వాహనాలకు మార్కెట్‌ యార్డు, శిల్పారామం.. చంద్రగిరి వైపు నుంచి వచ్చే వాటికి తనపల్లె వెళ్లే 150 బైపాస్‌ రోడ్డు, రామానాయుడు కల్యాణ మండపం.. రేణిగుంట వైపు నుంచి వచ్చే వాటికి తిరుచానూరు దళితవాడ వద్ద.. పుత్తూరు నుంచి వచ్చే వాహనాలకు ముండ్లపూడి క్రాస్‌ సమీపంలో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి భక్తులు హోర్డింగ్‌ పాయింట్లకు నడిచి వెళ్లాలి.

260 మొబైల్‌ మరుగుదొడ్లు

తాత్కాలికంగా 260కిపైగా మొబైల్‌ టాయిలెట్లను టీటీడీ ఏర్పాటు చేసింది. అంబులెన్స్‌, వైద్యులు, ప్రథమ చికిత్స కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణకు వందలాది మందిని కేటాయించారు.

1600 మందితో బందోబస్తు: ఎస్పీ

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పంచమి తీర్థానికి 1600 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. తిరుచానూరులో బుధవారం ఆయన పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. భక్తులందరూ పుష్కరిణిలో స్నానాలు ఆచరించేలా విడతల వారీగా పుష్కరిణిలోకి అనుమతించాలని సూచించారు. చిన్న దొంగతనాలు, తొక్కిసలాట, తోపులాటలకు తావులేకుండా పనిచేయాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. తిరుచానూరు చుట్టుపక్కల రోడ్లు ఎంత క్లియర్‌గా వుంటే వాహనాల రాకపోకలకు అంత సులువుగా ఉంటుందన్నారు. భక్తులను తనిఖీ చేశాక హోల్డింగ్‌ పాయింట్లలోకి అనుమతించాలన్నారు. పుష్కరిణిలో స్నానమాచరించే సమయంలో ఎవరైనా అకతాయిలు వెకిలి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు రవిమనోహరాచ్చారి, నాగభూషణరావు, రామకృష్ణ, చిత్తూరు రిజర్వు అదనపు ఎస్పీ నందకిషోర్‌కుమార్‌, వీజీవో రాంకుమార్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. పోలీసులతో పాటు 400 మంది టీటీడీ భద్రతా సిబ్బంది, 200 మందిస్కౌట్లు, 200 మంది శ్రీవారి సేవకులను టీటీడీ ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 05 , 2024 | 01:54 AM