Share News

తుడా ఎవరికి?

ABN , Publish Date - Nov 15 , 2024 | 02:17 AM

తుడా ఛైర్మన్‌ పదవిఎవరికి దక్కుతుందనేది జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన నామినేటెడ్‌ పదవులు చాలావరకూ భర్తీ అయిన సంగతి తెలిసిందే.

తుడా ఎవరికి?

టీడీపీ, జనసేన ఆశావహుల పోటీతో ప్రతిష్టంభన

తుడా ఛైర్మన్‌ పదవిఎవరికి దక్కుతుందనేది జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన నామినేటెడ్‌ పదవులు చాలావరకూ భర్తీ అయిన సంగతి తెలిసిందే. తుడా ఛైర్మన్‌ పదవిని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీల నుంచీ పలువురు ఆశించి పోటీ పడుతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. టీటీడీ ఎక్స్‌ అఫిషియో సభ్యత్వం పేరిట అదనపు హోదా తోడవుతున్నందున పలువురి కన్ను తుడా ఛైర్మన్‌ పదవిపై పడుతోంది. ఇతర పదవులు దక్కని వారు కూడా దీనికోసం రేసులో నిలుస్తున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ ఈ పదవికి పోటీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నిర్ణయం కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

- తిరుపతి, ఆంరఽధజ్యోతి

టీడీపీ రేసులో పలువురు

తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు రెండూ కూటమి భాగస్వామ్య పక్షాలకు కేటాయించిన కారణంగా తిరుపతిలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే తుడా చైర్మన్‌ పదవి టీడీపీ ఖాతాలోనే ఉండాలని ఆ పార్టీ స్థానిక నాయకులు ఆశిస్తున్నారు. తొలినుంచీ ఈ పదవికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం, మబ్బు దేవనారాయణరెడ్డి, డాలర్స్‌ దివాకర్‌రెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే నరసింహ యాదవ్‌కు యాదవ సంక్షేమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చినప్పటికీ ఆయన ఆ పదవి పట్ల సంతృప్తిగా లేరని సమాచారం. తనకు తుడా ఛైర్మన్‌గా అవకాశం కల్పించాలని కోరినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఆయన మళ్లీ రేసులోకి వచ్చినట్టయింది. టీటీడీ బోర్డు మెంబరు పదవి ఆశించి నిరాశకు గురైన పార్టీ మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ పేరు కూడా పార్టీ పరిశీలిస్తున్న జాబితాలో చేరింది. ప్రస్తుత దశలో వీరందరితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సతీమణి సుధారెడ్డిల పేర్లు కూడా అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి.

జనసేన నుంచి తీవ్ర పోటీ

జనసేన పార్టీ నుంచీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌, తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌ ఇద్దరూ తుడా ఛైర్మన్‌ పదవి ఆశించారు. అయితే హఠాత్తుగా నిర్మాత ఎన్‌వీ ప్రసాద్‌ పేరు తెరపైకి వచ్చింది. ఆయన కోసం మెగాస్టార్‌ చిరంజీవి గట్టిగా పట్టుబడుతున్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు చిత్తూరు మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఆమె పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు, లోకేశ్‌లు ముగ్గురినీ కలసి తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఇరు పార్టీల వర్గాలూ చెబుతున్నాయి. అయితే చైతన్యకు కాకుండా ఆమె తల్లికి ఏదో ఒక పదవి కేటాయిస్తామంటూ అధినేతలు నచ్చజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తికి చెందిన ఓ టీడీపీ ముఖ్యనేత ఆమెకు తుడా చైర్మన్‌ పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీడీపీ అధినేత నిర్ణయంపై ఉత్కంఠ

ఇంతకీ తుడా పదవి టీడీపీ వారికా, జనసేనకా అనే చర్చ జోరుగా సాగుతోంది. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీకి కావాలని గట్టిగా పట్టుబట్టని పక్షంలో టీడీపీ వారికే దక్కుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అధినేత నుంచీ సూచనప్రాయంగా కూడా ఎలాంటి సంకేతాలూ అందకపోవడంతో దీనిపై ప్రత్యేకించి తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల టీడీపీ, జనసేన వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంటోంది. అధినేత నిర్ణయం ఎలా ఉన్నా ఇక్కడి నేతలు శిరసావహించే పరిస్థితి ఉంది. అయితే ఆ నిర్ణయమే తిరుపతిలో టీడీపీ భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే చంద్రబాబు తీసుకునే నిర్ణయం కోసం రాజకీయ వర్గాలతో పాటు ఈ ప్రాంత ప్రజానీకం సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Updated Date - Nov 15 , 2024 | 02:17 AM