వరద ప్రవాహంలో ఇద్దరి గల్లంతు
ABN , Publish Date - Dec 04 , 2024 | 01:34 AM
రొయ్యల కాలువ వంతెన వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. ఆ మార్గంలో అధికారులు రాకపోకలను ఆపేశారు. అడ్డంగా ముళ్లకంపలు వేశారు.
ఒకరి మృతదేహం లభ్యం
మల్లాం రొయ్యల కాలువ సమీపంలో ఘటన
చిట్టమూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రొయ్యల కాలువ వంతెన వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. ఆ మార్గంలో అధికారులు రాకపోకలను ఆపేశారు. అడ్డంగా ముళ్లకంపలు వేశారు. పోలీసులు కాపలా ఉంటున్నారు. ఆ మార్గాన వెళ్లడం ప్రమాదకరమని ద్విచక్రవాహనంలోని ఇద్దరిని మంగళవారం ఉదయం హెచ్చరించారు కూడా. బైకునూ నిలిపేశారు. అయినా వీరు పోలీసులు ఆదమరవగానే వెళ్లారు. గల్లంతయ్యారు. ఈ ఘటన చిట్టమూరు మండలం కొత్తగుంట- మల్లాం మార్గంలోని బాలచంద్రారెడ్డి ఎస్టేట్ సమీపాన చెప్టా వద్ద, రొయ్యల వాగు సమీపంలో చోటు చేసుకుంది. కోట మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన.. ప్రస్తుతం అత్తగారి ఊరైన బుచ్చిలో స్థిరపడి.. చిట్టమూరు కొత్తగుంట వద్ద చికెన్‌షాపులో మేనేజరుగా పనిచేస్తున్న వేణుంబాక మధుసూదన్‌రెడ్డి(45), ఇదే షాపులో పనిచేసే జార్ఖండ్‌కు చెందిన ఎండీ షారుక్(23) నీళ్లలో పడిపోయారు. మధుసూదన్‌రెడ్డి కొట్టుకుపోగా.. చెట్టును పట్టుకున్న షారుక్ అతడిని రక్షించడానికి సెల్‌ఫోనును ఆ చెట్టుపై పెట్టి వాగులో దూకారు. ఈ క్రమంలో ఈయనా గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసి ఎంపీడీవో మనోహర్‌గౌడ్, తహీల్దారు ప్రసాద్, సీఐ హుస్సేన్ బాషా, ఎస్‌ఐ చిన్న బలరామయ్య, వాకాడు ఎస్‌ఐ నాగబాబు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. కోట ఫైర్ ఇంజన్ సిబ్బందితో గాలించినా ఫలితం లేకపోవడంతో జాలర్లను తీసుకొచ్చి వలల సాయంతో వెదికారు. మధుసూదన్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం కొరకు బాలిరెడ్డిపాళెం ఆసుపత్రికి తరలించారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి అదనపు ఎస్పీ మనోహరాచారి సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. చీకటి పడడంతో షారూక్ ఆచూకీని గుర్తించలేరు. పోలీసుల మాట పెడచెవిన పెట్టడంవల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని అధికారులు అంటున్నారు.